Home ఎడిటోరియల్ సంపాదకీయం : బీహార్‌లో బిజెపి సఫలం!

సంపాదకీయం : బీహార్‌లో బిజెపి సఫలం!

Sampadakeeyam-Logo

బీహార్ మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించటం ఆకస్మిక పరిణామంగా కనిపించవచ్చుగాని, గత నెలరోజులుగా ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు గమనించేవారికి ఆశ్చర్యం కలిగించవు. ఆయన రాజీనామా చేసిన వెంటనే, ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ పునఃప్రతిష్టకు వీలుగా బిజెపి ఆయనకు మద్దతు ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ నిర్దేశిత స్క్రిప్టు ప్రకారం జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని బిజెపి ఎంపిక చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బిజెపితో దాదాపు 15 సంవత్సరాల సంబంధాన్ని తెంచుకుని, బీహార్ ప్రభుత్వం నుంచి బిజెపిని బయటకు పంపిన నితీష్‌కుమార్ తను కేంద్రంగా రాజకీయ పాచికలు కదపటంలో దిట్ట అని మరోసారి అని రుజువు చేసుకున్నాడు. అప్పుడు మతోన్మాద శక్తులపై పోరాటం, ఇప్పుడేమో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఆయన ఎంచుకున్న వ్యూహాలు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కలిసివస్తున్నావంటూ ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ బీహార్ పార్టీకి ఫోన్ చేసి నితీష్ కుమార్‌కు మద్దతు ప్రకటించాలని ఆదేశించారు. పరిణామాలను సమీక్షించి మార్గనిర్దేశన చేసే నిమిత్తం బిజెపి పార్లమెంటరీ బోర్డు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. 2015 నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్ మహా గట్బంధన్ (మహాకూటమి)గా ఏర్పడి మోడీగాలిని వెనక్కుకొట్టి మెజారిటీ సాధించటం తో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయానికి మార్గదర్శిగా ప్రశంస లు పొందిన నితీష్‌కుమార్ ఇప్పుడు బిజెపి తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఆత్మహత్యా సదృశం అవుతుంది. తాను చెప్పుకునే నీతి-నిజాయితీలకు విలువ ఉంటే ఆకస్మిక ఎన్నికలకు సిఫారసు చేయాలి. మంత్రివర్గ రాజీనామా సమర్పించిన ఆయన గవర్నర్‌కు అటువంటి సిఫారసు చేయకపోవటం గమనార్హం.
ప్రతిపక్షాల ఐక్యతను నిర్మించాలని చెప్పే నితీష్‌కుమార్ ప్రధాని మోడీ దేశంపై విధించిన పెద్దనోట్ల రద్దును ఇతర ప్రతిపక్షాల వైఖరికి విరుద్ధంగా బలపరిచాడు. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని పోటీ చేయించాలని అందరికన్నా ముందే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సలహా ఇచ్చిన ఆయన బిజెపి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌ను బలపరుస్తూ ప్రతిపక్షాల్ని దిగ్భ్రాంతి పరిచారు. బీహార్ ప్రభుత్వం లో ప్రధాన భాగస్వాములు జెడియు, ఆర్‌జెడిలు చెరొక అభ్యర్థికి ఓటు చేయటంతో కూటమిలో గండిపెరిగింది. అంతకుముందే కేంద్రప్రభుత్వం చేతిలో “పంజరంలో చిలుక”లా పనిచేయటానికి అలవాటుపడిన సిబిఐ లాలుప్రసాద్ ఇళ్లపై దాడులు చేసి లాలు, రబ్రీదేవి, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అవినీతి ఆర్జనకు పాల్పడినట్లు ఆరోపణలు నిర్ధారించింది. చార్జిషీట్ దాఖలు చేస్తే తేజస్వి ఎలాగూ రాజీనామా చేయకతప్పదు. కాగా తేజస్వి ప్రజలముందు నిజాయితీ నిరూపించు కోవాలి లేదా రాజీనామా చేయాలని నితీష్‌కుమార్ కోరగా, రాజీనామా ప్రసక్తే లేదు, ఆరోపణలపై దర్యాప్తు సంస్థలకు వివరణ ఇస్తాం అనే వైఖరి లాలు ప్రసాద్ చేబట్టారు. ఈ వివాదం నడుస్తుండగానే, నితీష్ మహాకూటమి నుంచి బయటకు వస్తే తోడ్పాటిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రకటన చేయగా అమిత్‌షా మందలించాడు. నితీష్‌పట్ల ఏ వైఖరి అనుసరించాలో తాము సతమతమవుతున్నామని రాష్ట్ర నాయకత్వం ఫిర్యాదు చేయగా షా ఇచ్చిన సలహా ప్రకారం వారు దాడిని లాలూ ‘అవినీతి’పై కేంద్రీకరించారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు (2018లో ఎన్నికలు వస్తాయంటూ ఊహాగానాలు బయలుదేరాయి) ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహారును ఢిల్లీకి హైవేగా మార్చుకునే మోడీ షా ద్వయం వ్యూహాన్ని ఈ పరిణామాల్లో గమనించవచ్చు. 234 స్థానాలుగల బీహార్ అసెంబ్లీలో బలాబలాలు ఆర్‌జెడి 80, జెడియు 71, కాంగ్రెస్ 27, బిజెపి 53, ఎల్‌జెపి 2, ఆర్‌ఎస్‌ఎల్‌పి 2, హెచ్‌ఎఎం 1, సిపిఐఎంఎల్ 3, ఇండి 4. కాబట్టి బిజెపి మద్దతుతో నితీష్‌కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావచ్చు. కాని ఆయన చెప్పే రాజకీయ విలువలు, వ్యక్తిత్వం ఏమికాను!