Home ఆదిలాబాద్ తడ‘బడి

తడ‘బడి

The resume of schools today

పదోన్నతులు, బది‘లీల’లో పంతుళ్లు
ఏళ్ల నుండి కనీస సౌకర్యాలు లేని సర్కార్ పాఠశాలలు
నేడు పాఠశాలల పునఃప్రారంభం

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో:  దశాబ్దాల నుండి సర్కార్ బడులు తడబడుతూనే ఉన్నాయి. ఈ బడులను పరిరక్షించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామంటూ పాలకులు ఇస్తున్న హామీలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. పిల్లల నమోదు పెంపు కోసమే కాకుండా బడులను పరిరక్షించుకునేందుకు ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. అరకొర వసతులతో అల్లాడుతున్న సర్కార్ పాఠశాలలను ఆదుకునే వారే కరువయ్యారు. వందల పాఠశాలల్లో సరైన గదులు కాని మరుగుదొడ్లు గాని లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే కనీసం తాగు నీటి సౌకర్యం లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం భారీగా నిధులు, పథకాలు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి దరిచేరడంలేదు. మంత్రులు, ఎంఎల్‌ఏలు ఉన్న గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇలా సర్కార్ నిర్లక్ష వైఖరికి ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్య ధోరణి శాపం గా మారుతోంది. ప్రభుత్వ విద్య వ్యవస్థను ప్రైవేట్ పాఠశాలలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో తడబడుతున్న ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్య సంవత్సరం మరింత శాపంగా మారబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతు లు, బదిలీల ప్రక్రియ ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే మొ దలు కాబోతుండడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకిస్తుంది. ప్రస్తుతం పాఠశాల పునః ప్రారంభం అంశం కన్నా బదిలీలు, పదోన్నతుల చుట్టూ విద్య వ్యవస్థ పరిభ్రమిస్తుంది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. వేసవి సెలవుల పొడగింపు అలాగే ఒంటి పూట బడులు పేరిట విద్యాశాఖ జారీ చేస్తున్న ఆదేశాలు ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి అటుపోట్ల మధ్య శుక్రవారం నుండి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించబోతున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన మరుసటి రోజే తెలంగాణరాష్ట్ర ఆవిర్భావదినోత్సవం జరుపుకోబోతుండడం గమనార్హం.