Home ఎడిటోరియల్ బొత్తిగా దయలేని ప్రపంచం

బొత్తిగా దయలేని ప్రపంచం

edit

గత సంవత్సరం 191718 ప్రతి రెండు సెకన్లకు ఒక వ్యక్తి తన ఇల్లు వాకిలి ఒదిలి శరణార్ధిగా తరలిపోయారు. ప్రపంచంలో పరిస్థితి ఇది. ఐక్యరాజ్యసమితి నిర్వాసితుల విషయమై ఇచ్చిన రిపోర్టులో వివరాలివి. యుద్ధాలు, హింసాకాండ, అణచివేత కారణంగా 2017లో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది నిర్వాసితులయ్యారు. గత ఐదుసంవత్సరాల కాలంగా శరణార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గత సంవత్సరం రికార్డు స్థాయిలో పెరిగింది. ఇలా ప్రాణాలరచేతబట్టుకుని శరణార్థులుగా ఇతరదేశాలకు పారిపోతున్నవారిలో సగం మంది పిల్లలే. ఇందులో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు వేరయిపోయినవారు, ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నవాళ్ళని నివేదిక తెలిపింది. ఇందులో యాభై లక్షల మంది మళ్లీ తమ స్వదేశాలకు చేరుకోగలిగారు. కాని కోటి అరవై రెండు లక్షలమంది మళ్ళీ నిర్వాసితులయ్యారు. ఈ సమస్య ఎక్కువగా వర్ధమాన దేశాల్లో ఉంది. ఇతరదేశాలకు తరలిపోతున్న వారు కొందరైతే, తమ దేశంలోనే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నవారు కొందరు. కాంగోలో, దక్షిణ సూడానులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మయన్మార్ నుంచి ఏడు లక్షల మంది రోహింగ్యాలు శరణార్థులయ్యారు. బంగ్లాదేశ్‌లో శరణు పొందారు. కాక్స్ బజారులోని శరణార్ధి శిబిరంలో కష్టాల్లో బతుకుతున్నారు. సాధారణంగా నిర్వాసితులు ఉత్తరార్థగోళంలోనే ఎక్కువ అని ఇప్పటివరకు అందరూ భావించేవారు. కాని ఇప్పుడు లభిస్తున్న వివరాల ప్రకారం నిర్వాసితుల్లో అత్యధికులు వర్ధమాన దేశాలకు చెందినవారేనని తెలుస్తోంది.నిర్వాసితుల్లో దాదాపు 85 శాతం వర్ధమాన దే శాలకు చెందిన ప్రజలే.ప్రతి ఐదుగురిలో నలుగురు పొరుగు దేశాల్లో శరణు కోరుతున్నారు. కేవలం ఐదు దేశాలు – సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియాల నుంచి శరణార్థులుగా తరలిపోయిన వారి సంఖ్య మొత్తం శరణార్థుల్లో మూడువంతులుంది. వీరుకాక ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలోఉన్న పాలస్తీనా ప్రజల సమ స్య వేరే ఉంది.2017లో శరణార్థులకు అత్యధికంగా ఆశ్రయమిచ్చిన దేశం టర్కీ. మొత్తం మూడుకోట్ల యాభై లక్షల మంది శరణార్థులకు ఆశ్రయమిచ్చింది. ఒక్క గత సంవత్సర కాలంలోనే ఏడులక్షల కన్నా ఎక్కువ మంది శరణార్థులను తీసుకుంది.టర్కీ జనాభాతో పోల్చితే చా లా ఎక్కువమంది శరణార్థులను ఆదుకున్న దేశమదిఅని చెప్పాలి. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ ఫిలిప్పో గ్రండీ మాట్లాడు తూ తీవ్రమైన సమస్య ఎదుర్కుంటున్నామని అన్నారు.శరణార్థి సమస్యను ఎదుర్కోడానికి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు అవసరమని చెప్పారు. శరణార్థుల సంఖ్య రానున్న కాలంలో మరింత పెరిగేలా ఉంది.వారి కోసం నేల చిన్నదైపోతోంది.గత సంవత్సరం కేవలం లక్షమంది శరణార్థులు మాత్రమే పునరావాసం పొందగలిగారు.
క్లుప్తంగా చెప్పాలంటే గత సంవత్సరం ప్రతిరోజు 44,500 మంది నిర్వాసితులయ్యారు. తమ తమ దేశాల నుంచి తప్పించుకుని ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికాలో శరణు కోరే విదేశీయుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. 2017లో మొత్తం 7400 మంది భారతీయులు అమెరికాలో శరణు కోరారు. ఆశ్రయం కోసం అత్యధికంగా దరఖాస్తులు ఎల్ సాల్వెడార్, గౌటెమాల, హోండూరస్, వెనిజులా నుంచి అమెరికాకు వచ్చాయి. ఇవి కాక మెక్సికో నుంచి 26 వేల దరఖాస్తులు, చైనా నుంచి 17వేలు, హైతీ నుంచి 8వేలు వచ్చాయి. ఇండియా నుంచి ఇప్పటి వరకు 10 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిసింది. ఇంతకు ముందు ఇలా ఆశ్రయం కోరుతూ దరఖాస్తులు ఎక్కువగా జర్మనీకి వెళ్ళేవి. ఇప్పుడు అమెరికాకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. తమ తమ దేశాల్లో హింసాకాండను, యుద్ధాలను, అణచివేతలను భరించలేక పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్ళేవారు, తమ దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిర్వాసితులుగా వెళ్ళేవారి సంఖ్య పెరిగిపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. శరణార్థులను స్వీకరించడానికి చాలా దేశాలు సంశయిస్తున్నాయి. సమస్యలు వస్తాయని భయపడుతున్నాయి. గత సంవత్సరం యావత్తు ప్రపంచంలో శరణార్థులుగా ప్రాణాలరచేతబట్టుకుని తరలి వచ్చిన వారిలో దాదాపు సగం మందికి కేవలం మూడు దేశాలే ఆశ్రయమిచ్చాయి. టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా దేశాలు అత్యధికంగా శరణార్థులను తీసుకున్నాయి. కొత్త ప్రపంచంలో అంతర్జాతీయ బాధ్యత, శరణార్థులను స్వీకరించే పెద్ద మనసుకరువయ్యింది. యుద్ధాలు, హింసాకాండ నుంచి పారిపోయి వస్తున్న శరణార్థులు, వారి కుటుంబాలు రాకుండా సంపన్న దేశాలిప్పుడు గోడలు కడుతున్నాయి. ఈ అభాగ్యులను ఆదుకోడానికి సహాయపునరావాస కార్యక్రమాలకు ఇప్పుడు ఆర్ధిక మద్దతు కూడా తగ్గిపోయింది. గత సంవత్సరం నిర్వాసితులైన జనాభా బ్రిటన్ జనాభా కన్నా ఎక్కువ. మొత్తం యూరప్ దేశాలు కలిసి కేవలం యాభై లక్షల మంది శరణార్థులకు మాత్రమే అవకాశమిచ్చాయి. అమెరికా కేవలం అరవై వేల మందికి ఆశ్రయమిచ్చింది. బంగ్లాదేశ్, లెబనాన్, ఉగాండా వంటి పేద దేశాలు కూడా పెద్ద సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తుంటే సంపన్న దేశాలైన యూరప్ దేశాలు, అమెరికాకు వచ్చే శరణార్థుల సంఖ్య తక్కువైనా గగ్గోలు ఎక్కువగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది శరణార్థులను యూరప్ దేశాలు ఆదుకున్నాయి. కాని ఇప్పుడు ఆ పాత్ర చిన్న దేశాలు, పేద దేశాలు పోషిస్తున్నాయి. కాని ఈ దేశాలకు తగిన సహకారం లభించకపోతే చాలా తీవ్రమైన మానవీయ సంక్షోభం తలెత్తుతుంది. అది కేవలం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కాదు.యావత్తు ప్రపంచంపై దాని ప్రభావం పడుతుంది. ఉగాండాకు కాంగో నుంచి దక్షిణ సూడాన్‌నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న శరణార్థుల సహాయసహకారాల కోసం ఐక్యరాజ్యసమితినుంచి కేవలం 7 శాతం ఆర్థిక సహాయం మాత్రమే లభించింది. పెద్ద సంఖ్యలో రోహింగ్యాలకు ఆశ్రయమిచ్చిన బంగ్లాదేశ్‌కు లభించిన సహాయం కూడా మొత్తం ఆర్ధికభారంలో 20 శాతం మాత్రమే. ప్రస్తుతం శరణార్ధి శిబిరాల్లో నివసిస్తున్న వారి పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రపంచంలో ఎంత అమానుషమైన పరిస్థితులున్నాయంటే, ఎంతగా శరణార్థులను గెంటేస్తున్నారంటే, అంతర్జాతీయ సహకారం, మానవీయ ప్రతిస్పందనలు ఎంతగా కనుమరుగయ్యాయో చెప్పడం అలవికానిపని, ఇటలీకి శరణార్థులుగా ఒక నౌకలో వచ్చిన 629 మందిని గెంటేశారు. ఆ నౌకను ఇటలీ జలాల్లోకి అనుమతించలేదు. ఆ అభాగ్యులు రాజకీయ క్రీడల్లో పావులుగా సముద్ర జలాల్లో మిగిలిపోయారు. మానవత్వం అడుగంటిన పరిస్థితికి ఇదో ఉదాహరణ. శరణార్ధులకు అంతర్జాతీయంగా కొన్ని హక్కులున్నాయి. ఆ హక్కులను కూడా ఇప్పుడు చాలా దేశాలు, ముఖ్యంగా సంపన్న దేశాలు గౌరవించడం లేదు. యూరోపు దేశాలు తమ సరిహద్దులను మూసేస్తున్నాయి. ఇతర దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి. కాని టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా వంటి దేశాలు ఈ క్లిష్ట సమయంలోనూ శరణార్థులకు మద్దతుగా నిలబడడం ప్రశంసనీయం.

  * ఆనంద్ శ్రీవాత్సవ్