Home ఎడిటోరియల్ పాలక పక్షవాతమే!

పాలక పక్షవాతమే!

PARILMENT-1

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో అత్యంత నిరుపయోగమైనవిగా ఈ శీతకాల పార్లమెంట్ సమావేశాలు చరిత్రకెక్కాయి. లోక్‌సభ కేవలం 15 శాతం సమయమే పని చేసింది. రాజ్యసభ కేవలం 18 శాతం మాత్రమే పని చేసింది. అనుకు న్న దానిలో కేవలం 10 శాతం పని మాత్రమే పార్లమెంటులో జరిగింది.
పార్లమెంట్‌లో గలభా, కార్యక్రమాలకు అడ్డు తగలడం కొత్తగాని, వింతగాని కాదు. ప్రతిపక్షం నిరసన తెలపడానికి అవి సరైన పద్ధతులు. అయితే ప్రతిపక్షాల ఆందోళనను సంతృప్తిపరిచి సద్దుమణి గించడానికి ప్రభుత్వ పక్షం తగిన మార్గాలు వెతకాలి. అవసరమైన పద్ధతులు అనుసరించాలి. ప్రతిపక్షాన్ని చర్చలకు రప్పించాలి. ఆ విధంగా పార్లమెంట్ నడిచేలా చూడాలి. జాతి ప్రయోజనా నికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగేలా చూసి, అవసరమైన శాసనాలు చేయించాలి. అదే ఇప్పుడు జరిగింది. కొనసాగి ప్రభుత్వానికి ప్రతిప క్షానికి మధ్యమాటలు బంద్ కావడం, రెండింటి మధ్య వారధి నిర్మించే అవకాశాలు కరువు కావడం దురదృష్టకరం. అదే ఇప్పుడు జరిగింది.
ప్రభుత్వం సభా కార్యక్రమ సరళిని నిర్ణయి స్తుంది. అందుచేత దానిని ఆ విధంగా జరిపించు కోవలసిన బాధ్యత కూడా దానిదే. మొన్నటి సమావేశాలలో అది జరగకపోగా పాలకపక్షమే సభా కార్యక్రమాలకు అవరోధంగా నిరూపించు కొంది. ఆర్థిక ప్రళయాన్నే తీసుకు వచ్చిన నోట్ల రద్దు వ్యవహారం అంతవరకు చెల్లా చెదురుగా ఉన్న ప్రతిపక్షాలను ఒక్కత్రాటి మీదికి తెచ్చింది.

కొంతమంది మంత్రులే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో సభలు సాగే పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. అటువంటి పరిస్థితులలో స్పీకర్ పాత్ర అత్యంత కీలకమైనది. అయితే ఆమె (సుమిత్ర మహాజన్) కూడా పార్టీలకతీతమైన వారు కాదనే అభిప్రాయం ఏర్పడి పోయింది. దానితో తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి. ప్రస్తుత పార్లమెంట్‌లో పరిస్థితులను చక్కదిద్దగల స్థాయి నేతలు కరువయ్యారు. ఒకప్పుడు అటు వంటి వారు ఉండేవారు. వాజ్‌పేయి ప్రధానిగా పార్లమెంట్ సజావుగా జరిగేలా చూడవసిన బాధ్యతను గుర్తెరిగి ఆ విధంగా చేశారు. ప్రణబ్ ముఖర్జీ యుపిఎ మంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు పాలకపక్షం లోని మెజారిటీ ఎంపిలు ఎటువంటి పార్లమెంటరీ అనుభవంగాని, శిక్షణగాని లేనివారు. అద్వానీ ఉన్నా పార్టీయే తనను పక్కన బెట్టిందనే భావనతో ఉన్నారు.

ఇక మిగిలింది ప్రధాని మోడీయే. ఆయనే పార్లమెంట్ చక్కగా జరిగేటట్టు చూడవలసిన వారు. కాని, తానే ప్రధాన అవరో ధంగా మారారు. పార్లమెంట్‌కు ముఖం చాటేసి బహిరంగ సభలలో హావభావ విన్యాస ప్రసంగా లతో ప్రతిపక్షంపై అనుదినం దుమ్మెత్తి పోతలతో వాతావరణాన్ని మరింత కలుషితం చేశారు. నోట్ల రద్దు వంటి అత్యంత జన సంబంధమైన కీలక అంశం మీద తన అభిప్రాయాన్ని అందరూ అవగతం చేసుకోగలిగేలా చెప్పడానికి బదులు ప్రతిపక్షాలను దొంగలుగా, గుప్తధనాదీశులుగా చిత్రించే చౌకబారు పద్ధతిని ఎంచుకున్నారు. పార్లమెంటు వ్యవస్థపట్లనే తనకు గౌరవం లేదనే రీతిలో వ్యవహరించారు.
నెహ్రూ యుగం అరవైలలో చివరి దశకు చేరుకుంది. అప్పట్లో లోహియా మార్కు రాజకీ యాల కొత్త దశ ప్రారంభమైందని చెప్పాలి. మన పార్లమెంటు ఏకాభిప్రాయం ద్వారా పార్లమెంటు పనిని నిర్ధారించుకుని పనిచేసే పద్దతిలో నడు స్తుంది. ఈ పద్ధతి నెహ్రూయుగం తోనే ముగిసింది. లోహియా మార్కు రాజకీయాలు ప్రవేశించిన తర్వాత ఏకాభిప్రాయంతో పార్లమెం టు పనిని నిర్ధారించుకోవడం అన్నది పక్కన పెట్టి నిరసనలు తెలపడంప్రజాస్వామికంగా గుర్తింపు పొందింది. పార్లమెంటును అడ్డుకోవడం ద్వారా సభలో తమ సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ తమ మాట, తమ భావా లు పదిమందికి చేరేలా చేయడమే అప్పట్లో దీని ప్రధానోద్దేశ్యం.
రాజ్ నారాయణ్ అప్పట్లో చాలా తీవ్రస్థాయి లోనే సభలో నిరసనలు తెలిపేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన్ను మార్షల్స్ సభ నుంచి బయటకు తీసుకువెళ్లడం కూడా కష్టమయ్యేది. ఒకప్పటి కుస్తీవీరుడు కాబట్టి ఆయన్ను బయటకు తీసుకెళ్ళాలంటే మార్షల్స్ కూడా చెమటోడ్చక తప్పేది కాదు. చివరకు ఎన్నికల్లో రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీని ఓడించి తన బదులు తీర్చుకున్నా రు. నిరసన ప్రదర్శనల్లో మణిరామ్ బాగ్రీ కూడా ముందుండేవారు. వీరిద్దరు లోహియా శిబిరానికి చెందినవారే.ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సన్నిహిత సంబంధాలు కొనసా గించారన్నది కూడా మరిచిపోరాదు. నెహ్రూ గాంధీ కుటుంబం అంటే భగ్గుమనే జార్జి ఫెర్నాండజ్ వంటి నాయకుడు కూడా, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన కూడా సభను రభస చేసి అడ్డుకునే రాజకీయాల కు పాల్పడలేదంటే, ఇందిరాగాంధీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించారో అంచనా వేయవచ్చు. ఇందిరాగాంధీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రభస రాజకీయాలు కనబడతా యి. సంజయ్ గాంధీకి సన్నిహితంగా ఉండే కమల్ నాథ్, జగదీష్ టైట్లర్ వంటి నేతలు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా చేయడానికి సభలో గోల చేసేవారు. సంజయ్ గాంధీ అకాల మరణం, ఆ తర్వాత రాజీవ్ గాంధీ రాజకీ యాల్లోకి రావడం వగైరా పరిణామాల తర్వాత పార్లమెంటులో నిరసనలు, రభసలు మనకు కాస్త తక్కువే కనబడతాయి. కాని బోఫోర్స్ ఆరోపణలు వచ్చిన తర్వాత మళ్ళీ సభలో హంగామా మామూలే అయ్యింది. రాజీవ్ గాంధీ కూడా కల్పనాథ్ రాయ్ వంటి వారిని ఉపయో గించి ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నాలు చేశారు. ఎనభైలలో బోఫోర్స్ కుంభకోణం దేశరాజకీయాలను ఊపేసింది. దాదాపు 45 రోజుల పాటు ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేశాయి. కాని కాంగ్రేసు చేతిలో తిరుగులేని సంఖ్యాబలం ఉండడం వల్ల సభను అడ్డుకున్నా ప్రభుత్వ పనులు ఆగలేదు. చివరకు ప్రభుత్వం జెపిసి నియమిం చిందన్నది కూడా గమనించాలి. బిజేపి నాయక త్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ కాలంలో తెహల్కా స్కాము చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పుడు సోనియాగాంధీ ప్రతిపక్ష నేత. జెపిసి ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వం మొండిగా తిరస్కరించింది.
పార్లమెంటును అడ్డుకోవడం, సభ జరక్కుడా చేయడం అన్నది 2010లో తారస్థాయికి చేరింది. యుపిఏ ప్రభుత్వాన్ని పనిచేయకుండా బిజేపి అడ్డుకోవడమే కాదు, అలా అడ్డుకోవడమే ప్రజా స్వామ్యమన్నట్లు మాట్లాడారు. భారత పార్లమెం టు చరిత్రలో అనేక రోజులు సభ జరక్కుండా, ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డుకో వడం అనేది అదే మొదటిసారి. అప్పుడు కూడా జెపిసి కోసమే ప్రతిపక్షంగా బిజేపి డిమాండ్ చేసింది.పి.వి.నరసిం హరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ చాణక్యంతోను, ప్రతిపక్షనేతల్లో తన మిత్రులకు నచ్చచెప్పడం ద్వారాను సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు.
బిజేపి 2004 ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. పార్లమెంటును అడ్డుకోవ డమే ప్రతిపక్షం చేయవలసిన పని అన్నట్లు వ్యవహ రించింది. 2009లో రాజ్యసభలో బిజేపి నాయకుడు అరుణ్ జైట్లీ పార్లమెంటును అడ్డుకో వడం ప్రజాస్వామికమైన, చట్టబద్దమైన రాజకీయ ఆయుధం అని ప్రకటించాడు కూడా.

-వాహెద్ అబ్దుల్

-7093788843