Home ఆఫ్ బీట్ ఎగిరే బైక్

ఎగిరే బైక్

fliying-bikes

ఈ అధునాతన కాలంలో డ్రోన్ టెక్నాలజీ విజృంభిస్తున్న సమయంలో అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అదుతాలు సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలాగే ఎగిరే బైసైకిళ్ళు, కార్లు కూడా తీసుకువచ్చేందుకు వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. అతి త్వరలో ఎగిరే కార్లను, బైసైకిళ్ళను మనం నడిపే రోజులు రాబోతున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఫొర్డన్ (37), యానిక్ రీడ్ (42) ఎంతో కాలం కృషి చేసి రోడ్డుమీద పరుగులు తీసే బైక్‌ను ఆకాశంలో ఎగిరేట్టుగా చేశారు. వీరు ఇంగ్లాండ్ శివారులో థేమ్స్ నదీ తీరంలో కింగ్‌స్టన్ ఏరియాలో ఉంటారు. వీళ్ళ ఇంటి నుంచి కూతవేటు దూరంలో సాప్‌విత్ ఏవియేషన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు సాప్‌విత్ కెమెల్‌ను తయారుచేసింది. దీన్ని రాయల్ ఎయిర్‌ఫోర్స్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో వినియోగించారు. అలాగే రైట్ బ్రదర్స్ కూడా ఈ దరిదాపులలోనే ఉండేవారు.

వారు కూడా మొదట్లో బైక్ మెకానిక్‌లే! ఆ తర్వాత వారు పవర్డ్‌ఫ్లయిట్‌ను తయారుచేసి ఎగిరే విమానాన్ని సృష్టించారు. ఆ బ్రదర్స్‌నే ఆదర్శంగా తీసుకుని చరిత్రను పునరావృతం చేయాలని అనుకున్నాం. అందుకే రోడ్డు మీద నడిచే బైక్‌నే ఎగిరే వాహనంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు పాటుపడ్డాం. ఇన్నాళ్ళ కల ఫలించింది. ఎగిరే బైక్ ఆకారం దాల్చింది. ఈ వాహనాన్ని ఎలాగైనా ఎక్కువ ధర ఉండకుండా చూడాలని నానా ప్రయత్నాలు చేశాం. అవి కూడా ఫలించాయి. ఇప్పుడిది ఒక చిన్నకారు ధరలోనే ఉంటుంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ బైక్‌ను మడిచే వీలు కల్పించాం. చాలా దగ్గరకి ఒదిగిపోయే లక్షణం ఉండడం వల్ల ఇది ఒక చిన్న సైకిల్‌లా మారిపోతుంది. కనుక దీని పార్కింగ్‌కు ఎక్కువ చోటు అవసరం ఉండదు అంటున్నారు.

డ్రోన్ నుంచి మరింత ముందుకు..
డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేసి మానవరవాణాకు వీలుగా తీర్చిదిద్దారు. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు కదలలేని స్థితి ఉన్నా అర్జెంటుగా వెళ్ళాల్సిన వారు గాలిలో ఎగిరి ఎవ్వరికీ ఎలా ప్రమాదం చేయకుండా అనుకున్న చోటికి వెళ్ళిపోయేలా ఈ బైక్‌ను డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా విఐపిలు తిరగడానికి, ఆంబులెన్స్, పోలీస్, ఫైర్ సర్వీస్ వాహనాలు క్షణం ఆలస్యం చేయకుండా సర్వీసులు అందజేయడానికి వీలుగా ఈ వాహనాలు ఉపయోగపడతాయని వారు అంటున్నారు. మొదట ప్రాణావసరాలకు ఉపయోగపడే ఈ వాహనాలు తర్వాతి రోజులలో విహార యాత్రలు చేయడానికి కూడా వాడుకోవచ్చునని వారంటున్నారు.

ఎగిరే బైక్‌కు పారావెలో అని పేరు పెట్టారు. ఇది నేల మీద 15 మైళ్ళ వేగంతోనూ గాలిలో 25 మైళ్ళ వేగంతోనూ ప్రయాణిస్తుంది. పారావెలొను ఆన్ చేయడానికి ఎలక్ట్రానిక్ మోటార్ పనిచేస్తుంది. దీన్ని పైకి తీసుకువెళ్ళడానికి బయోడీజిల్‌ను వినియోగించే ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. దీని ద్వారా అందే కరెంట్‌ను వినియోగించుకుని వాహనానికి ఉన్న ఫ్యాన్‌లు తిరిగి దాన్ని పైకి లేచేలా చేస్తాయి. దీనికి నైట్‌ఫైర్ స్ట్రోబ్స్ ఏర్పాటుచేశారు. ఇది చీకట్లో ప్రయాణిస్తున్నా రెండు మైళ్ళ దూరం నుంచే దీని రాకను గమనించడానికి ఈ స్ట్రోబ్స్ ఉపయోగపడతాయి.

సినాన్ గ్యాస్‌తో పనిచేసేలా వీటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశారు. ఈ హ్యాండిల్ బార్‌ను 1/1.25 అంగుళాల క్లాంప్‌కు వీటిని బిగించవచ్చు. అయితే ఈ బార్ అటు బ్రేక్‌కు కాని, ఇటు గేర్ షిఫ్టర్స్‌కు కాని అనుసంధానించలేదు. పండగలకు పబ్బాలకు అవుటింగ్‌లకు వెళ్ళేవారు టెంట్ వేసుకుని ఉండేందుకు వీలుగా టెంట్ మెటీరియల్‌ను వెంట తీసుకువెళ్ళడానికి వీలు కల్పించారు.

దీనికి బయో ఇంధనం వాడతారు. కనుక పర్యావరణం కలుషితమైపోతుందన్న భయంలేదు. ఇది నేల నుంచి 4వేల అడుగుల ఎత్తున ఎగురుతుంది. ఈ బైక్‌కు రెక్కలు, ఒక ప్యాన్, ఒక మోటార్, ఒక పారాచ్యూట్ ఉంటుంది. ట్యాంక్ ఫుల్‌గా బయోడీజిల్ కొట్టిస్తే 3 గంటలపాటు ప్రయాణం చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 లక్షల 60వేలు ఖర్చయ్యాయి. దీన్ని నడపడానికి లైసెన్స్ అకర్లేని వాహనానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామని కనుక తమ పారవెలొ వాహనం వాడుకోదలచుకున్న వారు లైసెన్స్ పొందాల్సిన అవసరంలేదని ఫోర్డెన్ చెప్పారు. తమ వాహనం మార్కెట్‌లోకి ప్రవేశిస్తే నగరాలలో ప్రయాణించే పద్ధతే మారిపోతుందని రీడ్ చెప్పారు.

తమ పారావెలొకు ఎన్విరాన్‌మెంట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసేషియన్ నుంచి క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. అనేక దశాబ్దాలుగా రోడ్డు రవాణాలో కార్లదే పైచేయిగా ఉంటోంది. అతి త్వరలో ఈ సీన్ మారిపోనుంది అని ట్రాన్స్‌పోర్ట్ అసోసేషియన్ డైరక్టర్ ఆండ్రూ డేవిస్ చెప్పారు. సాహస యాత్రలు చేయాలనుకునేవారు, హెలికాప్టర్‌లో అలా ఒక రౌండ్ వేయాలనుకునేవారు ఖర్చుకుభయపడి తమ కోరికను అణుచుకుంటున్నారు. ఇప్పుడు ఇక ఆ బాధ అక్కరలేదు. పారావెలొ ఎక్కి ఎంచక్కా చెక్కర్లు కొట్టొచ్చు. తక్కువ ఖర్చుతో ముచ్చట తీర్చుకోవచ్చు కనుక ఎక్కువ మంది మొగ్గు చూపుతారని తమ వాహనానికి మంచి డిమాండ్ ఉంటుందని రీడ్స్ అన్నారు.