Home లైఫ్ స్టైల్ పొదుపులో ఎదురయ్యే అడ్డంకులు

పొదుపులో ఎదురయ్యే అడ్డంకులు

Saving-Money

ఆఫీసుకు వెళ్లాలని ఆదరాబాదరాగా బస్సెక్కి కూర్చున్నాక, వర్షానికి నాలా పొంగి ట్రాఫిక్ జాం అయ్యింది. దాంతో మీరు సరైన సమయంలో ఆఫీసుకు చేరుకోలేకపోయారు. అలాగే డబ్బు పొదుపు విషయంలో కూడా సరైన అవగాహన, అలవాట్లు లేకున్నా, అది మున్ముందు మీ ఆర్థికావసరాలపై పెద్దగా ప్రభావం చూపిస్తుంది. సరైన అవగాహనతో ఈ అడ్డంకులకు అడ్డుకట్ట వేయగలిగితే జీవితాంతం మీ ఆర్థిక ప్రయాణం నల్లేరుమీద నడకే అవుతుంది. అయితే మనలో చాలామందికి పొదుపు విషయంలో సరైన అవగాహన ఉండదు. ఈ అవగాహన లేమి ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారుతుంది, దీన్ని అధిగమించాలంటే ఈ సూచనలను ఓ సారి పరిశీలించాల్సిందే…

పొదుపు విషయంలో చేసే తప్పులు

తక్కువ మొత్తాలు ఎక్కువగా ఖర్చు చేయడం
తక్కువ మొత్తాలు మనకు తెలియకుండానే ఖర్చు చేస్తూంటాం, చివరకు పర్సు ఖాళీ అయ్యిందాకా ఆ విషయాన్ని గుర్తించం. ఇలా చిన్న చిన్న ఖర్చులు కలిపితే పెద్దమొత్తంగా మారి జేబుకు చిల్లు పడడం ఖాయం. ఉదాహరణకు సినిమాకు వెళితే టికెట్ ఖర్చు రూ.150-200, అక్కడ ఎంత తక్కువ తిన్నా పాప్ కార్న్ ఖర్చు రూ.50 కలిపి ఒక మనిషికి దాదాపు రూ.200 ఖర్చు అయినట్లే, ఇలా నలుగురు కుటుంబ సభ్యుల ఖర్చు దాదాపు రూ.800 అవుతుంది. వారానికోసారి ఇంత ఖర్చు చేసినట్లయితే నెలకు రూ.3,200 కాగా, సంవత్సరానికి రూ.38,400 ఖర్చు అవుతుంది. పొదుపు చేయాలనుకునేవారు అదనంగా అయ్యే ఈ ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే సంవత్సరానికి పెద్ద మొత్తంలో ఆదా చేసే అవకాశం ఉంటుంది.

విపరీతంగా క్రెడిట్ కార్డ్‌లను వాడడం
క్రెడిట్ కార్డు వాడుతున్నారంటే అప్పు తెచ్చుకున్న డబ్బు వాడుతున్నట్లే లెక్క. మనం ఎక్కడికి వెళితే అక్కడికి డబ్బు తీసుకెళ్లడం సురక్షితం కాదు కాబట్టి క్రెడిట్ కార్డులను వాడడం మంచిది. అయితే అవసరం లేనప్పుడు ఈ పద్ధతిని పాటిస్తే వచ్చేది మాత్రం రెండంకెలతో కూడిన వడ్డీ బాదుడే. ఒక వేళ క్రెడిట్ కార్డ్ ఉపయోగించాక ఆ డబ్బును సరైన సమయంలో చెల్లించలేకపోతే, వస్తువును కొన్న దానికంటే ఎక్కువ రెట్ల డబ్బు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకమైన పొరపాట్లు యువత ఎక్కువగా చేస్తారు. అయితే సరైన సమయంలో క్రెడిట్ కార్డ్ పై వాడుకున్న డబ్బులను బ్యాంకుకు చెల్లించినట్లైతే వడ్డీ బాదుడు ఉండదు, క్రెడిట్ కార్డ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది.

చిన్న మొత్తాల పొదుపుపై దృష్టి పెట్టాలి
సేవింగ్స్ ఎకౌంట్‌లో చిన్న మొత్తాల్లో డబ్బు దాయడం అనేది అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది, ఇది సరైన అలవాటు కూడా. కాని చాలా మంది దీన్ని పట్టించుకోరు. స్థిరంగా అభివృద్ధి సాధించాలంటే ఈ రకమైన చిన్నమొత్తాల పొదుపు చేయడం అవసరం, అదే అవసరమైన సమయంలో పెద్ద మొత్తంగా చేతికందివస్తుంది.

మిడి మిడి ఙ్ఞానం, పోలిక పనికిరాదు
ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, ప్రాధమ్యాల్లో ఒకరికొకరికి పోలిక ఉండదు. అందికే ఎవరి అవసరార్థం వారు పొదుపు చేయడం అనేది తెలివైన మదుపవుతుంది. ఒక రకమైన పెట్టుబడి ఒకరికి కలిసివచ్చిందని అది అందరూ పాటించాలంటే, ఆ ఆలోచన తప్పు. మీ అవసరాలు, ప్రాధమ్యలననుసరించే మీ పెట్టుబడులు ఉండడం మంచిది.

పొదుపు విషయంలో ఉండే అపోహలు

అపోహ : నాకు చాలా డబ్బున్నది లేదా తినడానికే సరిపోవడం లేదు కాబట్టి పొదుపు నాకు సంబంధించింది కాదు
నిజం : ఆర్థిక ప్రణాళిక అనేది అందరికీ ఉపయోగపడుతుంది. మీకు తక్కువ లేదా ఎక్కువ డబ్బు ఉన్నా ఈ రకమైన ప్రణాళిక అవసరమే. ప్రణాళిక లేకుండా స్థిరమైన ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేరు. అలాగని ప్రణాళికతోనే ఆర్థిక ఉన్నతి సాధ్యమా అంటే అదీ కాదు, కాని ఎప్పటికప్పుడు మీ ఆర్థికబలాన్ని సమీక్షించుకునే వెసులుబాటైతే ఉంటుంది.

అపోహ : ఆర్థిక ప్రణాళికకు సమయం ఎక్కవ కావాలి, దాంతో నేను అలసిపోతాను, నా దగ్గర అంత సమయం లేదు.
నిజం : ఏదైనా కొత్త ప్రయత్నం కొంత కష్టంగానే అనిపిస్తుంది, కాని మీ సమయాన్ని ఆర్థిక ప్రణాళికపై వినియోగించడం వల్ల, కష్టపడి సంపాదించిన డబ్బు జీవితాంతం సుఖంగా బతికేందుకు ఉపయోగపడుతుంది. ఆర్థిక నిపుణులు, చార్టర్డ్ ఎకౌంటెంట్‌ల సలహాలు, సూచనలు తీసుకున్నట్లైతే ప్రారంభం తేలికవుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలు ఎప్పటికప్పుడు వారితో చర్చించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే పొదుపు అనేది కేవలం మీకు సంబంధించిన వ్యవహారం, ఈ విషయమ మిమ్మల్ని మించిన అవగాహన కూడా ఎవరికి ఉండదు.

అపోహ : ఇప్పుడు సరిపడా సంపాదిస్తే, పదవీ విరమణ తర్వాత నా దగ్గర సరిపడా డబ్బు ఉంటుంది.
నిజం : ఈ రోజు నీ సంపాదన ఎంతైనా సరే ఆర్థికంగా సరైన ప్రణాళిక ఉంటేనే రిటైర్మెంట్ తర్వాత కూడా ధనికంగా బతకవచ్చు. ఎంతో మంది మిలియనీర్లు పదవీ విరమణ తర్వాత మామూలు జీవితం గడపుతూంటారు, స్వల్పంగా సంపాదించేవారు ఎంతో ధనవంతులుగా నిలుస్తారు. దీనికి కారణం వారు డబ్బును ఇన్షూరెన్స్, పెట్టుబడి, డబ్బు ఖర్చు వంటివాటిని ఏ విధంగా మేనేజ్ చేశారన్నదే ఇక్కడ ముఖ్యం.