Search
Saturday 17 November 2018
  • :
  • :

అడుగంటిన జలం..ఆందోళనలో జనం

bavi

*ముప్పు ముంచుకొస్తోంది…
*రోజురోజుకు పతనం
*ఇప్పటికీ స్పందించని యంత్రాంగం

మన తెలంగాణ/ ఆదిలాబాద్ బ్యూరో   జిల్లావ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు రోజురోజుకు పతనమవుతుండడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం రాబోయే ప్రమా ద ఘంటికలకు కారణమవుతుందని అంటున్నారు. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండడంకు తోడుగా 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే దాదాపు 3 అడుగుల లోతులోకి భూగర్భజలాల మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని అందిస్తుందని అంటున్నారు. మరో నెల రోజుల వరకు నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉందన్న సంకేతాలను సంబంధిత భూగర్భ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పడిపోయి తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. అలాగే మైదాన ప్రాంతంలో సైతం నీటి కొరత ముంపు పొంచి ఉందని అంటున్నారు. నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), కెరామెరి, లింగాపూర్, ఉట్నూర్ తదితర మండలాలలో వేసవి ప్రారంభంలోనే పరిస్థితి దయనీయంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్‌లో బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు నీరందే పరిస్థితి లేదని అంటున్నారు. ముఖ్యంగా వరి ఇతర వాణిజ్య పంటలకు పడిపోతున్న భూగర్భ జల మట్టం కారణంగా ఇబ్బందులు తప్పక పోవచ్చని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాగా వివిధ ప్రాజెక్టులలోనూ, చెరువుల, కుంటలల్లోనూ నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. వీటిపై ఆధారపడి సాగవుతున్న పంటలకు సైతం రాబోయే రోజులలో కష్టాలు తప్పక పోవచ్చని అంటున్నారు. అయితే రిజర్వాయర్లలో ఉన్న నీటి ద్వారా అందుబాటులో ఉన్న చెరువులకు నీరందించి తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని సూచిస్తున్నారు. ఇదిలాఉండగా నీటి కొరత తీవ్రం కానుందన్న సంకేతాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ఇప్పటి వరకు ముందస్తు ప్రణాళికలను రూపొందించక పోవడం విమర్శలకు తావిస్తుందని అంటున్నారు. చేతులు కాలాక ఆకుల పట్టుకున్న చందంగా ప్రతి ఏటా పరిస్థితి తీవ్రమైనప్పుడే సంబంధిత శాఖ అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుండడం రివాజుగా మారిందని అంటున్నారు. భూగర్భ జల శాఖ నివేదికల ప్రకారం సంబంధిత శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా గుట్ట మీద పల్లెల్లోనూ సమస్య తీవ్రంగా ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ ప్రత్యామ్నాయ చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని కోరుతున్నారు. కాగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడుతుండంతో కష్టాలు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలన్ని సమిష్టిగా సమన్వయంతో తాగునీటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

Comments

comments