Home తాజా వార్తలు జీవితకాల కనిష్టానికి రూపాయి

జీవితకాల కనిష్టానికి రూపాయి

rupee

 ఇంట్రాడేలో డాలర్‌తో 69కి పడిపోయిన రూపాయి

 చమురు ధరలు, ట్రేడ్ వార్ భయాలతో క్షీణిస్తున్న భారత్ కరెన్సీ 

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకీ మరింతగా క్షీణిస్తోంది. గురువారం ఉద యం ట్రేడ్‌లో అత్యంత కనిష్టం 69.10 స్థాయికి రూపాయి చేరింది. దీంతో రూపాయి విలువ జీవితకాల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అంతర్జాతీయంగా పలు అంశాలు రూపాయి విలువ పతనానికి కారణమవుతున్నాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవ డం, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో రూపాయి విలువ కనిష్టానికి చేరింది.ఇంట్రాడేలో రూపాయి 68.87కు క్షీణించి 2013ఆగస్టులో పడిపోయిన స్థాయికి చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7.7 శాతం మేర పతనమైపోయింది. బుధవారం కూడా రూపాయి డాలరుతో మారకంలో 37 పైసలు పతనమై 68.61 వద్ద ముగిసి 19 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ట్రేడ్ వార్ భయాలు రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో 7 శాతం క్షీణించింది
ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే డాలర్‌పై రూపాయి మారకం విలువ 7.3 శాతం పతనమైంది. 2016 నవంబర్ 24న ఇంట్రాడేలో 68.86 వద్ద కొత్త కనిష్టానికి పడిపోగా, అంతకుముందు 2013ఆగస్ట్ 28న 68.80 వద్ద ముగిసి రికార్డు స్థాయి కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఆసియా కరెన్సీలలో ఫిలిప్పీన్స్ పెసో 6.7శాతం చొప్పునపతనమయ్యాయి.
క్రూడ్ ఆయిల్ ప్రభావం
అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు క్రూడ్ ఆయిల్ పరిస్థితులు కూడా రూపాయిని కృంగదీశాయి. వాణిజ్య భయాలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలాన్ని పుంజుకుంది. ఇరాన్ చమురుపై అమెరికా నిషేధం వంటి అంశాలు ముడిచమురు ధరలను మరింత పెంచే అవకాశముంది. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వాణిజ్య లోటు పెరుగనుందా?
దాదాపు 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు రూపాయి విలువ పతనం పెద్ద దెబ్బేనని నిపుణులు అంటున్నారు. రూపాయి పతనం అయితే, దిగుమతులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దేశ వాణిజ్యలోటు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై అయ్యే అధిక ఖర్చులు, వాటి ప్రభావం రిటైల్ ధరలపై పడనుంది. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు దీనికి అనుబంధ ఉత్పత్తుల ధరలన్నీ పెరిగిపోతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతుంది. ఇలా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హద్దులు దాటిపోతుంటే ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఆర్‌బిఐ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే రుణాలు తీసుకున్న వారందరి ఈఎంఐలు పెరుగుతాయి. అలాగే విదేశాల్లో చదువుకునే వారు డాలర్ల రూపంలో ఫీజుల చెల్లింపునకు ఎక్కువ రూపాయిలను ఖర్చు చేయాల్సి వస్తుంది. విదేశీ ప్రయాణాలు భారమవుతాయి.
ఆర్‌బిఐ జోక్యం చేసుకుంటుందా?
రూపాయి విలువ భారీగా క్షీణించినప్పుడల్లా ఆపద్బాంధవుడిగా ఆర్‌బిఐ జోక్యం చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం 2013 సంవత్సరం నాటికి కనిష్టానికి రూపాయి విలువ పడిపోయిన నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఏం చేయనుందనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువగా ఒడిదుడుకులు లేకుండా చూడడం కోసం స్పాట్ మార్కెట్‌లో ఆర్‌బిఐ జోక్యం చేసుకుంటూ వస్తోంది. ఈసారి మరింత లోతుగా ఆర్‌బిఐ స్పాట్‌పై దృష్టిసారించే అవకాశం లేదని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకస్థాయికి మించి జోక్యం చేసుకుంటే అది ఫ్యూచర్ మార్కెట్‌లో సంకేతం ఇవ్వడం ద్వారా అసలుకే మోసం వస్తుందన్న విషయం ఆర్‌బిఐకి బాగా తెలుసని అంటున్నారు. రూపాయి మరింత పతనమైపోతే పెట్రోల్, డీజిల్ ధరలపైనా ప్రభావం పడనుంది. అలాగే పసిడి ధరలు పెరిగిపోవడం లాంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు, ఇతర ఎగుమతి ఆధారిత వ్యాపారాల ఆదాయాలు గణనీయంగా పెరగడం లాంటి సానుకూల అంశాలు ఉన్న కారణంగా ఆర్‌బిఐ ఆచితూచి వ్యవహరించే అవకాశముంది.