Home తాజా వార్తలు సానుకూలంగా మార్కెట్లు

సానుకూలంగా మార్కెట్లు

bsns

గత వారం 554 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: గతవారం మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. వారం మొత్తం సెన్సెక్స్ 554 పాయింట్ల లాభపడి రూ.34,969 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టిసిఎస్ తదితర కార్పొరేట్ ఫలితాలు ఆశలను పెంచగా, టెక్నాలజీ కౌంటర్ల పతనం, అంతర్జాతీయ అంశాలతో స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గత వారం మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. అయితే వారాంతాన ప్రపంచ మార్కెట్లు సానుకూల సంకేతాలతో సూచీలు లాభపడ్డాయి. వారాంతం శుక్రవారం(27) నాటికి సెన్సెక్స్ నికరంగా 554 పాయింట్లు (1.60 శాతం) పెరిగి 34,970 వద్ద ముగిసింది. ఓ దశలో 35,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఇక నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 10,692 వద్ద స్థిరపడింది. మార్కెట్లు పటిష్ట లాభాలు ఆర్జించినప్పటికీ చిన్న షేర్లు ఆశించిన మేరకు లాభపడలేదు. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్ సూచీ 0.7 శాతం, స్మాల్ క్యాప్ 0.35 శాతం పెరిగాయి. క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో యస్ బ్యాంక్ అద్భుతంగా రాణించడంతో షేరు 13 శాతం దూసుకెళ్లింది. మరోవైపు విప్రో 8 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో ఎం అండ్ ఎం, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోరట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి. అయితే టాటా స్టీల్, మారుతీ, కోల్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టిపిసి 3- నుంచి 2 శాతం మధ్య క్షీణించాయి. అయితే దేశీయ మార్కెట్లపై సానుకూలంగా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. భారత మార్కెట్లలో ప్రతికూల అంశాల కన్నా సానుకూల అంశాలే ఎక్కువగా ఉన్నాయని బ్యాంకు రిసెర్చ్ హెడ్ మార్క్ మాథ్యూ అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్ పరుగులు, భారత ఎన్నికలు ఉన్నప్పటికీ తమ అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. సంస్కరణ సందర్భంగా వచ్చే ఆటుపోట్లు తాత్కాలికమని, ఎన్‌డిఎ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సంస్కరణల జోరు మరింత వేగవంతమవుతుందని అన్నారు. కార్పొరేట్ ఫలితాలు అంచనాలను అందుకుంటున్నాయి. బాండ్ ఈల్డ్ కారణంగా అమెరికా డాలర్ బలపడుతోందని, ఇదే ధోరణి పెరుగుతుందని చెప్పలేమని మాథ్యూ అభిప్రాయపడ్డారు. త్వరలో రేట్లు పెంచాలని ఎంపిసి నిర్ణయిస్తోందన్న వార్తలు నిజమైతే రూపాయికి ఊరట లభిస్తుందని తెలిపారు.
వచ్చే వారం నాలుగు రోజులే మార్కెట్
వచ్చే వారం దేశీ స్టాక్‌మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. మంగళవారం(మే 1న) మహారాష్ట్ర డే, మే డే సందర్భంగా బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలకు సెలవు ప్రకటించారు. దీంతో వారంలో మిగతా నాలుగు రోజులపాటే ట్రేడింగ్ సాగనుంది. ఏప్రిల్ డెరివేటివ్ సిరీస్ తొలి రోజు మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి.