Home జాతీయ వార్తలు హిందూ మహాసముద్రంలో నౌకా దుర్గం

హిందూ మహాసముద్రంలో నౌకా దుర్గం

modi

సిషీలియస్ భారత్ సంయుక్త ప్రాజెక్టు 

న్యూఢిల్లీ: కీలక రంగాలలో కలిసికట్టుగా ముందుకు సాగాలని భారతదేశం, సిషీలియస్‌లు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, సిషిలియస్ దేశాధ్యక్షులు డానీ ఫౌరే మధ్య సోమవారం కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అసంప్షన్ ఐలాండ్ వద్ద నౌకా స్థావరం ఏర్పాటుకు ఉమ్మడి ప్రాజెక్టుపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. పరస్పర సమస్యలను అర్థం చేసుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. సిషీలియస్ తన రక్షణ సామర్థం పెంచుకోవడానికి పదికోట్ల డాలర్ల ఆర్థిక సాయం నిర్ణయం కూడా జరిగింది. ఈ సాయంతో ఆ దేశం సముద్రతీర రక్షణ సామర్థం పెంచుకోవడానికి వీలేర్పడుతుందని ప్రధాని మోడీ సంయుక్త ప్రకటనలో తెలిపారు. సిషీలియస్‌కు చెందిన అసంప్షన్ ఐలాండ్ వద్ద కీలకమైన నౌకా స్థావరం ఏర్పాటు ఆ దేశ రక్షణకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక సానుకూలత దక్కుతుంది. పలు అంశాలపై , పరస్పర హక్కులపై కలిసికట్టుగా పురోగమించాలని నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. రెండు దేశాలూ కలిసి నౌకా స్థావరం నిర్మాణం దిశలో పనిచేస్తాయని సిషీలియస్ దేశాధ్యక్షులు ఫౌరే తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలే కీలకం అని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో చర్చలు జరిగాయి. సిషీలియస్ దేశాధినేత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ సాదర స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వచ్చి ఆయనను కలుసుకుని చర్చలు జరిపారు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారం విస్తృతికి తగు చర్యలు తీసుకోవల్సి ఉందని సుష్మా సూచించారు. ప్రత్యేకించి సామర్థ నిర్మాణం, మానవ వనరుల వృద్ధికి సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్‌లో ఆరురోజుల పర్యటన కోసం డానీఫౌర్ వచ్చారు. తొలుత ఆయన గుజరాత్‌కు చేరుకుని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అహ్మదాబాద్‌లో ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను కూడా పరిశీలించారు. తరువాత గోవాకు వెళ్లారు. ఆదివారం రాత్రి దేశ రాజధానికి చేరారు. హైదరాబాద్ జూకు సిషీలియస్ తాబేళ్లు ఃభారత్‌తో సత్సంబంధాల సూచికగా సిషీలియస్ దేశాధినేత డానీ ఫౌరే భారత్‌కు రెండు అపురూపమైన భారీ తాబేళ్లను కానుకగా అందించారు. అత్యంత సుదీర్ఘ జీవన ప్రమాణం ఉన్న ఈ అల్డాబ్రా తాబేళ్లు మూడు శతాబ్దాలను చూశాయని డేనీ తెలిపారు. ఈ కానుకల పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత స్నేహబంధానికి ఇవి ప్రతీక అని పేర్కొన్నారు. దాదాపుగా 15 కిలోల బరువున్న ఈ తాబేళ్లకు ఎంతో విశిష్టత ఉంది. ఈ జంట తాబేళ్లను హైదరాబాద్‌లోని జూకు పంపిస్తారని విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది.
పానాజీ మేయర్‌తో చర్చలు
భారత్ పర్యటనలో ఉన్న సిషీలియస్ దేశాధ్యక్షులు గోవా సందర్శనలో భాగంగా పానాజీ మేయర్ విఠల్ ఛోప్దేకర్‌తో చర్చలు జరిపారు. పానాజీ, సిషీలియస్‌లోని విక్టోరియా నగరాల మధ్య కీలక అనుసంధాన ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు నగరాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల ఏర్పాటుకు, సామాజిక చట్టపరమైన సయోధ్యకు దీని వల్ల వీలేర్పడుతుంది.