Home లైఫ్ స్టైల్ బొమ్మను చేసి ప్రాణం పోసి…

బొమ్మను చేసి ప్రాణం పోసి…

rock stones also dance in his hand

తెలంగాణ అమరవీరుల స్థూపశిల్పి పద్మశ్రీ ఎక్కా యాదగిరి

అతన్ని చూడగానే బండరాళ్లకు, లోహాలకు ప్రాణం వస్తుంది. గుట్టల్లో ఉన్న బండరాళ్లు సైతం అతడి చేతిలో నాట్యం చేస్తాయి. కొడుకు బొమ్మలు చేసి పుట్‌పాత్‌ల మీద అమ్ముకుంటూ బతుకుతాడేమోనని భయంతో తల్లిదండ్రులు ఆ పని మానేయమని ఇతరులతో చెప్పించారు. అయినా అతను మానుకోలేదు. తనలో ఉన్న కళను ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. అతని కళలకు సాక్షంగా నిలిచింది గన్‌పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం. ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో ఒక ప్రత్యేకత చాటి పోవాలంటాడు. అలా శిల్పకళలకు “మిథున” తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ ఎక్కా యాదగిరి మన తెలంగాణతో తన కళల జ్ఞాపకాలను పంచుకున్నారు..

మాది మహబూబ్‌నగర్ జిల్లా కానీ నేను పుట్టకముందే మా నాన్న హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉండేవాడు. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాన్న ఫిలాసఫర్, స్కూల్లో టీచర్‌గా పనిచేశాడు. అప్పట్లో నాన్న స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. అలాగే మద్యపానానికి వ్యతిరేకంగా పనిచేశాడు. అలా మా కుటుంబం నాకు సమాజం పట్ల బాధ్యతగా ఉండటాన్ని నేర్పించింది.

కళల ప్రస్థానం గురించి…
మా చిన్నాన్న దేవుళ్ల విగ్రహాలను చేసేవాడు. ఆయన స్ఫూర్తితో నేను చిన్నప్పటి నుండి మట్టితో కోటలు, మనుషులు, జంతువులు, దేవుళ్ల బొమ్మలు తయారుచేసేవాడిని. చదువుకుంటున్నప్పుడు అసలు మనిషి ఎందుకు పుడతాడు, ఈ జన్మ ఎందుకు..అనే ధోరణితో సన్యాసుల్లో కలిసిపోదాం అనుకున్నాను. మా గురువు నువ్వు అన్‌ఫిట్ అని నన్ను తిట్టి హితబోధ చేశాడు. ఈ జన్మను మనం వినియోగించుకుని మన కంటూ ఒక ప్రత్యేకత చాటి పోవాలి అనే అలోచనలు తట్టేవి. తరువాత మట్టితో హంసబొమ్మను చేసి గురువు విఠలేశ్వర్ పాటిల్‌కి చూపించాను. నువ్వు గొప్ప శిల్పకారుడివి అవుతాయి దానిపై దృష్టి పెట్టు అంటూ ఆయన మెచ్చుకున్నాడు. ఎక్కువగా పికాసో పుస్తకాలు చదివాను. ఇంటర్ అయిపోయాక అందరిలాగే నేను ఇంజనీరింగ్ చదువుతున్నా అనుకున్నారు. కాని ఫైన్‌ఆర్ట్‌లో చేరానని మా వాళ్లకు తెలియదు. శిల్పకళా కోర్సు చదివాను. పికాసోలాగే నేను కూడా పాడైపోయిన వస్తువులతో బొమ్మలు తయారు చేయాలనుకున్నాను. అలా సికింద్రాబాద్, హైదరాబాద్ పాత సామాను దుకాణాల చుట్టూ తిరిగేవాడిని. దొరికిన వస్తువులతో ఏదో ఒక రూపాన్ని తయారుచేసేవాడిని. కొన్నాళ్లకు బరోడా వెళ్లి వచ్చాక నేను శిల్పకళాకారుడిని అయినట్లు మా వాళ్లకు తెలిసింది.

ఆధునిక శిల్పకళాకారునిగా..
తెలంగాణ వచ్చిన తర్వాత 2017లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ ఆవార్డు అందుకున్నాను. శిల్పకళల కేటగిరీలో పద్మశ్రీ అందుకున్న మొదటి వ్యక్తిని నేను. అలా శిల్పకళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాను. 1968 నేను చేసిన ‘ మిథున’ శిల్పానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆర్ట్ లోపల భావం అనేది ముఖ్యం. అన్వేషణ భావాన్ని తెలుపుతుంది. శివలింగం ఒక నగ్నసత్యం. మిథునను శివలింగంతో పోల్చారు . 2007 నుండి రంగులతో ఆర్ట్ వేయడం ప్రారంభించాను. అవి కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. శిల్పకళలను శతాబ్దాలతో కొలుస్తాం. నేను 20 వ శతాబ్దపు శిల్పకాళాకారుడిని.

గన్‌పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం గురించి…
తెలంగాణ ఉద్యమంలో 360 మంది అమరులు చనిపోతే వారికి గుర్తుగా ఓ స్థూపాన్ని నిర్మించాలని అనుకున్నాను. 1972 నవంబర్ 1న గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేశాం. 1975లో స్థూపం పూర్తయింది. 1972 లో తెలంగాణ డిజైన్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. దాంట్లో నేను కూడా పాల్గొన్నప్పుడు స్థూపం ఆవిష్కరణ గురించి చెప్పగానే అందరూ ఆశ్యర్చపోయారు. ఇందులో మంచి సమాచారం ఉందంటూ నా ప్రాజెక్ట్‌ను ఎంపిక చేశారు. స్థూపంలో అప్పుడు తొమ్మిది జిల్లాలు, అశోక చక్రం, బుల్లెట్లు, మల్లెపువ్వులు ఉండే విధంగా ఏర్పాటు చేశాను. శాలిబండా నెహ్రూ విగ్రహం నేను చేసిందే. 1975లో ఆఫ్రికాకు చెందిన ట్రైబల్ బానిసల ప్రతిమలను మెటల్‌తో చేసి రష్యా ప్రదర్శనశాలలో పెట్టాను. సిబియస్‌ఈ సెలబస్‌లో నా ఆర్ట్ గురించి ఒక పాఠ్యాంశం పెట్టుకున్నారు. నేను చేసిన శిల్పాలు నేషనల్ ఆర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ గ్యాలరీలో ఉన్నాయి. 1971 నుంచి నేషనల్ స్థాయిలో ఆవార్డులు వస్తున్నాయి. 1974 లో గోల్డ్ మెడల్ వచ్చింది. హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో లేడి, లెబరర్ రెండు ఆర్ట్ నేను చేసినవే. ట్యాంక్‌బాండ్ మీద సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం, రవీంద్రభారతిలోని కొన్నివిగ్రహాలు తయారుచేశాను. ప్రపంచంలో చాలా చోట్ల నా ఆర్ట్ ఉన్నాయి.

కొత్త ప్రయోగాలు..
ప్రభుత్వం సహకారం అందిస్తే ఇంకా ప్రయోగాలు చేస్తాను. నాలో ఉన్న కళారూపాల్ని ఈ సమాజానికి అంకితం చేస్తాను. శిల్పకళ గొప్పతనాన్ని గురించి ఈ తరానికి చెప్పాలని ఉంది. ఇప్పుడు సరిగ్గా బండలు దొరకడం లేదు. ఉన్న గుట్టలను గ్రానైట్ పేరుతో అంతం చేస్తున్నారు. ఆధునిక కాలంలో శిల్పకళాకారులు తగ్గిపోతున్నారు.

                                                                                                                                               బి. శ్రీనువాసు