Search
Friday 16 November 2018
  • :
  • :

మిస్త్రీ తొలగింపు సరైనదే..

BS

 టాటా సన్స్‌కు అనుకూలంగా ఎన్‌సిఎల్‌టి తీర్పు

 మిస్త్రీ పిటిషన్ తిరస్కరించిన ఎన్‌సిఎల్‌టి బెంచ్

న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఆకస్మికంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ముంబై ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా బోర్డు) తిరస్కరించింది. మిస్త్రీ తొలగింపు సరైనదేనని, ఆయన్ని తొలగించేందుకు టాటాసన్స్ బోర్డుకు పూర్తి అధికారం ఉందని తెలిపింది. రెండేళ్లుగా నడుస్తున్న న్యాయ పోరాటంలో ఎన్‌సిఎల్‌టి కీలక తీర్పును వెల్లడించింది. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పించినందుకు గాను మైనారిటీ వాటాదారులు టాటా సన్స్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఎన్‌సిఎల్‌టి తాజాగా పిటిషన్‌ను తిరస్కరించింది.
వివాదం కథాకమామిషు…
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి రతన్ టాటా 2012లో తన పదవి నుంచి వైదొలగిన తర్వాత సైరస్ మిస్త్రీ బాధ్యతలను అప్పగించారు. అనూహ్య పరిణామాల మధ్య 2016 అక్టోబర్‌లో టాటాసన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తొలగిస్తూ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తనను తొలగించిన తీరు సరైంది కాదని, ఒత్తిడి తీసుకొచ్చారని సవాలు చేస్తూ మిస్త్రీ కుటుంబం రెండునెలల తర్వాత ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించింది. కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ బోర్డు ట్రస్టీలు అధికార దుర్వినియోగం చేశారని, మైనార్టీ వాటాదారుల హక్కులను తుంగలోతొక్కారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలను టాటాసన్స్ కొట్టి పారేసింది. తదనంతరం టాటా సన్స్ డైరెక్టర్ పదవి నుం చి కూడా మిస్త్రీని బోర్డు తొలగించింది. బోర్డు ఆయనపై విశ్వాసం కోల్పోవడంతోనే ఈ చర్య తీసుకుందని టాటాసన్స్ పేర్కొంది. కాగా మిస్త్రీ తొలగింపు చట్టప్రకారం జరగిందని టాటాసన్స్ ఎన్‌సిఎల్‌టిలో వాదించింది. బోర్డులోని మెజార్టీ డైరెక్టర్లు మిస్త్రీ తొలగింపునకు అనుకూలం గా ఓటు వేశారని పేర్కొంది. మొత్తం 9 మంది డైరెక్టర్లలో ఏడుగురు మిస్త్రీ తొలగింపును సమర్థించారని తెలిపింది.
15 శాతం పెరిగిన టాటా గ్రూప్ స్టాక్స్
ఎన్‌సిఎల్‌టి ఇచ్చిన తీర్పు టాటా సన్స్‌కు అనుకూలంగా రావడంతో స్టాక్‌మార్కెట్లో కంపెనీలు షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, టాటా గ్లోబల్ బెవరేజ్, టాటా కమ్యూనికేషన్స్, టాటా ఎలెక్సి, టాటా కెమికల్స్, టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర), టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ ఐరన్ వంటి సంస్థలు 1 నుంచి 5 శాతం మధ్య ర్యాలీని చూపాయి. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మంగళవారం క్యూ1 ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఈ షేరు పతనమైంది.

Comments

comments