Home ఎడిటోరియల్ కొత్త, సమగ్ర రెవెన్యూ చట్టమే పరిష్కారం

కొత్త, సమగ్ర రెవెన్యూ చట్టమే పరిష్కారం

Chada-Venkat-Reddy22పాత సంస్థానాల్లో, హైదరాబాద్ ఒకటి. ఇక్కడ స్వతంత్రం సిక్కా, న్యాయవ్యవస్థ ఉండేది. భూముల రికార్డులు పాలన కూడా దేశముఖులు, జమీం దారులు, జాగిరుదారులు, మక్తా, వతన్‌దారుల వ్యవస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక పాలన సాగింది. స్వంత అవసరాలకు మన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల భూములు, నిజాం నవాబు ఖల్సాపేరుతో ఉంచుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతుల్లోనే భూమి రికార్డులు నసాగుతున్నాయి. పహాణి, చౌపస్తా, టీపెన్, గ్రామాలవారి నక్షలు కలగి భూమి శిస్తూ వసూలు చేయబడేది. 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటికీ రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేయబడ లేదు. ఆంధ్రప్రాంతానికి, తెలంగాణకు రెవెన్యూ చట్టాలు వేరువేరుగా ఉన్నాయి. 1991 సంవత్స రంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టబడిన తర్వాత ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో భూమి లాభసాటి వ్యాపారంగా మారి పోయి, రియల్‌ఎస్టేట్ అనే ముద్దు పేరుతో ఢిల్లీ నుండి గల్లీ దాకా విస్తరించింది.

మధ్య దళారీల బెడద విపరీతంగా పెరిగిపోయింది. సర్వేనంబర్ అడ్వాన్సులు ఇచ్చి, పక్కనున్న శిఖం ప్రభుత్వం తదితర భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయడం ఆరంభమయింది. సర్వే నంబర్‌లో ఉన్న రక్బా కంటె ఎక్కువనే రిజిస్ట్రేషన్ చేయడంతో భూములు అన్యాక్రాంతం వేగవంతమయింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో భూముల రికార్డులు, హద్దులు, రెవెన్యూ, ఇతర వ్యవస్థల అవినీతికి నిలయాలుగా మారినందున అసలు సిసలైన ఎస్.సి., ఎస్.టి,. బి.సి, సన్న, చిన్నకారు రైతులు చిన్నాభిన్నమైనారు. భూముల తగవులు ముదిరిపోయి పోలీసుస్టేషన్, రెవెన్యూ, కోర్టులలో సంవ్సతరాల తరబడి తిరగడం, ఆర్థికంగా, మానసికంగా కృంగిపోవడం ఈనాటి తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి.

85 ఏళ్ళ నాటి సర్వేనే ఆధారం
హైదరాబాద్ రాష్ట్రంలో 85 సంవత్సరాల క్రిందట భూసర్వే జరిగింది. సర్వేనెంబర్ల వారిగా కొలతలు చేసి హద్దులపై కనీలు పాత వాటి కొలతలను నక్షాల రూపంలో సర్వే మరియు ల్యాండ్ రికార్డుశాఖకు అప్పచెప్పడం జరిగింది. భూముల వర్గీకరణలోనే అనేక మార్పులు వచ్చాయి. దళిత, గిరిజనులకు భూములను అసైన్ చేయటం జరిగింది. చిన్నచిన్న కమతాలు ఏర్పడినాయి. ఇనాం భూములున్నాయి. చెరువు శికం భూములున్నాయి. ప్రభుత్వ బంజర్లు, నాలా భూములు, వివిధ కేటగిరిల క్రింద విభజింపబడినాయి. బంచరాయి, పొరంబోకు భూములను పేదవారికి లావోని పట్టాలు ఇచ్చినప్పటికీ కొన్ని గ్రామాలలో వారికి హద్దులు చూపించి రికార్డులో నమోదు చేయలేదు. కాస్తులో ఉన్న నిరుపేదలకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వబడలేదు. దీనివల్ల గ్రామాలలో తగాదాలు ఏర్పడి ఊరిలో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టడం, పోలీసుస్టేషన్‌ల చుట్టు తిరగడం, విధిలేక కోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. ఒక సర్వే నెంబరులో బిట్లవారిగా (ఎ,బి,సి) ల క్రమం పహాణీలో నమోదు చేయబడినవి. కాని వాటికి హద్దులు చూపడానికి టీపెన్‌లులో నిర్ధారణ చేయబడలేదు.

బిట్లవారిగా లేదా సర్వే నంబర్ పట్టాల్లో ఉన్న భూమి సర్వే నెంబరుకు, విస్తీర్ణానికి పొంతన లేదు. ప్రభుత్వం భూములు పంచినా, హద్దులు నిర్ధారించి పట్టాలివ్వ బడలేదు. పట్టాలిస్తే హద్దులు చూపబడలేదు. ఈ రెండు జరిగిన దగ్గర ప్రభుత్వం పంచింది రెవెన్యూ భూమి కాదని అటవీ అధికారులు పేచిపెట్టడం జరుగుతున్నది.భూమిపై వాస్తవస్థితి, భూమి రికార్డులో ఉన్న వివరాలకు పొంతనలేదు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు సరిగ్గా నమోదు కాక, లేదా తప్పుడు వివరాలు నమోదై కొన్ని వేల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 భూముల తగాదాలు, సమస్యలు ఉంటాయని అంచనా.పేద ప్రజలకు అసైన్‌చేసిన లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది. గిరిజన ప్రాంతాలలో యాబైశాతంపైగా భూమి గిరిజనేతరులు ఆధీనంలో వుంది. రికార్డు అస్తవ్యస్తంగా ఉన్నది. సాగులో భూమి, చేతిలో పట్టా మరియు రికార్డుల్లో పేరు ఉంటేనే భూమిపై హక్కుకి పూర్తి భద్రత. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉండి పట్టాలేనివారు పట్టా వుండి భూమి లేనివారు, పేరు ఉన్నా సరిగా నమోదు కాకపోవడం, నమోదైనా హద్దులు గందరగోళంగా ఉండటం జరుగుతున్నది.

గ్రామీణ ప్రాంతాలలో దాదాపు యాభైశాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. ఈ కుటుంబాలలో ఎక్కువ మంది దళితులు, గిరిజ నులున్నారు. దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు సాగుభూమిలేదు. కనీసం ఇంటిస్థలం కూడా లేదని ఒక అంచనా. గతంలో పటేల్, పట్వారి వ్యవస్థలు పట్టా, పహానీ, నెం. 4 అనే రిజిష్టర్లు వేరు వేరుగా వ్రాయబడినవి. ఏ సర్వే నెంబరులో ఏపంట వేశారో రిజిస్టర్‌లో వ్రాసేవారు. ప్రతి సంవత్సరం రైతుభూమి కొన్నా, అమ్మినా రికార్డు చేసేవారు.తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఈ బాధ్యతలు మండలాధికారికి అప్పచెప్పారు. మండలానికి నలుగురైదుగురు గ్రామ రెవెన్యూ అధికారులుండేవారు. వారికి ప్రత్యేక శిక్షణ లేదు. వారు రికార్డులను సరిగా చూడక ఇష్టమొచ్చి నట్లు వ్రాసేవారు. కొన్నా, అమ్మినా సరియైన రికార్డులు లేక రికార్డు ఆఫ్ రైట్స్ (ఆర్ ఒ ఆర్) అనే పేర క్రయవిక్రయాలు పరిశీలించి రిజిష్ట్రేషన్ కార్యాల యంలో నిర్దారించి రుసుం చాలాన్ కట్టించుకొని ఆర్‌ఒఆర్ ద్వారా 1బిలో ఎక్కించి పట్టేదారు పాసుపుస్తకాలు ఇచ్చుటకు ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చింది. దీనిని ఆసరాగా తీసుకొని రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి. ఒకే సర్వే నంబర్‌ను ఇద్దరు రైతులకు పట్టేదారు పాసుపుస్తకాలు ఇచ్చి రైతుల మధ్య తగవులు పెట్టించారు. ఆర్‌డిఒ, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలలో కేసులు నడుస్తున్నాయి.

భూముల రీసర్వే చేయాలి
ప్రస్తుతం కంప్యూటర్ పహాణీ, 1బి తప్పనిసరిగా ఉంటేనే రైతులకు బ్యాంకులు అప్పు ఇస్తాయి. రికార్డు ఆఫీసులో చూస్తే పట్టాలో ఒక పేరు ఉంటే పహానిలో మరొక పేరు. పేరు ఉన్నా అది కొలతలకు అనుగుణంగా లేని పరిస్థితి.ఈ నేపథ్యంలో వెంటనే భూమిని సర్వే చేయించాలి. భూమిని సర్వే చేసిన తరువాత రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి సర్వే నంబర్‌వారిగా వివరాలు చదివి వినిపించాలి. వివాదాలుంటే అక్కడే పరిష్కరించాలి. గ్రామంలో లేనివారికి నోటీసులు ఇవ్వాలి. వారసత్వంగా సంక్రమించిన భూమి హక్కులను సైతం గ్రామసభలలోనే రికార్డు చేయాలి. ఈ సభలలో హద్దులు పరిష్కరించాలి. అసైన్డ్ భూము లను ఎవరైనా మోసగించి, అన్యాక్రాంతం అవుతే అవి ఒరిజినల్ పట్టాదారుకు ఇప్పించాలి. ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు అక్కడికక్కడే దళితులకు, గిరిజనులకు ప్రాధాన్యత, తదనంతరం అత్యంత వెనుకబడిన వర్గాలు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు పంచాలి. తెలంగాణ గడ్డపైన నైజాం నిరంకుశ పాలనకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చరమగీతం పాడుతూనే దున్నేవానికే భూమికావాలని ప్రపంచంలోనే చారిత్రాత్మక సాయుధ పోరాటం నిర్వహించ బడింది.

దీని ప్రభావం వల్ల ఈ గడ్డపైనే భూదా నోద్యమం వచ్చింది. అది చివరికి పరిమితంగానైనా భూసంస్కరణల చట్టం అమలులోకి వచ్చింది. 40 సంవత్సరాలు దాటినా ఆ ఫలితాలు పేదలకు అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో భూసమస్యలపై ఒక చట్టం రూపొందించాలి. అయితే, కాల పరిమితితో కూడిన అంశాలు చేర్చాలి. శిఖం భూములు, ఇనాం భూములు, దేవాదాయ ధర్మాదాయ భూములు, బంచరాయి భూములు, వ్యవసాయం చేయలేక ప్రభుత్వానికి వదిలిన భూములు, దేశ విభజన సందర్భంగా ప్రభుత్వానికి వదలి వెళ్ళిన భూముల వివరాలు హద్దులతో సహా రికార్డుకావాలి. ఈ కార్యక్రమంలో జాప్యం లేకుండా ఒక సంవత్సరం లోపుగా హద్దులు నిర్ణయించడం, గ్రామసభలలో వివాదాలను పరిష్క రించడం కొరకు ప్రస్తుతం అమలులో వున్న అన్ని భూమి చట్టాలను, నియమాలను, ప్రభుత్వ ఉత్తర్వు లను పునర్ సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. ఇందుకోసం సమగ్రమైన బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపచేసి చట్టం చేయడం ద్వారా గ్రామసీమల్లో అశాంతికి చరమగీతం పాడాలని కోరుతున్నాం.

సూచనలు :
1) ఒక సంవత్సర కాలంలోపుగా భూమి సర్వే పూర్తి చేయాలి.
2) అసైన్డ్ భూమి చట్టం నుండి ఎప్పుడైనా ఆ భూమిని ప్రభుత్వం ప్రజాప్రయోజనార్థం వెనక్కు తీసుకోవచ్చు అనే అంశాన్ని తొలగించాలి.
3) రెవెన్యూ భూములఅటవిభూముల వివాదాలను ఒక సంవత్సరం లోపుగా ట్రిబ్యునల్స్ ద్వారా తేెల్చాలి. అటవి హక్కుల చట్టం2006ను అమలు చేయాలి.
4) గ్రామాలలో ఉన్న భూవివాదాలను గ్రామసభలలోను, పరిష్కారం కాని పక్షంలో సంచార న్యాయస్థానాల ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిష్కరించాలి.
5) భూస్వాములు బినామిల ద్వారా భూసంస్కరణల నుండి తప్పించుకునే వారి ఆటలు సాగనివ్వకుండా చేయాలి.
6) వేసవి కాలంలోనే గ్రామసభలు జరగాలి. వివాదాలు పరిష్కారం చేయాలి. విరాసత్ కూడా ఇక్కడే రికార్డు చేయబడాలి.
7) సీలింగ్ కేసులలో మిగులు భూములను నిర్దారిస్తూ నిర్ణయం చేసిన తరువాత ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని భూస్వాముల లిటిగేషన్‌లకు తావివ్వకుండా పేదలకు పంచాలి. రికార్డులలో చేర్చాలి.
8) భూసంస్కరణలకు సంబంధించి వివిధ కోర్టులలో పెండింగ్‌లోవున్న కేసులను ఒక సంవత్సరం లోపుగా పరిష్కరించాలి. స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రత్యేక కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసి పరిష్కరించాలి.
9) కొనేరు రంగారావు సిఫార్సులను అమలు చెయ్యాలి.
10) సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన పేదలకు పట్టాలు అందచెయ్యాలి.
11) పట్టాభూముల వర్గీకరణ జరగాలి.