Home ఆఫ్ బీట్ బతకులేని భవిష్యవాణి

బతకులేని భవిష్యవాణి

రాష్ట్ర భవిష్యత్తును చాటిచెప్పే మాతంగి జీవితంలో కష్టాలు దాగున్నాయి. ఏడు తరాలుగా భవిష్య వాణి వినిపిస్తున్న కుటుంబం కటికదరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది. రంగంలో భవిష్యవాణి వినిపించే స్వరంలో పేదరికపు అరుపులు విని పిస్తున్నాయి. నిత్యం అమ్మవారి సేవలో ఉంటున్న ఉపాసకురాలు ఉపవాసం ఉంటోంది. ఏటా రాష్ట్ర భవిష్యవాణి చెబుతున్న ఆమె జీవితం
అగమ్యగోచరం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరమీదకు వచ్చే మాతంగి జీవితంలో తెరవెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. ఉండటానికి గూడు లేక, తినడానికి తిండి లేక అలమటిస్తోంది. మన తెలంగాణ ప్రతినిధి ఆమెను కలిసిన సందర్భంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ph

అది మెట్టుగూడ తుకారం గేటు దగ్గర ఉన్న చిన్న అద్దె ఇల్లు. కనీస సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఇరుకైన ఇల్లు అది. అక్కడ ఉంటున్నది ఎవరో చెబితే ఆశ్చర్యమేస్తుంది. అంతకంటే ఆ పరిస్థితులు చూస్తే జాలి వేస్తుంది. ఆ ఇల్లు ఎవరిదంటే అందరి భవిష్యత్తు చెప్పే మాతంగి స్వర్ణలతది.
‘అమ్మ’ సేవలో ఏడు తరాలు ?
ఉజ్జయినీ మహంకాళి బోనాలలో ‘రంగం’ కీలకమైంది. ఈ క్రమంలో మహంకాళి జాతరలో దాదాపు 200 సంవత్సరాల క్రితం భవిష్యవాణి చెప్పే ప్రక్రియ మొదలైంది. తొలినాళ్లలో దేవీ ఉపాసకురాళ్లతో చెప్పించేవారు. కాలక్రమంలో కీర్తి వంశస్థులైన జోగమ్మ, బాలమ్మ, పోషమ్మ, భాగమ్మ, స్వరూపారాణిలు భవిష్యవాణి తెలియజెప్పారు. భవిష్యవాణి చెప్పే మాతంగులు వివాహం చేసుకోరు. గత 16 సంవత్సరాలుగా రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. మాతంగుల కుటుంబంలో మహిళలందరూ దేవీ ఉపాసకులే. ఏడు తరాలుగా భవిష్యవాణి చెబుతూ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఇదిలావుండగా బోనాలలో రంగం ఎక్కే ముందు వరకే ధ్యాసలో ఉంటారు. ఆపై రంగం ఎక్కిన అనంతరం వారు వినిపించే భవిష్యవాణిలో ఏ విషయాలు చెప్పారన్నది తిరిగి వారికి గుర్తుండదు.
మాతంగి స్వర్ణలత ఆలయం వారు వీరికి నెలకు రూ.౩ వేల గౌరవ వేతనం ఇస్తారు. లోకం గతిని కోట్లాది మందికి తెలియజేసే మాతంగి స్వర్ణలత ఒక్క రంగం రోజు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మిగతా రోజుల్లో సామాన్య భక్తురాలిగా అమ్మవారిని దర్శించుకుంటూ బతుకు బండి లాగిస్తోంది. ఏడాదికి ఒకసారి భవిష్యవాణి చెప్పడం తప్ప ఇతరత్రా పనులేమీ లేకపోవడంతో వచ్చే రూ.౩ వేలతో జీవనం సాగడం కష్టతరంగా మారుతోందని మాతంగి స్వర్ణలత వాపోతోంది.
మాతంగి జీవితంలో మరో‘కోణం’
కీర్తి నర్సింహ, విస్తారమ్మ దంపతుల ద్వితీయ సంతానం మాతంగి స్వర్ణలత. దశాబ్దన్నర కాలంగా ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ జీవితం సాగిస్తోంది. ఆమె ఏకైక సోదరుడు దినేష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పనులు సరిగ్గా లేకపోవడంతో ఇటీవలే ఆ వృత్తికి స్వస్తిపలికి మహంకాళి ఆలయంలో పంబజోడు వాయిస్తున్నాడు. కొద్దికాలం క్రితం తల్లిదండ్రితో పాటు సోదరి సైతం మృతి చెందడంతో చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారిందని స్వర్ణలత వాపోతోంది. సొంత ఇల్లు లేదని అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూం, ఫించన్ సౌకర్యం కల్పిస్తుందన్న ఆశతో ఉన్నానని దేవీ ఉపాసకురాలు స్వర్ణలత ఆశాభావం వ్యక్తం చేసింది. తనతో పాటు ఆలయ వ్యవస్థాపకులు సురిటి అప్పయ్య ముని మనువరాలు లక్ష్మిసైతం ఆలయాన్నే నమ్ముకుని జీవిస్తోందని చెప్పింది. మరికంద లక్ష్మి గత 55 ఏళ్లుగా మహంకాళి ఆలయంలో పనిచేస్తోంది. కడు పేదరికంలోనూ అమ్మవారికి సేవలందిస్తున్న తమకు సర్కారు ఏ విధంగానైనా సహాయం చేయాలని వేడుకొంటున్నారు.

ujjaini
మళ్ళీ సిఎం నా బిడ్డ కేసీఆరే
తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే మళ్లీ సిఎం పీఠం దక్కుతుందని స్వర్ణలత చెప్పింది. రైతును రాజుగా భావించి పాలించే వారికే ప్రజలు పట్టం కడతారు. తెలంగాణ ప్రజల సుఖశాంతుల కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ గడ్డలో కూడు, గూడుకు కొదువ ఉండదు.
నా బిడ్డలను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా పసి బిడ్డలను అపహరించిన వారు తిరిగి అప్పగించక తప్పదు. నా రాజ్యం లో ఈడు కొచ్చిన పిల్లలు ర్యాంకులు రాలేదని పాడెక్కుతున్నారు. ర్యాంకులు శాశ్వతం కాదు, మేధస్సుతోనే అన్నింటినీ జయించవచ్చు. విస్తారమైన వానలతో పల్లెలు పులకించిపోతాయి. రాప్ట్రానికి అకాల నష్టాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా అష్టదిక్కులను దిగ్భందిస్తానని ఆమె తెలిపారు.
దేవాదాయ శాఖ దయ చూపాలి
తరతరాలుగా మహంకాళి అమ్మవారి ఆలయాన్నే నమ్ముకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా దేవాదాయ శాఖ అదుకోవాలని ఆలయ చైర్మన్ సురిటి కృష్ణ కుమారుడు రాజు తెలిపారు. మాతంగుల పోషణ ఒకప్పడు అమ్మవారే చూసుకునేదని, అమ్మ వారికి భక్తులు సమర్పించే కానుకలలో ఎంతో కొంత వారికి ఇచ్చి ఆదుకునేవారు. కాగా 1956లో ధర్మాదాయ దేవాదాయ శాఖకు ఆలయం అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారి సేవలో ఉన్న సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కాలక్రమంలో ప్రభుత్వంతో సంప్రదింపులతో, కోర్టు జోక్యంతో కొంతమేర న్యాయం చేయగలిగాం. ఇదివరలో మాతంగి స్వర్ణలతకు రూ.1500 ఇచ్చేవారు. ఇటీవల కాలంలోనే ఆమెకు నెలకు రూ.3000ల చొప్పున గౌరవ వేతనం లభిస్తోంది. ఇది ఏమాత్రం సరిపోదని తెలుసు. ఆపై మాతంగులు వేరే ఏ పని చేయరు. మాతంగులకు సమాజంలో గౌరవంగా జీవించే విధంగా వేతనం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం సైతం కొంత చొరవ చూపి దేవీ ఉపాసకురాలైన స్వర్ణలతకు కనీస వేతనం, ఇతరత్రా అవసరాలు సమకూర్చాలి. 2005 నుంచి ప్రభుత్వం వారే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో జనం పండుగ ప్రభుత్వ పండుగగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని వివరించారు.