Home ఎడిటోరియల్ కొత్త పెన్షన్ స్కీము కొరివి

కొత్త పెన్షన్ స్కీము కొరివి

pension

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్దరించాలని కోరుతూ గత కొంత కాలంగా వివిధ రూపాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాపితంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద గత మార్చి నెలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వేలాది మంది కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు సామూహికంగా నిరసన ధర్నాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2015, 2016 సంవత్సరాలలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు నూతన పెన్షన్ (కంట్రిబ్యూటరీ పెన్షన్) స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పర్చాలని జిల్లాలో కలెక్టరేట్‌ల వద్ద, రాష్ట్రం లో ఆయా ప్రభుత్వ ఆఫీసుల వద్ద ధర్నాలు చేశారు.
సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రభుత్వ డిపార్టుమెంటులలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సామూహిక సెలవు పెట్టి నిరసన తెల్పాలని పిలుపునిచ్చారు. ఇందుకు గాను ఆగస్టు 28 నుండి అన్ని జిల్లా కేంద్రాలలో ఉద్యోగులు నిరసన ర్యాలీలు, ధర్నాలు ప్రారంభించారు. టిజిఒ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆగస్టు 31న అన్ని జిల్లా డివిజన్‌లలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. సెప్టెంబర్ 1ను “పెన్షన్ విద్రోహ” దినంగా పాటించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పిలుపిచ్చాయి. మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఉపాధ్యాయులంతా నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు.
పెన్షన్ చట్టం:
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రవేట్ రంగంలో పనిచేసే కార్మికులకు పదవీ విరమణ తర్వాత వారికి జీవనోపాధి కల్పించవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇందులో భాగంగానే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1952లో పెన్షన్ సౌకర్యాన్ని కల్పించింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ ఉద్యోగి చివరి నెలలో పొందుతున్న మూలవేతనంతోపాటు కరువుభత్యంలో 50% పెన్షన్ గా కేంద్రప్రభుత్వం చెల్లించుచున్నది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ఇదే విధంగా పెన్షన్ చెల్లిస్తున్నాయి. ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి పెన్షన్ చెల్లింపు, ఉద్యోగుల వేతన సవరణలతోబాటు పెన్షన్ దారులకు కూడా పెన్షన్ పెంపు అమలులో ఉంది.
భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ బ్యాంక్, యితర అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి సంస్థల నుండి, భారత పారిశ్రామిక వాణిజ్య వర్గాల నుండి వస్తున్న ఒత్తిళ్ళ మేరకు ప్రభుత్వం పెన్షన్ ఖర్చులు తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. పలుకుబడి కల్గిన ఆ వర్గాలు భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వచ్చాయి. కేంద్రప్రభుత్వం నియమించిన ఒక కమిటి వృద్ధులకు, అసంఘటిత రంగ కార్మికులకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం:
రకరకాల సబ్సిడీలు పొందుతున్న భారత పెట్టుబడిదారీ వర్గం ఉద్యోగులకు జీవన భద్రత కల్పించే పెన్షన్ భారాన్ని తగ్గించాలని పట్టుబడుతూ వచ్చాయి. పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేసే పాలకులు దశాబ్దాలుగా అమలవుతున్న పెన్షన్ విధానం (డిఫైన్డ్ బెన్‌ఫిట్ సిస్టం) స్థానంలో ఉద్యోగులు తమ జీతం నుండి వాటా చెల్లించే విధానం “కంట్రిబ్యూటరీ పెన్షన్‌” పద్ధతిని నోట్ ఎఫ్ నెం.5/7/2003 ఈసిబి పిఆర్ తేది. 10.10.2003 ద్వారా అమలులోనికి తీసుకొచ్చింది. 01.01.2004 నుండి అమల్లోనికి వచ్చిన ఈ విధానానికి నూతన పెన్షన్ పధకం (న్యూ పెన్షన్ స్కీం) అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని ఆర్థిక పరిభాషలో డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ సిస్టవ్‌ు అంటారు. ఈ నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన పెన్షన్ నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్) బిల్లును పార్లమెంటులో పెట్టి అమలుకు ఆనాడు ఏన్డీయే ఆ తర్వాత యుపిఎ ప్రభుత్వాలు భట్టివిక్రమార్కునిలాగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. యుపిఎ 1లో ప్రధాన భాగస్వాములైన లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తూ రావడంతో 2009 వరకు అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత వచ్చిన యుపిఎ 2 ప్రభుత్వం 20011లో తిరిగి పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును స్టాండింగ్ కమిటీకి 2005లోను, 2011లోను రెండుసార్లు సిఫార్సు చేశారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 2013 సెప్టెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశ పెడుతున్నట్లు బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చెప్పారు. ఈ బిల్లును చట్టం చేయవద్దని గత దశాబ్ద కాలంగా దేశంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. పిఎఫ్ ఆర్‌డిఎ బిల్లు ద్వారా పింఛన్ దారులు దాచుకున్న సొమ్మును విదేశీ శక్తులు, మార్కెట్ మాటున దోచుకెల్తాయన్న ఆందోళన అన్ని వర్గాల నుండి వ్యక్తం అవుతున్నది. ఈ వాదనతో ప్రతిపక్షాలైన వామపక్షాలు, తృణమూల్, డియంకె, అన్నాడియంకె, సమాజ్‌వాది పార్టీలు వ్యతిరేకిస్తూ అనేక సవరణలు ప్రతిపాదించాయి. వాటిని తిరస్కరిస్తూ నాటి యుపిఎ 2 బిజెపితో చేతులు కలిపి దొడ్డి దారిన బిల్లును ఆమోదించింది.
2004 జనవరి 1 నుండి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్ 1 తర్వాత చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ (కంట్రిబ్యూటరీ) పెన్షన్ స్కీమ్ వర్తింప చేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్ 22న జి.ఓ.ల ద్వారా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను అమల్లోకి తెచ్చారు. 16 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం నుండి నూతన పెన్షన్ విధానానికి మారి అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఉద్యోగుల జీతంలో 10%, ప్రభుత్వం 10% కలిపి పెన్షన్ నిధి లో జమచేస్తారు. ఆ నిధిని షేర్ మార్కెట్‌లో 50%, ప్రభుత్వ సెక్యూరిటీలో 30%, ఇతర సంస్థల్లో 20% జమచేస్తారు. పదవి విరమణ సమయంలో 60% ఇస్తారు. మిగిలిన 40% ఇన్సూరెన్స్ సంస్థలలో ఈక్విటీ క్రింద తీసుకోవటం అమలులో ఉంది.
కేంద్రప్రభుత్వం 2014 ఫిబ్రవరి 1న పెన్షన్ ఫండ్ రెగ్యులటరీ ఆథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చట్టం తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వస్తే జీవిత కాలం దాచుకున్న తమ సొమ్ముపై వేతన జీవులకు ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. మార్కెట్ శక్తులకే లాభం కలుగుతుంది. అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఆ సొమ్ము వెళుతుంది. మార్కెట్ శక్తుల చేతుల్లో పిఎఫ్ డబ్బులు ఉండటం వలన రిటైరైనా పింఛన్ ఎంత వస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. పాత పెన్షన్ విధానం వలన ఉద్యోగి రిటరైన నాటికి అతనికి వస్తున్న వేతనంలో 50%పెన్షన్ వస్తుండేది.
సిపిఎఫ్ పరిధిలో 2004తర్వాత ఉద్యోగంలో చేరిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులు 56లక్షల మంది, తెలంగాణ ఉద్యోగులు 1,20,571 మంది, ఎ.పి.లో ఒక లక్ష 50వేల మంది ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులో రాష్ట్రాలకు సిపిఎఫ్ అమలుకు వెసులుబాటు కల్పించింది. దీనితో పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఢిల్లీ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది. కేరళ, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నూతన కంట్రిబ్యూటరీ విధానం లోపభూయిష్టమైంది. ఉద్యోగులకు ఆర్థిక భద్రతలేని ఈ విధానాన్ని రద్దు చేయాలని ఎఐటియుసి డిమాండ్ చేస్తూ సిపిఎఫ్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నది.

– 9490952646