Home ఎడిటోరియల్ రేప్ కేసుల్లో కానని న్యాయం

రేప్ కేసుల్లో కానని న్యాయం

edit

మహిళలపై నేరాల సంఖ్య బాగా పెరిగినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సిఇఆర్‌బి) గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఫిర్యాదు చేయడం పెరిగిందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. దేశంలో ప్రతి గంటకు మహిళలపై 39 నేరాలు ఫిర్యాదు అవుతున్నాయి. 2017లో గంటకు 21గా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. ఎన్‌సిఇఆర్‌బి లెక్కల ప్రకారం ఈ వివరాలు తెలిశాయి. 2016లో లక్షమంది జనాభాకు మహిళల పై నేరాలరేటు 55.2గా రికార్డయింది. ఇది 2012లో 41.7 ఉండేది.
మహిళలపై జరిగే నేరాల్లో భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం కేసులు 2016లో ఎక్కువగా రిపోర్టు అయ్యాయి. ఇటువంటి కేసులు 33శాతం దాకా ఉన్నాయి. రిపోర్టయిన రేప్ కేసులు 11శాతం. 2016లో మొత్తం 38,947 రేప్ కేసులు రిపోర్టు అయ్యా యి. రేప్‌లు సగటున గంటకు నాలుగు జరుగుతున్నాయి. 2016 లో మహిళా నేరాలలో చాలా తక్కువ మందికే శిక్షలు పడ్డాయి. ఇది 18.9 శాతం. గత దశాబ్దంలో దేశంలో మహిళలపై 25లక్షల నేరాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో ఫిర్యాదు చేసిన కేసుల సంఖ్య 2007లో 185, 312 నుంచి 2016లో 338,954కి పెరిగింది. నేరాలరేటులో పెరుగుదలతోబాటు వాటిపై ఫిర్యాదు చేయడం కూడా పెరిగింది. మహిళా హక్కుల న్యాయవాది, లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ మజ్లిస్ సహ వ్యవస్థాపకురాలు ఫ్లావియా అగ్నేస్ బాధిత మహిళలకు, పిల్లలకు న్యాయ సేవలు అందిస్తున్నారు. ఇటువంటి నేరాలను విశ్లేషించే అధికారిక యంత్రాంగం ఏదీ లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. మీడియా అత్యంత హింసతో కూడిన ఘటనలకు విపరీత ప్రచారం ఇవ్వడంతో ఆయా ఘటనల బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలసంఖ్య అత్యధికంగా ఉంటోంది. జాతీయ సగటు 55.2కు మించి 160.4గా ఢిల్లీలో ఈ నేరాలరేటు ఉంటోంది. తర్వాత స్థానంలో 131.3తో అసోం, 84.5తో ఒడిశా, 83.7తో తెలంగాణ, 78.3తో రాజస్థాన్‌లు ఉన్నాయి. దేశంలో అత్యధిక జనాభాగల ఉత్తరప్రదేశ్ నేరాల్లో మహిళలపై జరిగేవే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం నేరాల్లో వీటి సంఖ్య 15శాతం దాకా ఆ రాష్ట్రంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016లో గంటకు ఆరు చొప్పున మొత్తం 49,262నేరాలు మహిళలపై జరిగాయి. తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ (32,513),మహారాష్ట్ర (31, 388),రాజస్థాన్(27,422),మధ్యప్రదేశ్(26,604)నిలిచాయి. ఒక్క ఢిల్లీ నగరంలో 2016లో రోజుకు 38 చొప్పున మొత్తం 13,803 నేరాలు మహిళలపై జరిగాయి. 19 నగరాల్లోకీ ఢిల్లీ ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఆ నగరాలన్నీ 2016లో 20లక్షల జనాభా గలవే.
భర్త లేదా అతని బంధువులు మహిళలపై అత్యాచారాలకు దిగిన కేసులు 25శాతం దాకా ఉన్నాయి. మహిళలను ఎత్తుకుపోవడం కేసులు 19శాతం కాగా, రేప్ కేసులు 11శాతం. 2016లో భర్త లేదా అతని బంధువుల నేరాలు 33శాతం దాకా (110,378) ఉన్నాయి. అంటే ఇటువంటి ఘటనలు ప్రతి గంటకూ 13 దాకా జరిగాయి. అయితే ఇటువంటి కేసుల్లో ఫిర్యాదు చేయడం ఉదంతాలు 2007లో 75,930 నుంచి 45 శాతం పెరిగాయి. మహిళలపై భర్త, బంధువుల క్రూరత్వం కేసులు 2016లో పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా (19,302) జరిగాయి. అంటే ప్రతి గంటకూ 2 ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో మహిళలపై నేరాల జాతీయ సగటు 18 కాగా అసోంలో ఆ రేటు అత్యధికంగా (58.7)దాకా జరిగాయి.
2016లో దేశంలో మహిళలపై అత్యాచారాల ఉదంతాలు 84,746 దాకా జరిగాయి. బలవంతంగా బట్టలు ఊడదీయడం, చాటుగా వారిని తిలకించడం, వెంటపడి వేధించడం వంటి సెక్సు వేధింపులు కూడా వీటిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మహిళల కిడ్నాప్ కేసులు అత్యధికంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వాటి సంఖ్య 65,519 కాగా ఒక్క ఉత్తరప్రదేశ్‌లో 12,994 ఘటనలు జరిగాయి. 2016లో నేరాల రేటులో 40.7తో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్ల క్రితం దేశంలో గంటకు రెండు రేప్ కేసులు జరిగేవి. 2016లో ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది.
రేప్ కేసుల సంఖ్యలో 2016లో మధ్యప్రదేశ్ 4,882తో మొదటి స్థానంలో ఉంది. 2016లో ఫిర్యాదు అయిన రేప్ కేసుల సంఖ్య 38,947కు పెరిగింది. 2007లో ఇవి కేవలం 20,737 మాత్రమే. ఇది 88 శాతం పెరుగుదలను సూచిస్తోంది. 2016లో రేప్ బాధితు లు మొత్తం 39,068 కాగా, వారిలో 43 శాతం మంది 18 ఏళ్ల లోపు బాలికలు. రేప్ బాధితులకు నేరస్థుడు తెలిసిన కేసులు 95 శాతం దాకా ఉన్నాయి. వాటిలో 29 శాతం కేసుల్లో పక్కింటి వ్యక్తే రేప్‌కు పాల్పడ్డాడు. రేప్ తర్వాత బాధితురాలిని తెలిసిన వ్యక్తి పెళ్లాడిన కేసు లు 27శాతం దాకా ఉన్నాయి. అంతగా తెలియని వ్యక్తులు పెళ్లాడిన కేసులు 30 శాతం దాకా ఉన్నట్లు ఎన్‌సిఇఆర్‌బి తెలిపింది. 2016లో 19నగరాల్లో అత్యధికంగా రేప్‌లు చోటు చేసుకున్నది ఢిల్లీలోనే.
సగటున రోజుకు ఐదు రేప్‌లు ఢిల్లీలో జరిగాయి. సాధారణ నేరాల రేటులో కూడా ప్రతి లక్షమంది జనాభాకు 26.3 కేసులు చొప్పున ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. 2007 తర్వాత దశాబ్ద కాలంలో అతి తక్కువగా నేరస్థులను శిక్షించిన ఉదంతాలు 2016లో 18.9 శాతం రికార్డు అయ్యాయి. అదే ఏడాది మహిళలపై నేరాల్లో రెండవ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ అతి తక్కువగా నేరస్థులకు శిక్షలు విధించింది. అది అక్కడ 3.3శాతం మాత్రమే ఉంది. 2016లో ఈ నేరాల్లో శిక్షించిన కేసులు మిజోరంలో అత్యధికంగా 88.8 శాతం ఉన్నాయి. తర్వాతి స్థానంలో 67.7శాతంతో మేఘాలయ, 62.5 శాతంతో పుదుచ్ఛేరి, 52.6 శాతంతో ఉత్తరప్రదేశ్, 46.2శాతంతో ఉత్తరాఖండ్ ఉన్నాయి. 2016లో దేశంలో సగటున నాలుగు రేప్ కేసుల్లో ఒక్క దానిలోనే శిక్షపడింది. ఇది 2012 తర్వాత చాల తక్కువ రేటు. రేప్ కేసులపై వార్తల ప్రచారం ఉధృతంగా జరిగి శిక్షలు పడడం అధ్వానంగా ఉంటే మహిళల భద్రతకు మంచిది కాదని సామాజిక కార్యకర్త అగ్నేస్ హెచ్చరించారు. శిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటేనే ఇటువంటి కేసుల్లో ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ముందుకు వస్తారని వారు చెప్పారు. నేరస్థుడు ఖరారై శిక్షపడితే బాధిత మహిళకు న్యాయం జరిగిన తృప్తి ఉంటుంది. అలా కాకుండా బాధితురాలు తన ఫిర్యాదును వాపసు తీసుకున్నా, తీర్పు విరుద్ధంగా వచ్చినా మన న్యాయవ్యవస్థ మీద ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని కూడా అగ్నేస్ హెచ్చరించా రు.
 * చైతన్య మల్లాపూర్