Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎన్నికల తర్వాతే ప్రతిపక్ష కూటమి

ECHURI

సిపిఎం నేత సీతారాం ఏచూరి

కోల్‌కతా: వచ్చే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష మహాకూటమి ఏర్పాటు అవకాశాలు లేవని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిపక్షాలు కూటమిగా అవతరించడం కుదరదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాతనే మహా ఘట్‌బంధన్ ఏర్పాటు అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎవరి విధానాలు వారివి , ఎవరి వైఖరి వారిదిగా ఉండే బహుళత్వ దేశం మనదని , వెనువెంటనే సయోధ్య అసాధ్యం అవుతుందని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన ఏచూరి ఇక్కడ గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మహా కూటమి ఏర్పాటు కుదరదనేది తన సొంత అభిప్రాయం అని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో ఇంతకు ముందు ఫ్రంట్ ఏర్పాట్లను మననం చేసుకుంటే మనకు అన్ని విషయాలు విదితం అవుతాయన్నారు. ఎన్నికల ఫలితాల సరళి, పార్టీల బలాబలాలను బట్టి పార్టీల జట్టు ఆధారపడి ఉంటుందన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు , తరువాత 2004లో యుపిఎ 1 ప్రభుత్వం అవతరించడం వంటివాటిని లెక్కలోకి తీసుకోవల్సి ఉంటుందన్నారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను తిప్పికొట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తరువాతనే ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ఏచూరి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు వేర్వేరుగానే పోటీకి దిగుతాయని, అయితే ఎన్నికల తరువాత ప్రభుత్వ స్థాపనకు ఒక్కటవుతాయని చెప్పారు. ప్రత్యామ్నాయ లౌకిక ఏర్పాటు అంశం గురించి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయిన ఏచూరి వివరించలేదు. కేంద్రంలోని ప్రభుత్వం పాటిస్తున్న ప్రజా కంటక విధానాలతోనే ప్రత్యామ్నాయ అధికార వేదిక ఏర్పాటు అంశం ప్రస్తావనకు వస్తోందని, ఇది ప్రతిపక్ష నేతల సొంత విషయం దశ దాటిపోయిందని, అనివార్యంగా ఈ వేదిక అవసరం ఏర్పడుతోందని ఏచూరి వివరించారు. కేంద్రంలో ఏర్పడే లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వానికి సిపిఎం వెలుపలి నుంచి మద్దతు అందిస్తుందని , ఇంతకు ముందు 1989లో, 96లో, 2004లో ఇదే చేశామని ఏచూరి గుర్తు చేశారు.
బిజెపితో తలపడే శక్తి టిఎంసికి లేదు
మమత బెనర్జీ నాయకత్వంలోని టిఎంసితో ఉండే ప్రతిపక్ష కూటమిలో సిపిఎం ఉంటుందా? అనే ప్రశ్నకు ఏచూరి స్పందించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడే ఆలోచన, శక్తి టిఎంసికి లేదని, అంతేకాకుండా ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగావహన ఉందని తెలిపారు.

Comments

comments