Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సెన్సెక్స్ 30,000కు పడిపోవచ్చు

bsn

ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిన పిఎన్‌బి స్కామ్ : ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఫ్యాబర్

ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి) కుంభకోణం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, బిఎస్‌ఇ సెన్సెక్స్ 30 వేల స్థాయికి పడిపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. 2018 సంవత్సరం పటిష్టమైన లాభాలతో మంచి ఆరంభాన్ని ఇచ్చిన ఈక్విటీ మార్కెట్లు.. కొద్ది వారాలుగా నేల చూపులు చూస్తున్నాయి. దిగివచ్చిన మార్కెట్లను చూసి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చే పట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే తొందర పడాల్సిన అవసరం లేదని ప్రముఖ ఆర్థిక నిపుణుడు మార్క్ ఫ్యాబర్ అంటున్నారు. ‘ద గ్లూమ్, బూమ్ అండ్ డూమ్ రిపోర్ట్’ పబ్లిషర్, ఎడిటర్ మార్క్ ఫ్యాబర్ ఇంటర్వూలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు తొందరపడాల్సిన అవసరం లేదని, ముందు ముందు మార్కెట్లు మరింతగా పతనమయ్యే అవకాశముందని అన్నారు. అయితే దీర్ఘకాలిక విధానంలో చూస్తే భారత్ ఈక్విటీలు ఇప్పటికీ బుల్లిష్‌గానే ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు 2017 సంవత్సరం అద్భుతంగా ఉందని అ న్నారు. డాలర్ రూపంలో చూస్తే భారత్ మార్కెట్లు 35 శాతం పెరగ్గా, వియత్నాం 50 శాతం, యురోపియన్ మార్కెట్లు 30 శాతం పెరిగాయని అన్నారు. అమెరికా మార్కెట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఐదు శాతానికి పైగా కరెక్షన్ ఇంతవరకు లేదు. 2016 ఫిబ్రవరిలో ఎస్ అండ్ పి 1,810 పాయింట్ల కనిష్టానికి చేరింది. అప్పటి నుంచి ఇంతవరకు 10 శాతం దిద్దుబాటు ఇప్పటి వరకూ లేదు. మార్కెట్లు ఓవర్‌బాట్‌లో ఉండగా.. హై వా ల్యుయేషన్ నేపథ్యంలోనూ మొత్తంగా సెంటిమెంట్ సానుకూలంగా ఉంది.
10 శాతం మేరకు దిద్దుబాటు
జనవరి 29న బిఎస్‌ఇ సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి 36,443 పాయింట్లు చేరగా.. గత రెండేళ్లలో భారత మార్కెట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. రూపాయి విలువ ఆశించిన మేరకు పెరగపోయినా.. బలంగానే ఉంది. 10 శాతం దిద్దుబాటు ఈక్విటీ మార్కెట్లలో ఉండే అవకాశముంది. భారత్ ఈక్విటీ మార్కెట్లు దిగువ ముఖంగానే పయనిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల మోసం కేసుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది.
మద్దతు స్థాయి 30,000 పాయింట్లు
గత రెండేళ్ల క్రితం 23,000 పాయింట్ల వద్ద ఉన్న బిఎస్‌ఇ సెన్సెక్స్.. వేగంగా ర్యాలీని కొనసాగిస్తూ 30 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. మార్కెట్లకు తర్వాతి మద్దతు స్థాయి 30,000 పాయింట్లు అని.. తాను అంచనా వేస్తున్నానని ఫ్యాబర్ అన్నారు. ఈ స్థాయిని దాటిందంటే.. సులువుగా 27,000 నుంచి 28,000 పడిపోతుంది. 30 వేల మద్దతు స్థాయిని దాటే అవకాశాలైతే లేవు. ప్రస్తుతం 30 వేల మార్క్‌కు చేరువ కావొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలు రుణాల ఊబిలో కూరుకుపోయాయని, ప్రస్తుతం మార్కెట్లు భారీగా పతనమైతే గనుక దారుణమైన బేరిష్‌ను చూస్తామని ప్రముఖ ఇన్వెస్టర్ జిమ్ రోగర్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.
భారత్‌పై ఆశావాహ దృక్పథం
భారత్‌పైనా ప్రతి ఒక్కరూ ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. వేగవంతంగా రాబడులను ఇస్తుందని నమ్ముతున్నారు. ఎస్ అండ్ పి 2,872 పాయింట్లకు చేరడంతో.. జనవరి 26 తర్వాత కరెక్షన్ ప్రారంభమైంది. అమెరికాలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు పుంజుకున్న పరిస్థితులను చూస్తున్నామని, అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది ఇలాగే ఉంటుందని భావించడం లేదని ఫ్యాబర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే 10 నుంచి 20 శాతం పతనం ఉండొచ్చని.. అయితే ఇప్పుడైతే అంచనా వేయడం కష్టమేనని అన్నారు.

Comments

comments