Home హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌కు యత్నం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌కు యత్నం

Soft-emplyee

వెంబడించి పట్టుకున్న స్థానికులు పోలీసుల అదుపులో ఉబర్ క్యాబ్ డ్రైవర్ లండన్‌కు వెళ్లిన బాధితురాలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: లండన్‌కు వెళ్లాల్సిన ఒక సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేయాలనుకున్న ఉబర్ కారు డ్రైవర్ ప్రయత్నం బెడిసికొట్టింది. పోలీసుల చేతికి చిక్కాడు. అప్రమత్తంగా ఉన్న ఉద్యోగిని ఊబర్ కారు నిర్దిష్ట మార్గంలో కాకుండా మరో దారిలో వెళ్తుండడాన్ని గమనించి కారు నెంబర్‌ను, డ్రైవర్, లోకేషన్ వివరాలన్నింటిని నేరుగా పోలీసు కంట్రోల్‌రూమ్‌కు, భర్త మొబైల్‌కు చేరవేశారు. కారు వెనకసీటులో కూర్చున్న ఆ యువతి కిటికీ గుండా ‘సేవ్ మి’ అంటూ గట్టిగా అరవడంతో రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు ఛేజింగ్ చేసి కారును పట్టుకున్నారు. కొద్దిసేపటికే పోలీసులు కూడా జీపీఎస్ ఆధారంగా ఆ కారు ఆచూకీ కనుగొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బాధితురాల్ని రక్షించారు.

శంషాబాద్ విమానాశ్రయానికి తాను ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నానని, అయితే డ్రైవర్ మలక్‌పేట వైపు కారును తీసుకెళ్లి కిడ్నాప్‌కు యత్నించాడని బాధితురాలు మాదన్నపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు భర్త సహాయంతో బాధితురాలు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని లండన్‌కు వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే& సుల్తాన్‌బజార్‌కు చెందిన సొనాలి (27) లండన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సెలవుల నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వచ్చి మళ్ళీ గురువారం తిరిగి లండన్‌కు వెళ్తున్న క్రమంలో జరిగిన కిడ్నాప్ ప్రయత్నం గురించి ఆమె మీడియాకు వివరిస్తూ, నిర్దిష్ట రూట్‌లో కాకుండా మలక్‌పేట వైపు వెళ్తున్నందున డ్రైవర్‌ను నిలదీశానని, ఆ తర్వాత డ్రైవర్ కారు వేగాన్ని పెంచాడని, రోడ్డుపై బైక్‌ను ఢీ కొట్టుకుంటూ పాతబస్తీలోకి దారి మళ్లించాడని తెలిపారు.

ఏదో జరుగుతోందనే అనుమానంతో వెంటనే సెల్‌ఫోన్ నుంచి తన లొకేషన్‌ను పోలీసు కంట్రోల్ రూమ్‌తో పాటు తన భర్తకు చేరవేశానని, కిడ్నాప్ ప్రయత్నం గురించి వివరించానని తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మహిళ అరుపులకు స్పందించిన స్థానికులు ఆ కారును ఛేజింగ్ చేసి మాదన్నపేటలోని సాయిలాల్ తోట బస్తీ వద్ద పట్టుకున్నారు. ఊబర్ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో పనిని వాయిదా వేయడానికి వీలు కాదని చెప్పిన మహిళ వారం రోజుల తరువాత తిరిగి వస్తానని పోలీసులకు వివరించారు. నిందితుడికి గతంలో ఏవైనా నేరాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు       విచారణ చేపట్టారు.