Home సినిమా జై మెప్పించగా… అంతంతమాత్రంగా లవ, కుశ

జై మెప్పించగా… అంతంతమాత్రంగా లవ, కుశ

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఊపుమీదున్న ఎన్‌టిఆర్ ఆ దూకుడుతో శరవేగంగా చేసిన చిత్రం ‘జై లవ కుశ’. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేకెత్తించింది. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, పవిత్ర లోకేష్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్‌టిఆర్ త్రిపాత్రాభినయం చేయడం… అందులో ఒకటి నెగటివ్ రోల్ కావడం ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచింది. ఎన్‌టిఆర్ ఆర్ట్ పతాకంపై కళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Jai-Lava-Kusa

సినిమా కథ: జై, లవ, కుశ ముగ్గురు సోదరులు. అందులో జైకి నత్తి ఉంటుంది. ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తూ తమ్ముళ్లిద్దరూ అతన్ని ఎగతాళి చేస్తారు. వీళ్ల మామయ్య పోసాని కృష్ణమురళి… జైని మరింతగా అవమానాల పాలు చేస్తుంటాడు. దీంతో ముందుగా తమ్ముళ్లిద్దరిపై ఎంతో ప్రేమ చూపించిన జై… ఆతర్వాత వారిపై కోపం పెంచుకుంటాడు. వాళ్లను నాశనం చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు అన్నదమ్ములు విడిపోయి వేర్వేరు చోట్ల పెరుగుతారు. లవ బాగా చదువుకొని బ్యాంక్ మేనేజర్ అయితే… కుశ దొంగగా మారతాడు. ఓ సందర్భంలో వీళ్లిద్దరూ అనుకోకుండా కలుస్తారు. అయితే ఓ రోజు లవ ప్రేయసి, కుశకు సంబంధించిన డబ్బు కనిపించకుండా పోతాయి. దాని వెనుక సూత్రధారి జై అని తెలుస్తుంది. ఇంతకీ జై ఏమయ్యాడు… ఎక్కడ, ఎలా పెరిగాడు.. లవ ప్రేయసి, కుశ డబ్బును అతనెందుకు ఎత్తుకెళ్లాడు… చివరికి ఈ అన్నదమ్ముల కథ ఎక్కడి దాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

విశ్లేషణ: ‘జై లవ కుశ’లో గొప్ప కథేమీ లేదు. ఇది చాలా పాత కథ. ఈ కథ 80ల్లోని సినిమాల్ని తలపిస్తుంది. కథనమైనా కొత్తగా… బిగితో ఉందా అంటే అదీ లేదు. ఇలాంటి కథను ఓ మామూలు నటుడితో తీస్తే ‘జై లవ కుశ’ను చూడడం కష్టమయ్యేదేమో. కానీ ఈ సినిమా దర్శకుడు చేసిన అత్యంత తెలివైన పనేమిటంటే… తన కథకు ఎన్‌టిఆర్‌ను కథానాయకుడిగా ఎంచుకోవడం. ఒక మంచి నటుడి చేతిలో పడితే ఓ మామూలు కథ కూడా మరో స్థాయికి వెళ్తుందనడానికి ‘జై లవ కుశ’ ఉదాహరణగా నిలుస్తుంది. కథ, కథనాల సంగతెలా ఉన్నా… ఎన్‌టిఆర్‌ను హీరోగా ఎంచుకోవడం, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో జై పాత్రను డిజైన్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. ఇక ఎన్‌టిఆర్ నటనా కౌశలం గురించి చెప్పేదేముంది… ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా అతను జై పాత్రను పండించాడు. మొత్తంగా మూడు పాత్రల్లోనూ వైవిధ్యం చూపిస్తూ… మూడింటినీ పండిస్తూ తెరపై అదరగొట్టాడు. సినిమాలో చాలా లోపాలున్నా వాటన్నింటినీ మరిపించే నట విశ్వరూపంతో మాయ చేశాడు తారక్. సినిమాగా ‘జై లవ కుశ’ మామూలుగా అనిపించినా… ఎన్‌టిఆర్ పర్‌ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇది ప్రత్యేకమైన సినిమానే.

ఇక జై పాత్రే సినిమాకు ప్రాణం. ఈ కథలో కదలిక వచ్చేది, ప్రేక్షకులు సీరియస్‌గా కథలో లీనమయ్యేది జై పాత్ర ప్రవేశంతోనే. లవ, కుశ పాత్రలు రెండూ మామూలుగా అనిపిస్తాయి. లవ పాత్ర చుట్టూ నడిచే రొమాంటిక్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమా ప్రథమార్థంలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు సాగిపోవడం నిరాశపరుస్తుంది. అయితే జై పాత్రను అదిరిపోయే సన్నివేశంతో పరిచయం చేస్తాడు బాబీ. జై ప్రవేశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపిస్తూ… వాటిలో వైవిధ్యం చూపిస్తూ ఎన్‌టిఆర్ ప్రేక్షకుల్ని అలరిస్తాడు. అయితే తారక్ మెప్పించినా కథాకథనాల్లో ఏ విశేషం లేకపోవడం, బలమైన సీన్లు కనిపించకపోవడంతో ఓ దశలో ‘జై లవ కుశ’ ట్రాక్ తప్పుతున్న భావన కలిగిస్తుంది. అయితే చివరి అరగంటలో అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్లు మెప్పిస్తాయి. నిజానికి జై పాత్ర కూడా అంత గొప్పగా ఏమీ అనిపించదు. ఆ పాత్రలోనూ కొన్ని లోపాలున్నాయి. చిన్నతనంలో తెలియక తప్పు చేసిన తన తమ్ముళ్లపై అన్న పగ పెంచుకోవడం, చివరికి వాళ్లను చంపడానికి కూడా సిద్ధమైపోవడం, అన్ని ఏళ్ల పగతో ఉన్నవాడు ఒక చిన్న నాటకంలోని కొన్ని డైలాగులతో మారిపోవడం అన్నది లాజికల్‌గా అనిపించదు. ఇలాంటి లోపాలు చాలానే ఉన్నా యి ఈ సినిమాలో. ఎన్‌టిఆర్ అభినయానికి తోడు… ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కమర్షియల్ అంశాలు కొన్ని ఉన్నాయి ఈ చిత్రంలో.

నటీనటులు: వన్ మ్యాన్ షో అనే మాటకు ‘జై లవ కుశ’ అసలైన నిదర్శనంగా నిలుస్తుంది. సినిమా అంతటా ఎన్‌టిఆరే కనిపిస్తాడు. స్క్రీన్ టైంలో 90 శాతం ఎన్‌టిఆర్ దర్శనమిచ్చి అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తాడు. సినిమాలో మిగతా నటీనటులంతా మామూలుగానే కనిపిస్తారు. ఎన్‌టిఆర్ తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది సాయికుమార్. తన అనుభవాన్ని రంగరించి పాత్రకు తగ్గట్టుగా ఆయన బాగా నటించాడు. హీరోయిన్లు రాశిఖన్నా, నివేదా థామస్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉంటారో అలాగే కనిపించారు. రాశి గ్లామర్ పరంగా పర్వాలేదనిపించింది. మంచి నటి అయిన నివేదా పాత్ర చాలా మామూలుగా ఉండటం నిరాశ పరుస్తుంది. పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో కొంతవరకు నవ్వించాడు. విలన్ రోనిత్ రాయ్ ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా వాళ్లంతా మామూలుగానే కనిపిస్తారు. అయితే సినిమాలో తమన్నా చేసిన ఐటమ్‌సాంగ్ మూవీకే హైలైట్ అవుతుందని భావించారు. అంతేకాదు ఈ ఫిల్మ్ తర్వాత మిల్కీబ్యూటీకి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమని అనుకున్నారు. చివరకు అవన్నీ తుస్సుమన్నాయి. ఎందుకంటే తమన్నా సాంగ్ ఆశించినంతగా అలరించకపోగా… సినిమా నెగటివ్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచింది.

సాంకేతికవర్గం: దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఓకే. ‘రావణా…’ పాట మినహాయిస్తే మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. పాటల విషయంలో నిరాశపరిచినప్పటికీ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు దేవిశ్రీ. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరి నుంచి ప్రత్యేకంగా కనిపిస్తుంది. దర్శకుడు బాబీ మామూలు కథతో ఎన్‌టిఎఆర్ మీదే భారం మోపేశాడు. కథాకథనాలను బిగితో నడిపించడంలో బాబీ విఫలమైనప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో పర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే ‘జై లవ కుశ’ అభిమానులను అలరించేలా ఉన్నా రెగ్యులర్ ప్రేక్షకులకు యావరేజ్‌గా అనిపిస్తుంది.