Home కలం థిక్ అండ్ థిన్

థిక్ అండ్ థిన్

Mohan-Cartoons

మోహన్ ఇకలేరు అనే వార్త చాలామందిని చాలారకాలుగా బాధించింది. స్నేహశీలి అని కొంతమంది, ఆత్మీయుడని మరికొంతమంది బాధపడ్డారు. కానీ ఆర్టిస్టు, కార్టూనిస్టుగా ఆయన ప్రయాణం ఒక ప్రయోగం. నిత్యం జరిగే ఆయన ప్రయోగ సాధన ఆగిపోవడం బాధ.
రాజకీయ కార్టూన్లు ఎప్పుడు మొదలైనా తెలుగు కార్టూన్లకు ‘పంచ్’ పడింది మోహన్‌తోనే. పేపర్ అందుకున్న పాఠకుడిని మొదట ఆకర్షించేది కార్టూనే. రాజకీయ వాసనని వదలకుండానే చురకేస్తూ, చమక్కుమనిపిస్తూ పెదాల మీద నవ్వు, మెదడులో ఆలోచనని ఒకేసారి మెరిపించేది రాజకీయ కార్టూనే! అట్లాంటి కార్టూన్లు గీసే అతి తక్కువ మంది పొలిటికల్ కార్టూనిస్టులలో ఒక ప్రత్యేకమైన శైలి మోహన్‌ది. పాశ్చాత్య దేశాల కంటే చాలా ఆలస్యంగా మనదేశంలో రాజకీయ కార్టూన్లు మొదలయ్యాయి. పైగా ఇప్పటికీ కార్టూనంటే కచ్చితంగా నవ్వించాలనే అభిప్రాయం ఒకటి. పత్రిక పాలసీలు కార్టూనిస్టు మీద తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకేనేమో బహు శా ఉదయం దినపత్రిక తరువాత మోహన్ మరే దినపత్రికలోనూ ఎక్కువకాలం ఉద్యోగిగా ఉండలేకపోయాడు.
ఏలూరులో పుట్టిన మోహ న్ కాలేజీ రోజుల్లో వామపక్ష భావజాలమున్న విద్యార్థిగా చురుగ్గా ఉండేవాడు. పశ్చిమబెంగాల్ వామపక్ష ప్రభుత్వాన్ని గవర్నర్ ధర్మవీర అక్రమంగా రద్దు చేసినప్పుడు. నిరసన ప్రదర్శన కోసం కలకత్తా వెళ్లి అరెస్టయి ప్రెసిడెన్సీ జైల్లో పడ్డాడు. విషయం అది కాదు. ఆ జైలు గోడల మీద ఇటుక పొడితో రాజకీయ కార్టూన్లు గీయడం. ఒక రకంగా ఆయన రాజకీయ కార్టూన్లకు అదే మొదలు. ఆ తర్వాత విశాలాంధ్రలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నా ఎన్నికలు, ప్రత్యేకాంధ్ర ఉద్యమాల కాలంలో కార్టూన్లు వేస్తూ వచ్చాడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కి అనేక ముఖ చిత్రాలు గీశాడు. అనేక పుస్తకాలు అనువాదాలు కూడా చేశాడు. ఇవన్నీ రాజకీయ కార్టూనిస్టుగా పదునెక్కడానికి ఆయనకు దోహదం చేశాయి. ఆంధ్రప్రభలో ఫుల్‌టైమ్ రాజకీయ కార్టూనిస్టు అయినప్పటి నుండి ఆయన ఇక వెనక్కి తిరిగి చూడకుండా కార్టూన్ పరుగు ప్రారంభించాడు. ఉదయంతో పూర్తిస్థాయిలో విజృంభించాడు. చైనీస్, రష్యన్ ఆర్టిస్టుల బొమ్మల్ని బాగా ఔపాసన పట్టిన మోహన్ తన బొమ్మల్లో ఎప్పుడూ వైవిధ్యం ఉండేలా తపన పడేవాడు. ఒక్క నిద్రించేటప్పుడు తప్ప ఎప్పుడూ ఆయన చేతిలో పెన్సిల్ టేబుల్ మీద పేపర్లో స్కెచ్చుల మీద స్కెచ్చులు సాధన చేస్తుండేది.
కవిత్వానికి బొమ్మలు గీసినప్పుడు ఉండే సున్నితత్వం, కథలకు గీసేటప్పుడు కన్పించేది కాదు. కథలకు గీసేటప్పుడు కన్పించే వస్తుతత్వం పోస్టర్లకు గీసేటప్పుడు ఉండేది కాదు. మరీ ముఖ్యంగా వామపక్ష పోస్టర్లకు ఒక్క మోహన్ మాత్రమే హోల్ అండ్ సోల్. మళ్లీ రాజకీయ కార్టూన్ల విషయానికొచ్చేసరికి పైన చెప్పిన ఏ ఒక్కలక్షణం కన్పించేది కాదు. అప్పటివరకు ఉన్న ఒక సంప్రదాయ గీతని పక్కకు నెట్టి సర్‌ర్‌ర్రున గీసిన థిక్ అండ్ థిన్ లైన్ ఒక్క జర్క్ ఇచ్చి అందరూ మోహన్ లైన్ వెంటపడేలా చూసుకున్నాడు. ఒక సమయమొచ్చేసరికి యువ కార్టూనిస్టులందరూ ‘మోహన్ల’యిపోయారు. అది ఎంతవరకొచ్చిందంటే కింద సంతకం లేకపోతే ఎవరి కార్టూనో తెలీనంతగా శిష్యబృందం అనుసరణ లేక అనుకరణ సాగింది. చివరికి మోహన్ తన లైన్‌ని తానే బ్రేక్ చేసుకుని ఓ కొత్త థిన్ లైన్‌ని షేక్ చేస్తూ కొత్త ప్రయోగాన్ని చేశాడు. చేయి తిరిగిన కార్టూనిస్టు చేసే ధ్వంస చిత్రం కూడా సమ్మోహనమే. అదే కొత్త అందం. ఇక అక్షరాలు. ఒక సందర్భం ఎలా క్రియేట్ అయ్యిందీ అంటే ఆయన అక్షరాలతో తమ పుస్తక ముఖ చిత్రం ఉండాలని లబ్దప్రతిష్ఠుల నుంచి వర్ధమాన రచయితల వరకు క్యూ కట్టేవారు. గీతలోను రాతలోనూ మోహన్‌ది అనన్య సామాన్య శైలి అయ్యింది. సంప్రదాయ పద్ధతుల్ని బ్రేక్ చేసిన మోహన్ అక్షరాలు పత్రికలకు కొత్త ఫాంట్‌నిచ్చాయి. వందల పుస్తకాలకు శీర్షికలయ్యాయి.
మరీ ముఖ్యంగా రాజకీయ కార్టూనిస్టుగా తనని తాను ఎక్కువగా ఫోకస్ చేసుకునే క్రమంలో తన స్థాయిని దించుకున్న సందర్భాలు ఒక రకంగా మోహన్‌ని కొంత తగ్గించాయి. ‘ కనకపు సింహాసనం పై శునకాన్ని కూర్చుండబెట్టిన’ ని అసెంబ్లీ నడుస్తున్న సమయంలో నాయకుడిని కుక్కతో పోల్చడం, పడకమీద ఆడవేషంలో నాయకులు కన్నుగీటటం వంటివి వదిలేసినా… తనకున్న అపారమైన అనుభవం, చదువు, అవగాహనతో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తాడనుకున్న సమయంలో ఆధునిక యానిమేషన్ మాయాజాలంలో పడి ఈ తరం కంటే ముందుండాలని తన అసలు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని కుదించుకున్నాడు. ఆయన్నుంచి ఇంకెంతో కోరుకోవడం తప్ప, తగ్గించడం ఉద్దేశం కాదు. ఇక మోహన్ క్యారికేచర్లు… మరీ బాపులాగా అందమైన పోర్ట్రెయిట్‌లా కాకుం డా, ముఖాన్ని అష్టవంకర్లు తిప్పి ‘ఇదే క్యారికేచర్’ అంటూ పాశ్చాత్య ధోరణిని అనుకరించే వారి లా కాకుండా ఎవరి క్యారికేచర్ వేసినా ఆ అందమైన గీత మనసు దోచుకునేది. అనేక మంది శి ష్యులు మోహనరాగం ఆలపించినా, ఎందుకో క్యారికేచర్ల విషయంలో మోహ న ‘గీత’ం వారికి వంటబట్టలేదు. మోహనంటే ఎవరికైనా గుర్తుకు రావల్సింది క్యారికేచర్లు, కార్టూన్లు, వ్యంగ్య రచనలు, టైటిల్సు మాత్రమే కాదు. సాధన, ప్రయోగాలు కూడా.