Home రాజన్న సిరిసిల్ల ప్రతిపక్షాల దుకాణం బంద్

ప్రతిపక్షాల దుకాణం బంద్

ktr-image

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలం రైతు
పక్క రాష్ట్రాల్లో రైతుబంధు అమలుకు ఒత్తిడి
మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తు న్న రైతుబంధు పథకంతో ప్రతిపక్షాల దుకాణం బంద్ అవుతుందని ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్,గూడెం,తంగళ్లపల్లి మ ండలం మండెపల్లిలో నిర్వహించిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడా రు. రైతుబంధు పథకం అమలుతో రైతుల ముఖాల్లో ఆనం దం తాండవిస్తుందని అది చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి అన్నారు. వచ్చే యాసంగి పం ట నాటికి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల సాగుభూములకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. రైతుబంధు ద్వారా ఇస్తున్న పంట సహాయం రూపాయల్లో ప్రతి పైసా రైతుకు నేరుగా చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతుకు ధీమానిచ్చేందుకు జూన్ 2 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. రైతు బీమా కింద రైతులు మరణిస్తే 5 లక్షల రూపాయలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు మిషన్ కాకతీయ ద్వారా నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు.నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రైతు లు తీవ్ర నిర్లక్షానికి గురికాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలను దూరం చేసేందుకు సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతాంగానికే కాదు అన్ని రంగాలకు కూడా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏ కైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 2009లో అప్పటి ప్రభు త్వం 9గంటల కరెంట్ ఇస్తామని ఆ తరువాత దాన్ని 6 గంటలకు కుదించారని అది కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే అదో పెద్ద వార్తని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే కరెంట్ పోతే వార్త అని అ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్, విత్తనాలు, ఎరువులు సరైన సమయానికే అందుతున్నాయని మంచి మనసున్న సిఎం కెసిఆర్ కావడం వల్ల వర్షాలు కూడా సకాలానికే వ స్తున్నాయన్నారు.కెసిఆర్ స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రై తుల కోసం మంచి ఆలోచనలు చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే సిఎం కెసిఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని అన్నారు.రైతుల కోసం రుణమాఫీ చేసిన కార్యక్రమం పూర్తయిన తర్వాత రైతుల పెట్టుబడి సా యం కోసం ఏడాది క్రితం సిఎం కెసిఆర్ ప్రకటన చేశారని రైతుబంధు పథకం ఎంత మాత్రం రానున్న ఎన్నికల దృష్టా కాదన్నారు. 86 యేళ్ల తర్వాత భూ రికార్డులను ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ అన్నారు. 200 రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు గత పాలకులు అనేక ఇబ్బందులు పెడితే సీఎం కెసిఆర్ 1000 రూపాయలు సునాయాసంగా అందిస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా కెసిఆర్ రైతులకు ఆత్మబంధువుగా మారారన్నారు. రైతుబంధు కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతుకు సాగు, తాగునీటితో పాటు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఆదర్శం కానుందన్నారు. తెలంగాణలో 1.20 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఉపాధిహామీ పథకం చాలా గొప్పదని దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కూలీలకు రైతులు సగం కూలీ, ప్రభుత్వం సగం కూలీ చెల్లించవచ్చన్నారు. రైతు సమస్యలపై అవగాహన ఉన్న ప్రభుత్వం కావడం వల్లే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు వచ్చే వేసంగి నుండి సాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో సిరిసిల్ల జిల్లా నెంబర్‌వన్‌గా నిలిచిందని వారం రోజుల్లోనే పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను, అధికారులను మంత్రి కెటిఆర్ అభినందించారు. రైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. శ్రీరాముని రాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు చెల్లించక తప్పలేదని అన్నారు. రైతుబంధు విప్లవం అన్నారు. నవ హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువన్నారు. పంట పెట్టుబడి పూర్తిగా ఉచితమని తెలిసి కేంద్ర నేతలే మూర్ఛపోయారన్నారు. రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఆంధ్ర,మహారాష్ట్రలోని అనేక సరిహద్దు గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని అంటున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 1.05 లక్షల మందికి వంద కోట్ల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే 40 కోట్ల రూపాయలు రైతులు నగదుగా పొందారన్నారు. త్వరలోనే 106 కోట్ల రూపాయలతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న నవంబర్‌లో వేసంగి చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి స్వగ్రామానికి వచ్చి కుటుంబాలతో ఆత్మగౌరవంగా బ్రతికేలా చేస్తామన్నారు. మధ్యమానేరు, ఎగువ మానేరు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.మధ్యమానేరులో 5 టిఎంసిల నీరు నింపితేనే భూగర్భ జలాలు పెరిగాయని, 25 టిఎంసిలు నింపితే రైతుల కష్టాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయన్నారు.16 మంది సిఎంలు, పది మంది పిఎంలు పనిచేసినా రైతుబంధులాంటి పథకానికి రూపకల్పన చేయలేకపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 38 లక్షల ఎకరాలకు సాగునీటిని సంవత్సరాంతంలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులు అప్పులపాలు కాకూడదనే సీఎం కెసిఆర్ రైతుబంధు ప్రవేశపెట్టారన్నారు. ఏడాదికి దసరా, దీపావళి ఒక్కసారి వస్తే రైతుబంధు చెక్కుల పంపిణీ పండుగ రెండుసార్లు వస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని రైతుబంధు అందులో ఒకటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బాల్క సుమన్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి యాస్మిన్ భాషా, డిఆర్‌ఒ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.