Home తాజా వార్తలు రహదారి రక్తసిక్తం

రహదారి రక్తసిక్తం

accident

12  మంది దుర్మరణం

30 మందికి తీవ్ర గాయాలు

ఢీకొన్న నాలుగు వాహనాలు, క్వాలిస్ నుజ్జునుజ్జు

మన తెలంగాణ/సిద్దిపేట/గజ్వేల్/మర్‌కుక్కు/ రామచంద్రాపురం : హైద రాబాద్  కరీంనగర్ రాజీవ్ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లే రహదారిపై రిమ్మనగూడ శివారు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా సుమారు 30 మంది  గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విష మంగా ఉంది. ఆర్‌టిసి బస్సు, రెండు లారీలు, క్వాలీస్ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రహదారిపై హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్‌టిసి బస్సు (రాజధాని టిఎస్19 జెడ్ 0012) దాని ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుకు దూసుకెళ్ళి అదే సమయంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్, క్వాలీస్ వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్వాలీస్‌లో ప్రయాణిస్తున్న జర్నలిస్టు కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 17 మందిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంతో ఆ ప్రాంతం రక్తసిక్తమై క్షతగాత్రుల హాహాకారాలతో మార్‌మెగింది. రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని, రాజీవ్ రహదారిపై రెండు వైపుల ఒకే సారి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు వైపుల నుండి సుమారు 10 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించి పోయిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన వారిలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్ద గూడెంకు చెందిన జర్నలిస్టు జి.లక్ష్మణ్ (35), విజయ (6), అతని తల్లిదండ్రులు గండెమ్మ (55), మల్లేషం (60), బంధువులు సుశీల (60), శ్రీనివాస్ (6), సత్తెమ్మ (60)లతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ఆసీఫాబాద్‌కు చెందిన రాహుల్ (41), గోదావరిఖనికి చెందిన సాయి నిఖిల్ (21), కరీంనగర్‌కు చెందిన సింధూజ ఓంకార్ (11) ఉన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులను కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స :మంత్రి హరీష్‌రావు
రాజీవ్హ్రదారిపై శనివారం సాయంత్రం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం పది మందని బలి తీసుకున్న దుర్ఘటన పట్ల రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్రాభంతిని వ్యక్తం చేశారు. సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి హరీష్‌రావు ప్రమాదం సమాచారం తెలియగానే హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గజ్వేల్ ప్రభుత్వ అస్పత్రికి చేరుకుని మార్చురిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి హరీష్‌రావు పరామర్శించి ఓదార్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాలో పాటు బీమా సొమ్ము అందేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను అదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయడానికి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యబృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. క్షతగాత్రులకు అత్యవసరమైన, మరింతమెరుగైన వైద్యం కోసం అవసరమైతే కార్పోరేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధిధికారి ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక వైద్య బృందాలు క్షతగాత్రులకు వైధ్యసేవలు అందిస్తున్నారన్నారు. ఈ ప్రమాదంలో జిన్నారం మండలం నవ తెలంగాణ విలేకరి లక్ష్మణ్ సహ ఆయన కుటుంబానికి చెందిన ఎడుగురు అక్కడికక్కడే మృతిచెందడం విషాదకరమన్నారు. విరంతా కొమురవెళ్లి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందన్నారు.
జర్నలిస్టు కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం
రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిన్నారంకు చెందిన జర్నలిస్టు లక్ష్మణ్ కుటుంబంలో చాలా మంది మృతి చెందడంతో జిన్నారంలో విషాదచాయలు అలుముకున్నాయి.
లక్ష్మణ్ జిన్నారం మండల కేంద్రంలో నవ తెలంగాణ విలేకరిగా పనిచేస్తున్నాడు. తీర్థయాత్రకులకు వెళ్ళి తిరిగి వస్తూ కొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటామనే లోగానే ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో లక్ష్మణ్‌తో పాటు ఆయన తండ్రి మల్లేషం(75), తల్లి గండమ్మ(65) కుమారుడు చిన్నకూతురు విజయ (6)తో పాటు పలువురు బంధువులు కూడా మరణించారని సమాచారం అందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
ప్రజ్ఞాపూర్ రోడ్డు ప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ దగ్గర శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణం వైద్య సౌకర్యాలు అందేలా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి సైతం చొరవ తీసుకుని గాయపడినవారందరికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా జిల్లా వైద్యాధికారిని, ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. గజ్వేల్‌లో ప్రాథమిక చికిత్స చేసి సీరియస్‌గా ఉన్నవారిని హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించాలని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదిన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇరవై మంది క్షతగాత్రులను జిల్లా వైద్యాధికారి స్వయంగా గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తునానరని, అన్ని విభాగాల వైద్యులు చికిత్స కోసం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రమాదంపై విచారణ : రవాణ మంత్రి మహేందర్ రెడ్డి
మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 11 మంది వరకు మృతిచెందగా 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.