Home ఎడిటోరియల్ బిసిల కోటాపై సుప్రీంకోర్టుకు

బిసిల కోటాపై సుప్రీంకోర్టుకు

Article about Modi china tour

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ సమస్యపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అన్ని కేటగిరీలకు రిజర్వేషన్‌లు 50 శాతం దాటరాదంటూ హైకోర్టు విధించిన ఆంక్షతో ఏకీభవించని ప్రభుత్వం బిసిలకు న్యాయం చేయటానికి తాము కల్పించిన 34 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని గట్టిగా భావిస్తున్నది. ఈ నెలాఖరులో జరపాలని తలపెట్టిన పంచాయతీ ఎన్నికలు హైకోర్టు తీర్పు పర్యవసానంగా వాయిదావేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సమర్థమైన వాదనలతో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ సాధించగలమన్న విశ్వాసాన్ని ఈ సమస్యను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం వ్యక్తం చేసింది. ఉపసంఘం అభిప్రాయాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాక అప్పీలు క్రమం ఆరంభమవుతుంది.
2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్‌తోపాటు మొత్తం 61 శాతం రిజర్వేసన్‌లకు సుప్రీంకోర్టు అవకాశమిచ్చింది. విద్య, ఉద్యోగాలకు సంబంధించిన 50 శాతం గరిష్ట రిజర్వేషన్ లక్ష్మణ రేఖ పంచాయతీరాజ్ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని హైకోర్టు నిర్ధారణకు రావటం తక్షణ చర్చనీయాంశం. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ కోటా పరిమితిని స్థానిక స్వపరిపాలన సంస్థలకు వర్తింపజేసిన దాఖలాలు లేవు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్‌ల విషయమై దేశ వ్యాప్తంగా ఒక నిర్దుష్టత ఉందిగాని బిసిల విషయంలో అది లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్రంలోని బిసిల జనాభాను బట్టి రిజర్వేషన్‌లు ఖరారు చేసే స్వేచ్ఛ ఉంది. బిసిల జనాభా 50 శాతంపైగా ఉన్నందున తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్‌లు కల్పించాలని బిసి సంఘాల నేతలు ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, కనీసం 34 శాతం అమలుకు కూడా అడ్డంకులు ఏర్పడితే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది. అయితే కచ్చితమైన జనగణన లెక్కలతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఒప్పించవలసిఉంటుంది.
73, 74 వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలు పార్లమెంటు, అసెంబ్లీల తదుపరి తృతీయ స్థాయి పరిపాలనా వ్యవస్థగా గుర్తించబడ్డాయి. చట్టసభలవలె వాటికీ (పంచాయతీరాజ్, మున్సిపల్) ఐదు సంవత్సరాలకు విధిగా ఎన్నికలు జరపాలని అది నిర్దేశించింది. అయితే స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నందున రిజర్వేషన్‌ల ఖరారు, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించటం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాటిని నిర్వహిస్తుంది. అదేమిటోగాని స్థానిక సంస్థలు జరిగే ప్రతిసారీ ఏదోక కారణంతో అవి షెడ్యూలు తప్పుతున్నాయి.
స్థానిక సంస్థలను నిజమైన స్వపరిపాలన సంస్థలుగా బలోపేతం చేసే ఉద్దేశంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టానికి గత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందింది. గిరిజన తండాలకు తొలిసారి పంచాయతీ ప్రతిపత్తి ఇచ్చింది. జూలైలో గడువు ముగిసేలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే నిమిత్తం ఓటర్ల జాబితాల సవరింపు కార్యక్రమం చేపట్టింది. అయితే రిజర్వేషన్‌లు ప్రకటించాక కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో దాని ఆదేశం ప్రకారం బిసి ఓటర్ల గణన చేపట్టి, రిజర్వేషన్‌లు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా హైకోర్టు తీర్పు రూపంలో ప్రతిబంధకం ఎదురైంది. సుప్రీంకోర్టులో అప్పీలు త్వరితంగా పరిష్కారమైతేనే త్వరలో ఎన్నికలు సాధ్యం. ఆలస్యమైతే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంటే ఆ ఎన్నికల అనంతరమే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం. ఈ నెలాఖరుతో సర్పంచ్‌ల గడువు ముగుస్తున్నందున వాటి పదవీ కాలం పొడిగించటమో లేక అధికారులను నియమించటమో మంత్రివర్గం నిర్ణయించాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 85 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు చెందిన వారున్నందున విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్‌ను తమిళనాడు తరహాలో 69 శాతానికి పెంపుదలను అనుమతించాలని ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఎబిసిడి వర్గీకరణపై కూడా తీర్మానం పంపింది. అవి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చర్యలన్నీ అణగారిన తరగతులకు సామాజిక న్యాయంపట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ అంకిత భావాన్ని చాటుతున్నాయి.