Home రాష్ట్ర వార్తలు జైలు నుంచి మందకృష్ణ మాదిగ విడుదల

జైలు నుంచి మందకృష్ణ మాదిగ విడుదల

st

 బెయిల్‌పై మందకృష్ణ మాదిగ విడుదల
1 నుంచి ఐదు రోజుల ఉపవాస దీక్షలు
హైదరాబాద్:ఎస్‌సి వర్గీకరణ సాధించడానికై శాంతియుతంగా నిరసనలు చేస్తే తమపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్న కెసిఆర్‌పై నిర్బంధ కేసులు నమోదు కాలేదని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపై 20 కేసులు పెట్టారన్నారు. దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టమా అని ఆయన ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగకు సికింద్రబాద్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కెసిఆర్ ఆమరణ దీక్ష చేస్తే ఎంఆర్‌పిఎస్ అండగా నిలిచిందని, కానీ వర్గీకరణ కోసం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే కెసిఆర్ తనను 10 రోజులు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రాష్ట్ర ప్రభు త్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యాంగంలో ఉండే చ ట్టాలు,సెక్షన్‌లు అమలు చేయడానికి బదు లు కెసిఆర్ మను ధర్మ సూత్రాలను అమ లు చేస్తున్నారన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామన్నారు.
ఎప్పుడూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ మిలియన్ మార్చ్ పేరుతో హైదరాబాద్ నగరంలో విధ్వంసాలు సృష్టించారని తెలిపారు. అప్పుడు లేని కేసులు ఇప్పుడు మా పై నమోదు చేసి జైలులో పెట్టడం అన్యాయమన్నారు. సభలకు, నిరసనలకు అనుమతులను నిరాకరించడం, నిర్భందించ డం కెసిఆర్ ప్రభుత్వానికి సరికాదన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసనలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ రోజు తమ నాయకురాలు భారతి చనిపోయేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతి చనిపోయిందని తెలియగానే అసెం బ్లీ సాక్షిగా 48 గంటలో అఖిల పక్షాన్ని ఢీల్లీకి తీసుకెళుతామని చెప్పి నేటికి 40 రోజులు కావొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కెసిఆర్ 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎంఆర్‌పిఎస్ మద్దతు పలికిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడే ఎంఆర్‌పిఎస్ నాయకులపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి 10 రోజులు జైలులో పెట్టి కెసిఆర్ రుణం తీర్చున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన కుట్రలో ప్రజలు అతనికి అడ్రస్ లేకుండా చేశారని,అదే గతి కెసిఆర్‌కు పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలోపు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తమకు మద్దతు పలికిన పార్టీలకు,ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు ధన్యవాదాలు తెలిపా రు. అంతకుముందు మందకృష్ణ విడుదల విషయం తెలుసుకున్న ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సత్యానారాయణ ఆధ్వర్యంలో జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్య లు తీసుకున్నారు. మంద కృష్ణ మాదిగ, కార్యకర్తలను కలవకుండా పోలీసులు సూచనలు చేయడంతో ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు.