Home రాష్ట్ర వార్తలు అధ్యక్షుడే సర్వాధికారి

అధ్యక్షుడే సర్వాధికారి

222తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్ణయం
హైదరాబాద్: ఇకపై పిసిసి అధ్యక్షుడికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో సర్వాధికారాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కట్టబెట్టింది. ఎంత పెద్ద నాయకులైనా పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ నష్టం కలిగిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటైన తరువాత హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్ లో పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన తొలి పిసిసి సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ సమావేశానికి ఎఐ సిసి నుంచి రాహుల్‌గాంధీ దూతగా ఎస్‌సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. సమావేశంలో టిపిసిసి కార్యనిర్వాహక అధ్య క్షుడు మల్లు భట్టి విక్రమార్క, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, పిసిసి మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు కొత్తగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్ర ధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, డిపార్ట్‌మెంట్‌ల చైర్మన్‌లు పాల్గొన్నారు. సుమారు ఆరుగంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో నిర్ణయాలను పిసిసి ఉపాధ్యక్షులు నాగయ్య, మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పిసిసి సమావేశంలో కూలంకుషంగా చర్చించినట్లు వారు తెలిపారు. ఇక నుండి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడే సర్వాధికారి అని, ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. త్వరలో ఆఫీస్‌బేరర్లకు జిల్లాలు, అంశాల వారీగా బాధ్యతలు అప్పగించాలని పిసిసి సమావేశంలో నిర్ణయించారు. బూత్, గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించేందుకు డిసిసిలు చర్యలు తీసుకోవాలని, డిసిసిలు ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి ప్రతి నెలా పిసిసి ప్రగతి నివేదికలు పంపాలని ఆదేశించింది. అలాగే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఒక టీమ్‌గా వ్యవహరిస్తూ తమకు కేటాయించిన ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలు పంపాలని, సమీక్షలు నిర్వహించాలని సూచించింది. కాగా సమన్వయ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీల సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని సమావేశం నిర్ణయించింది. పది రోజుల్లో అధికార ప్రతినిధులు పాత కమిటీలో కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, అధికార ప్రతినిధులను తొలగి స్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. పది రోజుల్లో కొత్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, అధికార ప్రతినిధులను నియమించనున్నారు. ఆయ అంశా లపై విషయపరిజ్ఞానం ఉన్నవారినే అధికార ప్రతినిధులుగా నియమిం చాలని, వారి సంఖ్య 15కు మించవద్దని నిర్ణయించారు. అలాగే క్రమశిక్షణా సంఘాన్ని కూడా త్వరలోనే నియమించనున్నారు. పార్టీ నిబంధలనకు విరుద్ధంగా, నష్టం కలిగించే విధంగా మాట్లాడినా, వ్యవహరించినా వారు ఎంతటి పెద్ద స్థాయి వారైనా నోటీసులు ఇచ్చి క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధంగా క్రమశిక్షణా సంఘానికి అధికారాలు ఇవ్వనున్నారు.
కార్యకర్తల బ్యాంక్: ప్రతి నియోజకవర్గంలో 30 మందిని గుర్తించి నైపుణ్య శిక్షణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. వీరిని అసవరాలను బట్టి పూర్తిస్తాయి శిక్షణ ఇచ్చి హోల్ టైమర్‌లుగా వినియోగించుకోవాలని భావిస్తోంది.