Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

డాక్టర్ @ 65?

docter

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి 62 లేదా 65 ఏళ్లకు పెంచే యోచన
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అన్ని స్థాయిల్లోనూ వర్తింపు త్వరలో అధికారిక ప్రకటన?

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో డాక్టర్ల పదవీ విరమణ వయసును పెంచేందుకు సర్కార్ సన్నాహాలను దాదాపు పూర్తి చేసింది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, అభ్యంతరాలు లేకుం డా పదవీ విరమణ వయసును పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో వైద్య విద్య సంచాలకు లు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి నివేదికను సమర్పించారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో డాక్టర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్ల వరకు ఉంది. కేంద్ర సర్వీసులో పనిచేసే డాక్టర్ల పదవీ విరమణ వయసును కూడా కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్ళకు పెంచింది. ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని సూచించింది. దీంతో గత నెల ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. లకా్ష్మరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. వయసు విరమణ పెంపు బోధనాసుప్రతులకే పరిమితం కాకుండా జిల్లా, ప్రాంతీయ ఆసుప్రతులతో పాటు సామాజిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి కూడా వర్తించే అంశంపై చర్చించారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సైతం సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. దీంతో డాక్టర్ల పదవీ విరమణ వయసు పెంపునకు మార్గం సుగమమైంది. అయితే పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచాలా లేక 65 ఏళ్లకు పెంచాలా అనేదానిపై మాత్రం ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వడంలేదు. కొన్నిరాష్ట్రాల్లో 62 ఏళ్ళుగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో 65 ఏళ్ళుగా ఉంది. డాక్టర్ల పదవీ విరమణ వయసును పెంచడాన్ని కొందరు డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల సర్వీసులో ఉన్న వైద్యులకు పదోన్నతులు రావడం ఆలస్యమవుతుందని, తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్లు మరికొంత కాలం ఇక్కడే సేవలు అందించాల్సి రావడం అనేది ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58 ఏళ్ళుగా ఉండడంతో రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల కొరత ఉంది. ఈ ప్రభావం ప్రభుత్వ ఆసుప్రతులతో పాటు కళాశాలల్లో బోధనపై కూడా పడుతోంది. రెండేళ్ల కాలంలో వంద మంది వరకు స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టు డాక్టర్లు పదవీ విరమణ పొందారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 మంది పదవీ విరమణ చేయనున్నారు.

Comments

comments