Home రాష్ట్ర వార్తలు ఎస్‌ఐ అభ్యర్థుల్లో నేర చరితులకు పోలీసు శాఖ చెక్

ఎస్‌ఐ అభ్యర్థుల్లో నేర చరితులకు పోలీసు శాఖ చెక్

telangana-policeమన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల పైచిలుకు అభ్యర్థుల్లో నేర చరితులకు చెక్ పెట్టేందుకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు సరికొత్త ప్రక్రియను ఎంచుకుంది. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అనేక రకాల నేరాలతో సంబంధం ఉండి పోలీసు కేసుల్లో ఇరుక్కున్న విషయాన్ని వారు దాచిపెట్టినట్లు గుర్తించిన బోర్డు నేరగాళ్ల రికార్డును కలిగి ఉన్న వాల్యూపిచ్ అనే డాటా బేస్ కంపెనీ సహాయాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 487 మంది మాత్రమే తమపై నేరాభియోగాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే చాలా మందిపై నేరాభియోగాలు ఉన్నా ఆ విష యాన్ని దాచి పెట్టినట్లు బోర్డుకు సమాచారం అందింది. వాస్తవంగా పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన వారికి చివరి దశలోనే వారి వ్యక్తి గత రికార్డును పరిశీలిస్తారు. కానీ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఈసారి దీనికి భిన్నంగా ముందుగానే అభ్యర్థుల రికార్డును పరిశీలించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వాల్యూపిచ్ అనే కంపెనీ సహాయాన్ని తీసు కోవాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇ-వెరిఫికేషన్ ద్వారా ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థుల్లో ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉన్నారా…? అనే విషయాన్ని తమ వద్ద వున్న డాటా బేస్ ద్వారా ఇట్టే పట్టేస్తుంది. ఈ కంపెనీ డాటా బేస్‌లో దేశ విదేశాలకు చెందిన 19 వేల కోర్టుల్లో వున్న 12 కోట్ల నేరగాళ్ల రికార్డులను కలిగి వుంది. దీంతో ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా నేర చరిత్ర కలిగి వున్నారా..? అ నే విషయాన్ని గుర్తించి బోర్డుకు చెబుతుందని, ఈ తరహా ఏర్పాట్లు దేశంలో ఇదే తొలిసారి అని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఎస్‌ఐ పోస్టుల అర్హత పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థు లందరికీ ముందు ప్రకటించినట్లుగా బయోమెట్రిక్ అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థుల ఫొటోతో పాటు కుడి, ఎడమ చేతి బొటన వేళ్ల నుంచి ముద్రలు తీసుకుంటారు. ఇందుకోసం అన్ని పరీక్షా కేంద్రాల వద్ద నిపుణులైన వారిని నియమించారు. కాగా, ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణ చంద్రరావు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు, ఈ పరీక్షల తరువాత తదుపరి జరిగే పరీక్షలకు ఎంపికయ్యే వారి విషయంలో కూడా సవ్యంగా వుండేందుకే బయో మెట్రిక్ విధానాన్ని ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.