Home అంతర్జాతీయ వార్తలు భారత్, చైనాలే కారణం!

భారత్, చైనాలే కారణం!

tmp

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి కారణం ఆ రెండు దేశాలే : ట్రంప్  

వాషింగ్టన్: చారిత్రక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరణకు భారత్, చైనాలే కారణమంటూ నెపమంతా భారత్, చైనాలపైనే నెట్టేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2017 జూన్‌లో పారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకుంటున్నామని ఆయనే ప్రకటించారు. ఆ ఒప్పందం కారణంగా అమెరికా ట్రిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, ఉద్యోగాలు నశిస్తాయని, చమురు, గ్యాస్, బొగ్గు తయారీ పరిశ్రమలు కుంటుపడతాయని నాడు ప్రకటన చేస్తున్న సందర్భంలో ఆయన అన్నారు. అంతేకాక ఒప్పందంపై పునఃచర్చిస్తామని కూడా చెప్పారు. పారిస్ ఒప్పందం నుంచి చైనా, భారత్‌లు లాభపడుతున్నాయని, కానీ అమెరికా విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పారిస్ ఒప్పందం వల్ల అమెరికా వ్యాపారం, ఉద్యోగాలు దెబ్బతిన్నాయని అన్నారు. పారిస్ ఒప్పందం వినాశకరంగా ఉందని, ముఖ్యంగా అమెరికాకు వినాశకరంగా ఉందని ఆయన కన్జర్విటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. ‘అమెరికా దగ్గర ఉన్న అపార బొగ్గు, చమురు నిక్షేపాలను ఉపయోగించొద్దని వారంటున్నారు. అంటే మనం ఇతర దేశాలతో పోటీపడకూడదన్న అర్థంలో మాట్లాడుతున్నారు. కానీ ఆ ఎత్తుగడను సాగనివ్వబోమని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ వివరించారు. ‘వారు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటూ లబ్ధి పొందుతున్నారు. అమెరికాను అభివృద్ధి చెందిన దేశంగా లెక్కగట్టేశారు. దాంతో అమెరికానే చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ‘వారి షరతుల ప్రకారం మనం ఏవీ నిర్మించకూడదు, వ్యవసాయం చేయకూడదు. ఒకవేళ పొలంలో నీటి గుంట ఉన్నా దానిని వారు చెరువు అంటా రు. అది పర్యావరణకు సంబంధించిందంటారు. ఇదంతీ విపరీతం అని నేనంటాను’ అని ట్రంప్ వివరించారు.
ఉ.కొరియాపై కఠిన ఆంక్షలు
ఉత్తరకొరియాకు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకముందు ఎన్నడూ ఏ దేశం మీద విధించని అత్యంత కఠినమైన ఆంక్షలను ఉత్తరకొరియా మీద విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం వాషింగ్టన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉ.కొరియాపై భారీగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉ.కొరియాకు చెందిన 56 నౌకలు, షిప్పింగ్ కంపెనీలు, ఇతర కార్యకలాపాలపై ఈ ఆంక్షలు అమలుకానున్నాయన్నారు. సరికొత్త ఆంక్షల ద్వారా ప్యాం గ్యాంగ్ నుంచి నిషేధం విధించిన ఆయుధాలను సరఫరా చేసే నౌకలు, అక్రమంగా బొగ్గు, ఇంధన రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకోని వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. దీని వల్ల ఆ దేశ వాణిజ్యంపై అధిక ప్రభావం పడుతోంది. అమెరికా ఆంక్షలు కాదని ఎవరైనా ఉత్తరకొరియాతో వాణిజ్య, వ్యాపార లావాదేవీలు జరపాలని చూసిన దేశాలతో యూఎస్ వ్యాపారాలను తెగదెంపులు చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ఆంక్షలు విధించినప్పటికీ.. ప్యాంగ్యాంగ్‌లో ఎటువంటి మార్పు రాకపోతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు మరింత భయంకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.