Search
Wednesday 26 September 2018
  • :
  • :

రేటు తగ్గింపు ఉంటుందా? లేదా?

rbi

 నేటి నుంచి ఎంపిసి సమావేశం
 మూడు రోజులపాటు పరపతి సమీక్ష

ముంబై: ఈ వారంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఆరుగురు సభ్యుల ఎంపిసి(ద్రవ్యవిధాన కమిటీ) మూడు రోజుల సమావేశం నేటి నుంచి ప్రారంభం కానుంది. పెరిగిన ద్రవ్యోల్బణం, అధిక క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం ఎంపిసి సభ్యులపై ఎక్కువగా ఉండనుంది. ఆర్‌బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపిసి సమీక్ష నిర్వహించనుంది. సాధారణంగా పాలసీ సమావేశాలు రెండు రోజులకే పరిమితమవుతుంటాయి. అయితే ఈసారి సోమవారం(4) మొదలుకానున్న పరపతి విధాన సమీక్ష బుధవారం(6న) ముగియనుంది. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను ఆర్‌బిఐ నిర్దేశించనుంది. 2018 జనవరి మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతంతో ఏడు నెలల గరిష్ఠానికి చేరగా, ఈసారి సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరిగాయి. అయితే గత ఆగస్ట్ నుంచి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేస్తోంది. ఏప్రిల్ 5న జరిగిన పరపతి సమీక్షలో రెపో రేటును 6 శాతం వద్దే కొనసాగించగా, రివర్స్ రెపో 5.75 శాతంగా అమలవుతోంది. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. అయితే ఈసారి సమీక్షలో పావు శాతం వడ్డీ రేటు పెంచే అవకాశం ఉందని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఆగస్టు పాలసీలో మాత్రమే రేట్ల పెంపునకు వీలున్నట్లు అత్యధిక శాతం విశ్లేషకులు అంచనా వేశారు. ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ(సిపిఐ) 4.58 శాతాన్ని తాకడంతో ఇకపై ఆర్‌బిఐ కఠిన విధానాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు అత్యధిక శాతం అంచనా వేస్తున్నారు.

Comments

comments