Home స్కోర్ అసలు పరీక్ష ఇక్కడే?

అసలు పరీక్ష ఇక్కడే?

The original test in the Tests of the Test against India

భారత్‌కు సవాల్ ఇంగ్లండ్ సిరీస్

మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు టెస్టుల్లో అసలు పరీక్ష ఇంగ్లండ్ గడ్డపై ఎదురు కానుంది. ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ భారత్‌కు అసలైన సవాలుగా నిలువనుంది. గతంలో ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై కూడా భారత్‌కు చేదు అనుభవమే మిగిలింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై మంచి రికార్డు కలిగిన భారత్ వారి మైదానాల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. అయితే గతానికి భిన్నంగా భారత్ ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో ఇంగ్లండ్‌ను ఓడించే అన్ని అస్త్రాలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ టీమిండియాలో ఉన్నారు. కొంత కాలంగా విదేశాల్లోనూ భారత్ మెరుగ్గానే ఆడుతుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా అద్భుత పోరాట పటిమను కనబరిచింది. శ్రీలంకను, విండీస్‌ను వారి గడ్డపైనే ఓడించింది. కానీ, ఇంగ్లండ్ గెలవడం మాత్రం అనుకున్నంత సులువు కాదనే చెప్పొచ్చు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ బలమైన శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా సొంత గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు ఎదురే లేకుండా పోయింది. జట్టు ఏదైనా విజయాలు సాధించడం ఇంగ్లండ్ అలవాటుగా మార్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ చాలా పటిష్టంగా ఉంది. స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌ల రూపంలో పదునైన బౌలింగ్ అస్త్రాలు వారికి అందుబాటులో ఉన్నాయి. ఇక, బ్యాటింగ్‌లోనూ ఇంగ్లండ్‌కు ఎదురులేదు. రూట్, బైర్‌స్టో, బట్లర్, మలాన్, మోయిన్, బెన్ స్టోక్స్ తదితరులతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. కొంతకాలంగా రూట్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతని రూపంలో భారత్‌కు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఇక, భారత్ కూడా బ్యాటింగ్‌లో చాలా బలంగా ఉండడం కలిసి వచ్చే అంశమే. శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్, అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి, కరుణ్ నాయర్‌తో బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. వికెట్ కీపర్లుగా ఎంపికైన దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లు కూడా బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించే సత్తా కలిగిన వారే. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యలు ఇటు బంతితో అటు బ్యాట్‌తో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నిలకడలేమి భారత్‌కు అతి పెద్ద సమస్యగా చెప్పాలి. సమష్టిగా పోరాడితే సిరీస్‌ను నెగ్గడం అసాధ్యమేమి కాదని చెప్పొచ్చు.