Home రాష్ట్ర వార్తలు డిజిపి నియామకం రాష్ట్రం ఇష్టం

డిజిపి నియామకం రాష్ట్రం ఇష్టం

t20-20

అర్హుల జాబితాను కేంద్రానికి పంపకుండా ఇక్కడే తుది నిర్ణయం
కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం
నేడు సమర్పించబోయే బడ్జెట్‌ను ఓకే చేసిన కేబినెట్
పిజి మెడికోల సర్వీసు నిబంధన సడలింపుకీ సమ్మతి

మన తెలంగాణ / హైదరాబాద్ : డిజిపి ని నియమించుకునే అధికారం పూర్తిస్థాయిలో రాష్ట్రానికే ఉండేలా కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపైన డిజిపిని నియమించుకోడానికి అర్హులైన అధికారుల జాబితాను కేంద్రానికి పంపాల్సి న అవసరం లేకుండా రాష్ట్రమే తుది నిర్ణయం తీసుకునే కొత్త నిర్ణయానికి, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏడు ప్రధాన నిర్ణయాలను కూడా మంత్రివర్గం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఐదు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. పోస్టుగ్రాడ్యుయేట్ మెడిసిన్ విద్యార్థులు విధిగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నిబంధనను తొలగించడంపై కూడా ఆమోదం తెలిపింది. నీటిపారుదల శాఖలో మరో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల స్థలాన్ని కేటాయింపుపై కూడా ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరంలో విదేశీ భవన్‌ను నెలకొల్పడానికి రెండు ఎకరాలను, రాచకొండ కమిషనరేట్ కు 56 ఎకరాల స్థలాన్ని కేటాయింపుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపింది. చనాఖ కొరాట ప్రాజెక్టు పరిధిలో రెండు కొత్త రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రస్తుతం అమలవుతున్న హెల్త్ స్కీమ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణకు అనుగుణంగా ప్రవేశపెట్టాల్సిన బిల్లు విషయంలో చర్చ జరిగినా ఈ సమావేశంలో నిర్ణయం జరగలేదని సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో గురువారం ఉదయం 11 గంటలకు రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అదే విధంగా శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఉభయసభల్లో కూడా గురువారం నాటి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. దీంతో నేరుగా బడ్జెట్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వృద్ధి రేటు 19% వరకూ ఉన్నందున ఈసారి బడ్జెట్ సుమారు గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే సుమారు 15% మేర ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది 1.49 లక్షల కోట్లమేరకు బడ్జెట్ ఉండగా, ఈసారి అది కనీసంగా రూ. 1.72 లక్షల కోట్ల మేరకు ఉండవచ్చని సమాచారం. రైతు పెట్టుబడి పథకానికి రూ. 12000 కోట్లతో పాటు ఉద్యోగులకు నూతన పిఆర్‌సి ప్రకారం వేతనాల పెంపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఇచ్చే సాయాన్ని లక్షా నూట పదహారు రూపాయలకు పెంచడం తదితర పలు కీలక నిర్ణయాలు ఉంటున్నందున ఆ మేరకు బడ్జెట్ పెరిగే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని పేర్కొన్నారు. పైగా రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న స్వయంగా ఆర్థిక మంత్రే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినందువల్ల ఇంతకన్నా పెరిగినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.