Home కలం కాళోజీ కవిత్వం, రాజకీయాలు

కాళోజీ కవిత్వం, రాజకీయాలు

Kaloji

కాళోజీ నారాయణ రావు గారి కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రయించి ఉంటుంది. కాళోజీ జీవితాన్ని, కవిత్వాన్ని వేరువేరుగా చూడలేం. ఆయన జీవితంలో ప్రతి సంఘటనని తన కవిత్వంలో చూడవచ్చు. వైయక్తిక జీవితానికీ, కవిత్వానికీ మధ్య ఏ విధమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాలను వీలున్నంత తేలికగా వ్యక్తం చేయటమే కాళోజీ లక్షం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ.
కాళోజీ తను తెలుసుకున్న సత్యాన్ని నిర్భయంగా ప్రజలందరికీ తెలియజెప్పాడు. కవిత్వం, కవిత్వం కోసం కాదని అది ప్రజలందరిదని తెలియజెప్పాడు. కవిత్వం, కవిత్వం కోసం కాదని అది ప్రజల కోసమని నమ్మాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించటమే కాదు దాన్ని వివేచించి సమగ్ర అవగాహనతో కవిత్వీకరించాడు. ప్రజా జీవితానికి అద్దం పట్టిన కవిత్వాన్నే రాశాడు. అందుకే తెలుగు సాహిత్య చరిత్రలో ప్రజాకవిగా వేమనకు ఎంత స్థానం ఉందో కాళోజీ నారాయణ రావు గారికి కూడా అంతే స్థానం ఉందని చెప్పాలి.
కాళోజీ తెలంగాణ నేలపై కదలాడిన కవి. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కవి. తెలంగాణ ప్రజా జీవితాన్ని కవిత్వీకరించి తెలంగాణ సాహిత్య పునర్వికాసానికి పూనుకున్న కవి. తెలంగాణలో సామాన్య జనాభిప్రాయానికి అనుగుణంగా కవిత్వం శ్రామిక వర్గాల నుంచి పుట్టింది. అటువంటి శ్రామిక వర్గాల సాంఘిక, రాజకీయ జీవితాల నేపథ్యంగా కాళోజీ కవిత్వం ఉంటుంది.
‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి / ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? / పరుల కష్టము జూచి పగిలిపోవును గుండె/ పతిత మానవు జూచి చితికి పోవును మనసు’ అంటూ ప్రజల కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ. కాళోజీ మొదట విశాలాంధ్రను సమర్థించాడు. రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. కానీ ఎక్కడా, ఎప్పుడూ కాళోజీ ఆశించినట్లు జరగలేదు. జరుగుతున్న అన్యాయన్ని చూసి కాళోజీ సహించలేకపోయాడు. కొందరి నాయకుల మోసపూరిత విధానాలను ఖండిస్తూ తన కవిత్వంలో తూర్పార బట్టారు.
భారతదేశంలో భారత రాజకీయాలు మాత్రమే ఉంటాయని భావించినాడు. భారతదేశంలో “ఆంధ్ర రాజకీయాలు” ఉన్నప్పుడు “తెలంగాణ” రాజకీయాలు కూడా ఉండక తప్పదు అన్నారు కాళోజీ. పంటలు, సంపద, పెట్టుబడి, అధికారం క్రమ పరిణామమైనపుడు ఆ క్రమాన్ని ఛేదించక తప్పదు. ప్రత్యేక అధికారం, ప్రజల అధికారం కోసం ప్రత్యేక ఉద్యమాలు తలెత్తుంటాయి.ప్రజాకవి కాళోజీ ముందు చూపుతో ప్రజల వైపు నిలిచాడు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో నడిచిండు. బాధ్యతగా ఆ చైతన్యాన్ని చిత్రించిండు.‘ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు?’ అనే కవితలో తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని సాగుతున్న పక్షపాత వైఖరినీ తేటతెల్లం చేశాడు.
‘ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు/ ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని, హామీలిచ్చినవారే అంతా స్వాహా చేస్తారని/ తప్పుడు లెక్కలతో తమ్ములనెప్పుడు ఒప్పిస్తారని, అంకెల గారడీ చేస్తూ చంకలు ఎగిరేస్తారని/ ప్రాంతాన్ని పాడు చేసి శాంతి శాంతి అంటారని/ కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్లుతుడువ వస్తారని/ అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని, ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని/ తెలంగాణ వేరంటె తెలివి లెక్కపెడతారని, ఆత్మహత్య ధోరణులను హంగామా చేస్తారని/ ఎవరనుకున్నారు. ఇట్లౌనని ఎవరనుకున్నారు’
1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు కాళోజీ తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ కవిత్వం రాశాడు. అందులో ‘తెలంగాణ వేరైతే, అన్న కవితలో ఇలా అంటాడు. తెలంగాణ వేరైతే / దేశానికి ఆపత్తా / తెలంగాణ వేరైతే / తెలుగు బాస మారుస్తారా? / తెలంగాణ వేరైతే / కిలోగ్రాము మారుతుందా? తెలంగాణ వేరైతే / తెలివి తగ్గిపోతుందా?, తెలంగాణ వేరైతే / చెలిమి తుట్టి పడుతుందా?, తెలంగాణ వేరైతే / తొలి సంజల పూస్తున్నది, ప్రజల శక్తి ప్రజ్వలించి / ప్రభల ప్రసారిస్తున్నది, ప్రజల రాజ్య ప్రాభవమును/ ప్రదర్శింపజేస్తున్నది’.
కాళోజీ కవితల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 1969 మే నెల1వ తేదీన వరంగల్‌లో జరిగిన ప్రజాసమితి సదస్సులో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణకు ద్రోహం చేసే నాయకుల్ని గుర్తించాడు. అమ్ముడుపోతున్న తెలంగాణ నాయకులను హెచ్చరించాడు. “ప్రాంతం వాడే దోపిడీ చేస్తే” అన్న కవితలో దోపిడీ దారుడు ఎవరైనా సరే తన్ని తరమాలన్నాడు. ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను / దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే/ ప్రాణంతోనే పాతర వేస్తం’, ప్రాంతేతరుని దోపిడీ కన్నా, ప్రాంతం వాడి దోపిడీని తీవ్రమైనదిగా కాళోజీ పరిగణించడాన్ని గమనించాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులు ప్రజల క్షేమం మరిచి ప్రవర్తిస్తే ప్రజలనే కాదని లెక్కచేయక తిరుగుతుంటే కడుపుమండిన ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటాయో కాళోజీ ఈ కవితలో కనిపిస్తుంది. ‘నన్నే కాదంటే ఎట్ల?’ అన్న కవితలో ‘నా ఓటుకు పుట్టినన్నే / కాదంటె ఎట్ల కొడక? మా ఓట్లకు పుట్టి మమ్మే / కాదంటె ఎట్ల కొడక?’ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు జనం ఓట్లకు పుట్టినారని చెప్పడం కాళోజీ పరిశీలనాశక్తికి నిదర్శనం.
ఉద్యమానికి అడ్డుపడ్డ రాజకీయ వేత్తలను పేరుపేరునా నిలదీశాడు. కాళోజీ నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఉద్దేశిస్తూ తేటతెల్లమయ్యే వ్యక్తీకరణలో తెలంగాణ వేరు పడాలన్నాడు. ‘ఒప్పందాలను నమ్మి/ ఒప్పుకుంది చాలమ్మా; ఎవరి ప్రాంతమును వారిని / ఏలనియ్యి ఇందిరమ్మ; వేరు వేరుగ ఉంటే / పోరు ఉండబోదమ్మా; మరో రాజ్యమొకటి/ భారత మాతకు బరువానమ్మ?; తెగేదాక బిగియిస్తే/ తెగును తాడు గదమ్మ’ అన్న మాటల్లో తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందనే విశ్వాసం కాళోజీలో కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న ప్రతి మార్పును, ప్రతి పరిణామాన్ని కాళోజీ అంచనా వేయగలిగాడు. తెలంగాణ ఉద్యమం తొలితరం నుంచి మలితరం ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవాలన్న ప్రగాఢమైన కాంక్షను కాళోజీ తెలంగాణ ఉద్యమం కవిత్వంలో చూడొచ్చు.
పాతివ్రత్యం లాంటిదే పార్టీ వ్రత్యం. పతిపట్ల సతి ధర్మం పాతివ్రత్యమైతే పార్టీపట్ల రాజకీయ నాయకుల ధర్మం పార్టీవ్రత్యం. భర్త ఎటువంటి వాడైనా స్త్రీ అతనియందే గౌరవముంచి పతివ్రతగా ఉండాలనటంలో ఎంత మూర్ఖత్వం ఉందో పార్టీ ఎటువంటిదైనా రాజకీయ నాయకులు దానియందే గౌరవముంచి ప్రవర్తించాలనటంలో అంత మూర్ఖత్వమే ఉందని కాళోజీ ఈ కవిత ద్వారా ధ్వనింపజేశారు. ఆత్మ విమర్శనా శక్తిని అవతలకు నెట్టి పార్టీని పట్టుకొని వ్రేలాడటమే నేటి పార్టీవ్రత్యుల వ్యవహారంగా ఉండటాన్ని
‘పార్టీ దేవుడు దైవం/ పార్టీయే సర్వస్వము / పార్టీకిష్టము గాని / వ్రతము పూజ పనికి రాదు’ అనడంలో ఈ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే భారత దేశ సమైక్యత దెబ్బతింటుందని వలస పాలకులు ప్రచారం చేశారు. దేశం నుండి విడిపోకుండా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడితే ఏమైందని కాళోజీ భావన. సమైక్యంగా ఉండడానికి రాష్ట్ర ఏర్పాటు అడ్డంకి కాదని కాళోజీ వాదించారు. పాలనలో ప్రత్యేకమే తప్ప ప్రజల జీవనంలో, సంబంధాల్లో అరమరికలు ఉండనవసరం లేదని చెప్పారు. ‘సమైక్యత’ కు భంగం వాటిల్లకుండా బతుకు సౌకర్యం చేసుకోవచ్చని ఉపదేశించారు. ‘హిందీ భాషీయులంతా ఒక రాజ్యంలో లేరు భారతీయులే వారు తెలుగు భాష మాట్లాడే వారంతా రెండు రాజ్యాలుగా విడిపోతే భారత దేశ సమైక్యత భావం ఇసుమంతైనా కుంటుపడదు. అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పటైనంతమాత్రాన ఏ ఆపద సంభవించదని వాదించిండు. కిలోగ్రామ్ బరువు తగ్గదని, రూపాయికి నూరు పైసలే ఉంటాయని హేతుబద్ధంగా ఒప్పంచేటందుకు ప్రయత్నించిండు.
‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా /తెలంగాణ వేరైతే తెలుగు భాష మరుస్తార’ వేరే రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఏ అసహజమైన పరిణామాలు ఏర్పడవని స్పష్టంగా చెప్పిండు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి వీర తెలంగాణ పోరాటం చేసిన వారసులు వేరు తెలంగాణ కోరుకోరని కొందరు కవులు పద చమత్కారం చేస్తే కాళోజీ అంతే నైపుణ్యంతో చమత్కరించిండు. ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది / వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి’ వీర, వేరు రెండు తెలంగాణలు ఉండవని, చారిత్రక సందర్భం నుంచే రెండు దశలు ఉత్పన్నమైనాయని అన్ని వేళల్లో వీర తెలంగాణ గానే ఉంటుందని ప్రకటించిండు. సిద్ధాంతాలతోను, వాదాలతోనో, నినాదాలతోనో స్వచ్ఛమైన తెలంగాణను మోసం చేస్తే సహించదని కూడా హెచ్చరించిండు. ‘తీరం’ కోస్తాంధ్ర ప్రతీక. భౌగోళిక ఆధారంగా చేసుకొని కుండబద్దలు కొట్టినట్లు తన అభిమతాన్ని వ్యక్తీకరించిండు. ‘తెలంగాణమిది తెలంగాణమిది / తీరానికి దూరాన ఉన్నది /ముంచే యత్నం చేస్తే తీరము /మునుగును తానే తీరం తప్పక’
దూరాన ఉన్న తెలంగాణను కోస్తాంధ్ర సముద్ర తీరం ముంచే ప్రయత్నం చేస్తే తప్పకుండా తీరమే మునిగిపోతుందని చెప్పిండు. దోస్తుగా ఉండేవారితో దోస్తీ చేస్తే ప్రాణం ఇచ్చే తత్వమున్న తెలంగాణ మోసం చేస్తే తత్వాన్ని భరించలేదని సష్టం చేసిండు. ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదన తెచ్చినప్పుడు అనుమానాలతోనైనా ఆలింగనం చేసుకొన్నది తెలంగాణ. సోదర సంబంధం కలిపినప్పుడు హృదయోద్వేగంతో ఉప్పొంగింది కాళోజీ హృదయం. కానీ సెంటిమెంట్లను భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని అధికారం చేసినా , దోపిడీ చేసినా, మోసం చేసినా సహించదని, తిరుగుబాటు చేస్తుందని కాళోజీ తెలంగాణ రాజకీయ తత్వాన్ని ఆవిష్కరించాడు.కాళోజీ కల నిజమైంది. . ఇక నవ తెలంగాణ నిర్మించుకోవడమనే కర్తవ్యం మన ముందుంది. ‘రాజకీయలు’ పదానికి ప్రత్యామ్నాయంగా కాళోజీ సృష్టించిన పదం ‘ప్రజాకీయాలు’. ఆ శీర్షికతో కాళోజీ రచించిన కవితతో నా వ్యాసాన్ని ముగిస్తాను. ‘రాజనీతి / నేతలకు అలవడింది దండిగ/ అదే రాజరికాల నాటిది / పంచతంత్రం బాపతుది / రాజనీతికి బదులు నేతకు / ఉండవలసింది ప్రజాభీతి’