Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఇరోం షర్మిల కొత్త జీవితం

Irom-Sharmila

సంపాదకీయం..

మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోం షర్మిల తన 16 సంవత్సరాల నిరాహారదీక్షను మంగళవారం తేనె చుక్క సేవించి విరమించుకుంది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా) ఉప సంహరణ కొరకు ఆమె ఈ అపూర్వ దీక్ష పూనింది. ఈ గాంధేయ పోరాట మార్గం యావత్ ప్రపంచంలోనే అరుదైన ఘటన. ఆత్మహత్యాప్రయత్నం నేరం కింద అరెస్టు చేసి అనేక సంవత్సరాలుగా జుడీషియల్ కస్టడీలో ఉంచబడిన ఆమెకు ఇంత వరకు ముక్కుద్వారా ద్రవపదార్థం మాత్రమే అందుతోంది. సైనికులు ఇంఫాల్‌లో 10మందిని హతమార్చిన ఘటనతో చలించిపోయిన షర్మిల, ఆ నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని 2000 వ సంవత్సరంలో తన 28వ ఏట నిరాహార వ్రతం ఆరంభించింది. తిరుగుబాటుదారులను అణచివేసే నిమిత్తం 1958లో రూపొందించబడిన అఫ్‌స్పా అత్యంత నిరంకుశమైంది. సైనికులు ఏ కారణంతో ఎట్టి ఘోరాలకు పాల్పడినా, మనుషుల్ని నిర్మూలిం చినా, నేరారోపణనుంచి వారికి పూర్తి రక్షణ కల్పిస్తోందీ చట్టం. ఇదే చట్టం కశ్మీర్‌లో కూడా అమలులో ఉంది. అమానుషమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇరోం షర్మిల పోరాటం ఏమైనా ఫలిత మిచ్చిందా? లేదనే చెప్పాలి. అయితే కల్లోలిత ప్రాంతాల్లో చర్యలకుగాను క్రిమినల్ నేరారోపణ నుండి భద్రతా దళాలు ఆ చట్టంకింద పొందుతున్న రక్షణను సుప్రీంకోర్టు నెలరోజులక్రితం ప్రశ్నించింది. సైన్యా నికి చెందిన వ్యక్తి నేరం చేసినట్లయితే క్రిమినల్ కోర్టులో విచారణనుంచి ‘పరిపూర్ణ రక్షణ ’ అంటూ ఉండదని చెప్పింది.
అఫ్‌స్పాపై వ్యతిరేక పోరాటానికి షర్మిల ప్రతీకగా నిలిచింది. ఆమె పోరాటానికి మిలిటెంట్ గ్రూపులనుంచే గాక ప్రజలనుంచి కూడా సంఘీ భావం ఉంది. నిరాహారదీక్షను విరమించుకోబో తున్నట్లు ఆమె ప్రకటించిన తదుపరి, విరమించవద్దని ఆమెపై ఒత్తిడి వచ్చింది, బెదిరింపు హెచ్చరికలు కూడా వచ్చాయి. ‘నా జీవితం – నా నిర్ణయం’ అని స్పష్టం చేసిన ఆమె తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించారు. ఒకటి, వివాహం చేసుకోవటం, రెండు రాజకీయాల్లో ప్రవేశించటం. రచయిత, హక్కుల కార్యకర్త అయిన బ్రిటిష్ జాతీయుడు – గోవాలో జన్మించిన డెస్మండ్ కౌటిన్ హో ఆమెతో కొద్ది సంవత్సరాలుగా పరిచయం పెంచుకున్నారు. అతని ప్రభావంతోనే ఆమె దీక్ష విరమణ నిర్ణయం తీసు కున్నట్లు భావించబడుతున్నది. కోర్టునుంచి బెయిలు పై విడుదలైన అనంతరం షర్మిలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో విలువైన 16 సంవత్సరాల జీవితాన్ని ఒక లక్షం కొరకు వెచ్చిం చిన షర్మిల అలాగే ప్రతిఘటనకు ప్రతిరూపం గా ఉండాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నట్లు విదిత మవుతున్నది. కోర్టు బెయిల్ ఇచ్చిన తదుపరి పోలీసు ల రక్షణలో తనకు పరిచయమున్న డాక్టర్ సురేష్ ఇంటికి వెళితే స్థానికులు నిరసన తెలపటం, ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న ఆశ్రమానికి వెళితే అక్కడ కూడా నిరసనలు వ్యక్తం కావడం చూస్తే ఆమె దీక్ష విరమించటాన్ని కొన్ని శక్తులు అంగీకరించటం లేదని స్పష్టమవుతున్నది. తన గమ్యం సాధించేవరకు తన వృద్ధమాతను కలవనని ఆమె చెప్పింది. ఏదైనా ఆశ్రమంలో ఉండాలని నిశ్చయించుకుంది. తిరుగు బాటు గ్రూపులనుంచి ఆమె ప్రాణానికి గల ప్రమా దం నిరాకరించలేనిది. అందువల్ల ఆమెకు ప్రభుత్వం నుంచి రక్షణ కొనసాగాలి.
రాజకీయాల్లో ప్రవేశించి, ముఖ్యమంత్రి కావాల నే కోర్కెను వెలిబుచ్చింది షర్మిల. అయితే ఏ పార్టీలో చేరబోనని, వచ్చే సంవత్సరం ఎన్నికలలో ఇండి పెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించి “ఎంతోకాలంగా ఆశిస్తున్న మార్పు”ను సాధించాలనుకోవటం మంచిదే. అయితే ఇండి పెండెంట్‌గా పోటీచేసి ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషే ఆమెలోని రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతున్నది. చిన్న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉన్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి (ఔటర్ మణిపూర్) అంటే దాదాపు సగం రాష్ట్రం తిరుగుబాటు గ్రూపుల ప్రభావంలో ఉంటుంది. వారు తోడ్పాటిచ్చిన వారే గెలుస్తుంటారు. వారిని సంస్క రించి శాంతియుత ప్రజాస్వామ్యం బాటలోకి తేవటం షర్మిలకు శక్తికి మించిన పని. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి ‘మార్పు’ కొరకు కృషి చేయాలన్న ఆమె ఆకాంక్ష ఆహ్వానించదగిందే అయినా అది ఏమంత సులభం కాదు.
మణిపూర్‌నుండి సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్నది రాజకీయ డిమాండ్. కేంద్రప్రభుత్వం తిరుగుబాటు దారులను అదుపు చేసేందుకు సైన్యంపై ఆధారపడుతోంది. తిరుగుబాటుదారుల అణచివేత పేరుతో భద్రతా బలగాలు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా, వారిని శిక్షించే అవకాశం లేనందున ప్రజల నుంచి సైన్యం దూరమైంది. ఇరోం షర్మిల తన హక్కుల పోరాటాన్ని మరో రూపంలో కొనసాగించాలంటే తన లక్షంతో కలసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలను ఒక త్రాటిపైకి తెచ్చి ఉమ్మడి పోరాటం సాగించాలి. ఏమైనా, సుదీర్ఘ కాలంగా ఘనపదార్థం తీసుకోనందున తగు పోషక విలువలు అందక ఆమె శారీరకంగా, మానసికంగా కూడా బలహీనంగా ఉన్నారు. ముందు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలి. అప్పుడు స్థిమితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆమెపై ఎటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు తగవు. ఆమె 16 ఏళ్ల పోరాటం వృధా కారాదు. కేంద్రప్రభుత్వం కూడా పునరా లోచించాలి. చర్చలద్వారా తిరుగుబాటు గ్రూపులను ప్రధానప్రజాస్వామ్య స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.

Comments

comments