Home మంచిర్యాల మూడో రైలు మార్గం పనులు నిలిపివేత

మూడో రైలు మార్గం పనులు నిలిపివేత

The orders of the Railways to stop work

కాజీపేట-బల్లార్ష మూడో లైన్ పనులకు అటవీ అడ్డంకులు                                                                                          తాజాగా పనులు నిలిపివేయాలని రైల్వే శాఖకు ఆదేశాలు                                                                                        వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని రైల్వే అధికారుల నిర్ణయం                                                                          జంతువులకు ప్రమాదం పొంచి ఉందని అటవీ అధికారుల అభ్యంతరాలు 

మన తెలంగాణ/మంచిర్యాల: అటవీ మార్గం గుండా వేస్తున్న రైల్వే మూడో లైన్ పనులకు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. రైల్వే లైన్ పనుల వలన భవిష్యత్‌లో జంతువులకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావిస్తూ వెంటనే పనులను నిలిపివేయాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి మూడో రైల్వే లైన్ పనులను అధికారులు నిలిపివేశారు.ఈ మార్గంలో కొంత మేరకు అటవీ ప్రాంతం విస్తరించి ఉండడం, వన్యప్రాణులు కూడా సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ అనుమతులతో పాటు వన్యప్రాణి బోర్డు ఆమోదం కూడా కీలకం కానుంది. సికింద్రాబాద్ నుంచి చెన్నై , విజయవాడ వైపు నుంచి ఢిల్లీ సహా ఉత్తరాది ప్రాంతాలకు కాజీపేట మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా ఈ మార్గంలో విపరీతమైన రద్ది ఉంటుంది. దీనిని అధికమించేందుకు తెలంగాణలోని కాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్ష మూడో లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేయగా ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఈమార్గంలో రెండు మూడు చోట్ల వంతెనలను నిర్మించే విధంగా డిజైన్ మార్చే వరకు పనులు ఆపివేయాలని అటవీశాఖ అధికారులు రైల్వే శాఖ అధికారులను సూచించారు.కాగా రైల్వే అధికారులు వచ్చే ఏడాది మార్చి నాటికి మూడో లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకోగా అటవీశాఖ అడ్డంకులతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాజీపేట, బల్లార్ష వయా కాగజ్‌నగర్ మూడో రైల్వే లైన్ పనులు కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్లడంతో జంతువులకు ప్రమాదం ఉందని అటవీ అధికారులు భావిస్తున్నారు. జంతువుల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడి రైలు ప్రమాదాల్లో మృతి చెందే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రమాదాల్లో రెండు చిరుత పులులు మృతి చెందాయి. దీంతో రైల్వే లైన్ పనులకు అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు తెలుపుతూ డిజైన్ మార్చే వరకు పనులు ఆపివేయాలని రైల్వేశాఖకు స్పష్టం చేసింది. కాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్ష వరకు 202 కిలోమీటర్ల పొడువున మూడో లైన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం రెండు లైన్ల మార్గం ఉండగా అదనంగా మూడో లైన్ నిర్మాణానికి రూ.2,063.03 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం మూ-డో లైన్ పనుల నిర్మాణాలు ప్రారంభం కాగా కాగజ్‌నగర్ నుండి మాకుడి వరకు 30 కిలోమీటర్ల పొడవున, రాఘవపురం నుంచి జమ్మికుంట వరకు 47 కిలోమీటర్ల పొడవున మూడో లైన్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు లక్షంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాఘవపూర్ మార్గంలో 80 శాతం పనులు పూర్తి కాగా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో మూడో లైన్ పనులను చేపట్టేందుకు రైల్వే శాఖకు అనుమతులు ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖకు రైట్ ఆఫ్‌వే ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాల గుండా వెళ్లే మార్గాల్లో మూడో, నాలుగో లైన్ నిర్మాణాలు చేపడితే కేంద్రం ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని అటవీ అధికారులు అంటున్నారు. రైలు మార్గం పనులకు కేంద్ర వన్యప్రాణి మండలి అనుమతి పొందాల్సి ఉంటుందని అంటున్నారు. కాగా దట్టమైన అటవీ ప్రాంతం గుండా చేపట్టే పనులకు వన్యప్రాణులు వెళ్లే విధంగా వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని, అందు వలన డిజైన్ మార్చివేసి, కొన్ని చోట్ల వంతెనలు నిర్మించాలని సూచిస్తున్నారు. కాగా మహారాష్ట్ర లోపల రైలు మార్గంలో భాగంగా మరికొన్ని చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో రైల్వే శాఖకు ఎంత భూమి ఉందో ఆతరువాత ఎంత తీసుకున్నారో ప్రస్తుతం అదనంగా అటవీ భూములు అవసరమో ప్రతిపాదనలు ఇవ్వాలని అటవీ అధికారులు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక వైపు రైల్వే అధికారులు నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తుండగా మరోవైపు అటవీశాఖ అధికారుల అభ్యంతరాల వలన పనులు నిలిచిపోయాయి.