Home Default అక్రమాల పంచాయతీ

అక్రమాల పంచాయతీ

grama-panchayathi

కాసుల మత్తులో యంత్రాంగం
మున్సిపాలిటీలుగా మారనున్న
గ్రామాల్లో నయా దందా
ఎన్నికల పని పేరుతో
అక్రమాల వైపు చూడని అధికారులు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
పంచాయతీలలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పంచాయతీ పాలకవర్గాల గడువు మరో మూడు నెలల్లో ముగియనుండటంతో అందిన కాడికి దండుకోవడానికి పాలకవర్గాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. శివారు పంచాయతీలలో అక్రమాల జోరుకు అధికారులు గులాం గిరీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి పలువురు సర్పంచ్‌లు పోటీపడుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిస్తున్నా మూడు నెలల్లో ముగిసే పదవి కన్నా కాసుల సంపాదనపైనే నేతలు దృష్టిపెట్టారు. జిల్లాలోని 415 గ్రామ పంచాయతీలలో మెజారిటీ గ్రామాల్లో ఇలాంటి వ్యవహారం కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని 46 శివారు గ్రామ పంచాయతీలను 9 మున్సిపాలిటీలుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి సిద్ధం అవుతుంది. పంచాయతీలు కాస్తా మున్సిపాలిటీలుగా మారితే పన్నులు అధికంగా కట్టవలసి వస్తుందన్న ప్రచారం జరుగడంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీలలో అక్రమాల దందా జోరుగా సాగుతుంది. హెచ్‌యండిఎ పరిధిలో ఉన్న గ్రామాల్లో లేఅవుట్‌లకు పంచాయతీలు నిర్మాణలు ఇవ్వడానికి అధికారం లేకపోయిన ప్రస్తుతం యదేచ్చగా అనుమతుల దందా సాగుతుంది. జి.ఓ 111 కు విరుద్దంగా మొయినాబాద్, చెవెళ్ళ, శంకర్‌పల్లి, శంషాబాద్ మండలాల్లో వందలాది లేఆవుట్‌లు వెలుస్తున్న వందల సంఖ్యలో విల్లాలు నిర్మిస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు మాత్రం కాసుల మత్తులో మునిగితేలుతున్నారు తప్ప అటువైపు కన్నెతికూడ చూసిన పాపాన పోవడం లేదు. గండిపేట్, హిమాయత్‌సాగర్‌లకు ఆనుకోని నిర్మాణాల జాతర సాగుతున్న యంత్రాంగం అటువైపు చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు హెచ్‌యండిఎ కమీషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు ఒక్కసారి పర్యటించి పరిశీలిస్తే ఎన్ని అక్రమ లేఆవుట్‌లు ఎన్ని నిర్మాణాలు సాగుతున్నాయో కళ్లకు కనిపిస్తాయి.
46 గ్రామాల్లో వసూళ్ల దందా…
జిల్లాలో మున్సిపాలిటిలుగా మారనున్న 46 గ్రామ పంచాయతీలలో అక్రమాల జాతర సాగుతుంది. గండిపేట్, శంషాబాద్, మహేశ్వరం, అబ్బుల్లాపూర్‌మేట్ మండలాల్లోని గ్రామాలలో అక్రమ లేఆవుట్‌లతో పాటు అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా సాగుతున్నాయని వీటికి స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శిలు, మండల ఈఓపిఆర్‌డిలు అండదండలు అందచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గండిపేట్ మండల పరిధిలోని మణికొండ, పుప్పాల్‌గూడ, బండ్లగూడ, హైదర్‌షాకోట తదితర గ్రామాల్లో సాగుతున్న దందాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తే తెలుస్తుంది సర్కార్ అక్రమార్కులు ఖజానాకు ఎంత గండికోడుతున్నారు అని పలువురు అంటున్నారు. 46 గ్రామ పంచాయతీలలో ఇళ్లు నిర్మాణాల కోసం లక్షల్లో వసూళ్లు చేస్తు కనీసం వేయిలలో కూడ రసీదులు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలపై ప్రభుత్వంకు వచ్చిన పిర్యాదులపై స్పందించి ఇప్పటికే ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పుతున్న అక్రమాలు మాత్రం ఎక్కడ కూడ అగినదాఖలాలు లేవు.
కార్యాలయాలకే పరిమితం…
జిల్లా పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా పూర్తిగా కార్యాలయాలకు పరిమితం కావడం క్రింది స్థాయి అధికారులు రియల్టర్‌లకు అనుచరులుగా మారడంతో అక్రమ లేఆవుట్‌లు, అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మొయినాబాద్, శంషాబాద్, గండిపేట్, మహేశ్వరం, కందుకూర్, ఇబ్రహింపట్నం మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఎన్నికల పనులలో బిజిగా ఉండటం మూలంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం లేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.