Home బిజినెస్ ఎయిరిండియా వాటాల అమ్మకం ఓ కుంభకోణం

ఎయిరిండియా వాటాల అమ్మకం ఓ కుంభకోణం

 air

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ క్రిమినల్ లా కంప్లైంట్ చేస్తా…
 ఎంపి సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఎయిరిండియా అమ్మకంపై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా ప్రతిపాదిత సేల్‌కు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తను ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌లో మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ ఫిర్యాదు చేయడం సంచలనానికి తెరతీసింది. ఎయిర్ ఇండియా వాటాల అమ్మకం పెట్టుబడుల ఉపసంహరణ కాదనీ, అదో కుంభకోణం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియతో ప్రైవేట్ ప్లేయర్ల చేతిలోకి ఎయిరిండియా యాజమాన్య హక్కులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌లో మరో కుంభకోణం చోటు చేసుకుంటోందని, ఎవరీ ప్రక్రియ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తాను గమనిస్తున్నానని, ఒకవేళ ఏదైనా నేరం కంటపడితే ప్రైవేట్ క్రిమినల్ లా ఫిర్యాదు దాఖలు చేయనున్నట్టు స్వామి హెచ్చరించారు. ఎయిరిండియా విక్రయంపై మొదటి నుంచి స్వామి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎయిర్ ఇండియా అమ్మకంపై సుబ్రహ్మణ్య స్వామే కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ ఒప్పందాన్ని కాంగ్రెస్ నాయకుడు అహ్మ ద్ పటేల్ కూడా వ్యతిరేకించారు. కనీస నెట్‌వర్త్ రూ. 5000 కోట్లున్న కంపెనీలే ఎయిరిండియా కొనుగోలుకు యత్నించాలని, లీడ్ మెంబర్ కనీసం 51 శాతం చెల్లించిన మూలధన వాటాలు కలిగి ఉండవచ్చని ప్రభుత్వం ప్రతిపాదించింది. గమనించాల్సి విషయమేమిటంటే డిసెంబర్ నాటికల్లా ఎయిర్ ఇండియా ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లగలదని గతంలో చెప్పిన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇప్పటికీ తనన్న మాటకు కట్టుబడి ఉన్నారు.