Home అంతర్జాతీయ వార్తలు ఆధిపత్యంకోసం యుద్ధం తర్వాత యుద్ధం

ఆధిపత్యంకోసం యుద్ధం తర్వాత యుద్ధం

Warరెండవ ప్రపంచయుద్ధం (1939-1945) ముగిసిన తదుపరి 70వ సంవత్సరంలో ఇప్పుడు మనం ఉన్నాం. నిజమైన యుద్ధ పరిస్థితిలో అణు బాంబులు ప్రయోగించిన తొలి సందర్భం 70వ వార్షికోత్సవం కూడా ఇదే. ఓటమిని అంగీక రించడం మినహా జపాన్‌కు మార్గాంతరం లేదని అప్పటికే స్పష్టమైనప్పటికీ, హిరోషిమా, నాగసాకీ నగరాలపై అమెరికా బాంబులు వేసింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న విధ్వంసక టెక్నాలజీనుంచి తయారైన బాంబులను రెండు జపాన్ నగరాలపై (జర్మనీపై కాకపోవడం ఆసక్తిదాయకం) వేయాలని అమెరికా నిర్ణయించింది. ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకై, తన శక్తిని, సామర్థాన్ని ప్రదర్శించ టానికి ఆ పనిచేసింది.
1965లో పాకిస్థాన్‌తో రెండవ యుద్ధం 50వ వార్షికోత్సవాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటు న్నాం. ఆ యుద్ధం ఆ పోరాటం చేసిన ఏ దేశానికీ స్పష్టమైన విజయం చేకూర్చలేదు. అంతర్గత విభేదాలతో ఉన్న కశ్మీర్ గుంజుకోవడానికి పరిపక్వం గా ఉందని పాకిస్థాన్ భావించింది. పాకిస్థానీ చొరబాటుదారుల పనిపట్టేందుకు భారత సైన్యానికి తోడ్పడింది కశ్మీరీయులని తెలుసుకుని అది పూర్తిగా ఆశాభంగం చెందింది. పాకిస్థాన్ ప్రేరేపిత మిలి టెంట్, తీవ్రవాద కార్యకలాపాలవల్ల అడపాదడపా కల్లోలం కనిపిస్తున్నప్పటికీ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగుతున్నది, దాన్ని భారత్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు పాకిస్థాన్ నాలుగుసార్లు యుద్ధం చేసినప్పటికీ ఇదీ వాస్తవం.
ప్రపంచం గతేడాది, 1914 నుంచి 1918 వరకు కొనసాగిన మొదటి ప్రపంచయుద్ధం శతాబ్దిని పాటించింది. సెంట్రల్ పవర్స్ – అనగా జర్మన్, ఆస్ట్రో-హంగేరియన్, ఒట్టోమాన్ సామ్రాజ్యాలు, జపాన్ ఒకవైపు, ఎలైస్ అనగా ఫ్రాన్స్, గ్రేట్‌బ్రిటన్, రష్యా, ఇటలీ, అమెరికా మరోవైపు యుద్ధంలో తలపడ్డాయి. యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. అతి క్రూరమైన యుద్ధాల్లో ఒకటిగా అది నమోదైంది. 1కోటిమంది సైనికులు , 70లక్షలమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధాన్ని ‘యుద్ధం ముగించడానికి యుద్ధం’గా ప్రఖ్యాత వ్యాఖ్యాత, సైన్స్ ఫిక్షన్ రచయిత హెచ్.జి.వెల్స్ అభివర్ణించారు. “ప్రజాస్వామ్యం కొరకు ప్రపంచాన్ని సురక్షితం చేయటం”గా అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ పేర్కొన్నారు. అగ్రరాజ్యాల మధ్య నాలుగేళ్ళ పాటు తీవ్రంగా సాగిన యుద్ధ దుష్ప్రభావం ప్రపంచం అంతటా పడింది. ఎట్టకేలకు పారిస్ పీస్ కాన్ఫరెన్స్‌లో శాంతి ఒప్పందం జరిగింది. ఇంత తీవ్రమైన యుద్ధం రేగటానికి కారణమైన హేతువులు శాంతి ఒప్పందం తర్వాత కూడా కొనసాగాయి. గ్రేట్‌వార్‌కు దారితీసిన కారణాలు-సామ్రాజ్యవాదం, పరస్పర వైరంతో కూడిన అలయెన్స్‌లు, సైనికో న్మాదం, జాతీయోన్మాదం ఏ మాత్రం సమసిపోలేదు. యుద్ధంచేసిన దేశాలు ఇతరులపై ఆధిపత్యం సాధించే ప్రయత్నంగా లేదా ఆధిపత్యంలోకి రాకుం డా ఇతరులను నిరోధించే ప్రయత్నంగా తమ సైన్యాలను పునర్నిర్మించుకోవటం మొదలుపెట్టాయి. ప్రపంచ సంస్థ “లీగ్ ఆఫ్ నేషన్స్‌” ప్రయత్నాల ద్వారా ఒక నూతన శాంతియుతమైన, మరింత సమానత్వం, న్యాయంతో కూడిన ప్రపంచ వ్యవస్థను సృష్టించాలన్న ప్రయత్నం ఫలించలేదు. గ్రేట్‌వార్ ఏమీ సాధించకపోయినా, ఫ్యూడల్ కాలపు అవ శేషంగా ఉన్న మూడు నిరంకుశ సామ్రాజ్యాలు అంతర్థానం కావటానికి దారితీసింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుండగానే, రష్యా జారు చక్రవర్తి పాలనను 1917లో అక్టోబర్ విప్లవం కూల్చివేసింది. అదే సమయంలో, అది భవిష్యత్ యుద్ధాలకు బీజాలు నాటింది. శైశవదశలోని విప్లవం గొంతు నులమటానికి సామ్రాజ్యవాద దేశాలు కట్టగట్టుకుని రష్యాపై దండెత్తినా, ఫలితం లేక పోయింది. మరోవైపున యుద్ధానంతర జర్మనీలో ఆర్థిక కడగండ్లు ప్రజల్లో ఆగ్రహం తెచ్చాయి. నిర్యుద్ధ సంధితో సంతోషంగా లేని జర్మన్‌లు బలిపశువుల కోసం వెదుకుతూ యూదులపై విరుచుకుపడ్డారు. ఆ వాతావరణంలో నేషనల్ సోషలిస్టుపార్టీ (నాజీపార్టీ) వృద్ధి చెందటానికి మంచి అవకాశం దొరికింది. అది అంతిమంగా, అడోల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో ఆధిక్యపార్టీ అయింది.
అహంభావం తలకెక్కిన హిట్లర్ తన దేశప్రజల జీవితాలపై ఆధిపత్యం వహించటమేగాక మొత్తం యూరప్‌ను, సాధ్యమైతే ప్రపంచాన్ని ఏలటాన్ని లక్షంగా పెట్టుకున్నాడు. శాంతి ఒప్పందాల ద్వారా జర్మనీకి జరిగిన అవమానాలకు బదులు తీర్చుకునేం దుకు శక్తిమంతమైన భారీ ఆర్మీని తయారు చేశాడు. అతని నాయకత్వంలో యుద్ధం అనివార్యమైంది. దేశం తర్వాత దేశం స్వాధీనం చేసుకుంటూ ముందు కెళ్లాడు. త్వరలోనే అక్షరాజ్యాలకు-జర్మన్,ఇటలీ, జపాన్‌లతో త్రిపక్ష కూటమికి, సోవియట్ యూని యన్, పశ్చిమ మిత్రరాజ్యాలకు మధ్య యుద్ధం ప్రజ్వరిల్లింది. యుద్ధం ముగింపుదశలో అమెరికా, పశ్చిమరాజ్యాలు రెండవపోరాట రంగం తెరిచాయి.
మొదటిప్రపంచ యుద్ధం కన్నా మరింత క్రూర మైన ఈ యుద్ధం అటుతర్వాత రెండవ ప్రపంచ యుద్ధంగా పిలవబడింది. ఆరేళ్ళుసాగిన ఈ యుద్ధం లో 5కోట్లమంది ప్రజలుసహా మొత్తం 6కోట్లమంది హతులైనారు. హిట్లర్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో గ్యాప్ ప్రయోగంతో చనిపోయినవారు, జపాన్‌పై అణుబాంబులతో చనిపోయినవారు వీరిలో ఉన్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన జర్మనీని ఆక్రమించుకున్న మిత్రరాజ్యాలు దాన్ని జోన్‌లుగా విభజించి తలా ఒక జోన్ స్వాధీనం చేసుకున్నాయి. సర్వనాశనమైన ఆ దేశ పునరుద్ధరణకు అమెరికా మాస్టర్‌ప్లాన్ ప్రకటించింది. తూర్పు జర్మనీలో సోవియట్ యూని యన్ అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. జపాన్‌ను అమెరికా ఆక్రమించుకుంది. అక్షరాజ్యాలు తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నిటినీ కోల్పో యాయి. తూర్పు యూరప్ దేశాల్లో రెడ్ ఆర్మీ సహాయంతో కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వాలు అధికారం చేపట్టాయి.
మొదటి ప్రపంచ యుద్ధం తదుపరి నెలకొల్పిన లీగ్ ఆఫ్ నేషన్స్ నిరుపయోగం కావటంతో, భవిష్యత్ తరాలను యుద్ధ బీభత్సం నుంచి కాపాడేందుకు, అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించే నిమిత్తం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం యునై టెడ్ నేషన్ (ఐక్యరాజ్యసమితి-యుఎన్) ఏర్పాటైంది. తన లక్షప్రణాళిక మేరకు పనిచేయటంలో ఐరాస చాలామేరకు విఫలమైంది. దాని స్థాపన అనంతరం అనేక స్థానిక యుద్ధాలు జరిగాయి. వాటిలో దీర్ఘకాలికమైంది అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాల శిబిరం (నాటో కూటమి దేశాలు), సోవియట్ యూనియన్ నాయకత్వంలో తూర్పు దేశాల (వార్సా సంధి కూటమి) మధ్య జరిగిన “ప్రచ్ఛన్నయుద్ధం”. 1991లో సోవియట్ యూని యన్ విచ్ఛిన్నమయ్యే వరకు అది కొనసాగింది.
ప్రచ్ఛన్నయుద్ధం కారణంగా రెండు ప్రత్యక్ష యుద్ధాలు – కొరియా యుద్ధం, అమెరికా దురాక్రమ ణకు వ్యతిరేకంగా వియత్నాం యుద్ధం జరిగాయి. ఆసియా, ఆఫ్రికాల్లో అనేక యుద్ధాలు – కొన్ని ఐరాస అనుమతితో, కొన్ని అనుమతి లేకుండా సంభ వించాయి. గత 70ఏళ్లలో పెద్ద ఎత్తున యుద్ధం సంభవించలేదు అంటే అందుకు కారణం సామర్థ రహితమైన ఐరాస కాదు, అపారమైన విధ్వంసం సృష్టించే అణు వినాశం గూర్చిన భయం.
ఇస్లామిక్ టెర్రరిజం కొత్త పెను ప్రమాదంగా ప్రపంచం ముందుకు రావటంతో, ఆ కారణం చూపి అమెరికా 21వ శతాబ్దం ఆరంభంలో ఆప్ఘనిస్థాన్, ఇరాక్, లిబియాలపై దురాక్రమణ యుద్ధాలకు పాల్ప డింది. ఇప్పుడు అటు ఉక్రెయిన్, ఇటు సిరియాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదకరంగా పశ్చిమాసియాలో ఇస్లాం పేరుతో ఇస్లాం రహితమైన, అత్యంత పాశవిక మైన, భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) బయలు దేరింది. ముస్లింయేతర ప్రపంచంపై ఆధిపత్యం, మత విశ్వాసరహితులను రూపుమాపటం లక్షంగా అది ప్రకటించుకుంది. అదృష్టవశాత్తు అది ఇప్పటికి సిరియా, ఇరాక్‌ల్లో కొన్ని భాగాలకే పరిమితమైంది.
అంతర్జాతీయ రాజకీయాల అరణ్యంలో సామా జిక డార్వినిజం పనిచేస్తున్నందున యుద్ధాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. అందువల్ల అనేక దేశాలు సామూహిక విధ్వంసక ఆయుధాలను పుష్కలంగా సమకూర్చుకున్నాయి. ఈ వినాశన ఆయుధాలు భూగోళం నుంచి మానవ జాతిని
తుడిచి పెట్టే ఆత్మహత్యా సదృశ సంఘర్షణను నిరోధిస్తాయని ఆశించుదాం!
(ఇన్ఫా)