Home ఆఫ్ బీట్ పోయిరా గణపయ్యా! పోయి రావయ్యా!!

పోయిరా గణపయ్యా! పోయి రావయ్యా!!

గణనాథుని గంగమ్మకు అందించడానికి సమస్తం సిద్ధమైంది. అందుకు గణపతి కూడా సంసిద్ధుడై తన ఎలుక వాహనాన్ని అధిరోహించాడు. బొజ్జ గణపతి భక్తులు, వీరభటులుగా మారి, గంగకుచేరి రంగాలంకరణ చేస్తున్నారు. ప్రేమగా ఇంటికి తీసుకువెళ్ళి భక్తితో ఆరాధించి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు వగైరాలుపెట్టి 11రోజులు పూజించింది ఇలా నీళ్ళ పాలుచేయడానికేనా?  నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రుల్ని వదిలి మనకోసం వచ్చినవాడు తిరిగి తన చోటికి చేరుకోవాలంటే మార్గమేది? ఆకాశానికి భూమికి నీటినిచ్చెన వేసిన గంగమ్మేమార్గం. అందుకే గణపతిని ఇంటికి తెచ్చుకుని 10 రోజులపాటు పూజలు చేసి సంబరాలు జరుపుకున్నా బాధతోకాక వేడుకగానే ఆయనను జలమార్గం ద్వారా కైలాసానికి సాగనంపుతాం. ఎందుకు? ఈ యేటికి వెళ్ళిపోయినా మరు యేటికి మళ్ళీ వస్తాడన్న నమ్మకంతో! 

Ganesh-Immersion-Special

నిమజ్జనం ఎందుకు?

నిమజ్జనాన్ని ఒక ఘట్టంగా మార్చి పలు చమత్కారాలతో మనకు అందించినవాడు అష్టదిగ్గజకవులలో ఒకడైన రామరాజభూషణుడు. వసుచరిత్రలో రామరాజభూషణ కవి ఈ సందర్భాన్ని చమత్కారవంతంగా సూచిస్తాడు. “దంతాఘట్టిత రాజతాచల…” గణపతి తొండంతో వెండికొండను కదల్చాడు. పార్వతి భయపడింది. వినాయకుడు తన తొండంతో శివుని శిరస్సున వున్న గంగాజలమంతా పీల్చేశాడు. పార్వతి సంతోషించింది. శివుడు భూమి..పార్వతి ప్రకృతి.. గణపతి భూమ్యాకర్షణ శక్తి.. గంగప్రాణశక్తి. భూమిపైన చెట్లు చేమలూ మాతృస్వరూపం. గణపయ్యను మట్టితో చేసి, ప్రవహించే గంగలో వేస్తే ఆయన మట్టిగా మారి కట్టగా తయారై గంగా ప్రవాహా న్ని అడ్డుకున్నాడు. తన సవతి ఉరుకులు పరుగులకు అడ్డుకట్టపడడం, అందుకు తన కుమారుడే కారకుడు కావడంతో పార్వతి ఆనందానికి మేరలేకపోయింది. చెట్లూ మట్టి చెట్ట్టాపట్టాలు వేయడంతో (శివపార్వతుల సమాగమంతో) ధరణి సస్యశ్యామలమై పాడిపం టలతో పరిఢవిల్లింది. ఇది కవితాత్మకమైన భావన. మరి నిమజ్జనం గురించి శాస్త్రం ఏం చెబుతోంది?

శాస్త్రం ప్రకారం నిమజ్జనం

ఆకాశస్యధిపాంవిష్ణు రగ్నే శ్చైవ మహేశ్వరీ
వాయోః సూర్యః క్షితేరీశో జీవసస్య గణాధిపః

అని కపిలతంత్రం చెబుతోంది. ఆకాశం విష్ణువు, అగ్ని మహేశ్వరి, వాయువు సూర్యుడు, భూమి పార్వతి, నీరు గణపతి ఇది పాంచభౌతికమైన ప్రపంచ సృష్టికి మూలం, మనం చెప్పుకునే ప్రకృతికి ఆధారం. గణపతి జలానికి అధిపతి. కనుక ఆయనను నీటిలో విడువడం న్యాయమంటోంది శాస్త్రం. పంచాయతన పూజా విధానంలో కూడా ఇదే కనబడుతుంది. నీరు బ్రహ్మ స్వరూపం. గణపతి జీవస్వరూపం. బ్రహ్మ చైతన్యంలోకి జీవుడు లీనం కావడమే నిమజ్జనం.

జ్యోతిషం ప్రకారం : భాద్రపదశుద్ధ చవితి నాడు హస్తా నక్షత్రం ఉంటుంది. ఇవి చంద్ర నక్షత్రం. అలాగే చతుర్దశి నాడు శ్రవణం ఉంటుంది. ఇది కూడా చంద్ర నక్షత్రమే. “శ్రవణేనకి సర్జయేత” అని శాస్త్రం. చంద్రుడు మనః కారకుడు. గణపతి మనస్సును కూర్చుండబెట్టేవాడే. చంచలమైన మనస్సుకు స్థిరత్వం కలిగించేందుకు అందులో తాను కూచుని ఎటూ కదలకుండా అదిమిపడతాడు.

దసరా నవరాత్రులు కూడా : ఆశ్వియుజ మాసంలో మనం నిర్వహించుకునే దసరా నవరాత్రులు కూడా హస్త, శ్రవణ సంబంధంగానే ఏర్పడతాయి. భాద్రపదశుద్ధ చవితి నాడు పార్వతి గణపయ్యకు రూపం కల్పించింది. చతుర్దశి నాడు గంగమ్మ తన ఒడిలోకి తీసుకొని మాతృప్రేమను చూపించింది. గణపతికి ఉన్న నామాలలో ఒకటి ద్వైమాతురుడు. చతుర్దశి నాడు శివయ్యను ప్రత్యేకంగా అభిషేకిస్తాం. పంచవిధ శివరాత్రులలో ఒకటి పక్ష శివరాత్రి, పున్న మకు ముందుగా వచ్చే చతుర్దశి నాటి రాత్రి. కనుక గణపయ్యను చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తాం.

వేదాంత భావనలు : పుట్టింది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం ప్రధానం కాదు. ఆత్మ ప్రధానం అని చెప్పేదే భారతీయం. మమకార భావనలు పెంచుకుంటే మోక్షం దూరమవుతుంది. పెంచి పోషించిన దేహాన్ని విడిచిపెడితేనే మోక్షప్రాప్తికదా!” నకర్మణా నప్రజయా ధనేన త్యాగనైకే అమృతత్వమానసుః” అని వేదప్రమాణం. త్యాగం చేత మాత్రమే అమృతత్వప్రాప్తి. విగ్రహం కేవలం నిగ్రహం కోసమే. పరమార్థం పట్టుబడ్డాక మట్టి ఎందుకు? అందుకే నిమజ్జనం చేస్తాం.

మరొక అర్థంలో : శివుడు భూమి. అందుకే పార్థివ లింగరూపంలో అర్చిస్తాం. పార్వతి ప్రకృతి. అందుకే అన్ని ముఖ్య సందర్భాలలో “అంకురారోపణం’ చేస్తాం. మొలకల పండుగ. విత్తనానికి భూమి స్పర్శ తగిలి నీరు అందితే పుడమి పురుడు పోసుకుని మొలక చిగురు తొడుగుతుంది. ఆపైన గాలి ఎండల తోడుతో మారాకు వేస్తుంది. వర్ష రుతువులో నీటి ప్రవాహాలు నిలబడితేనే మానవ మనుగడకు తోడు. అన్ని గొప్ప గొప్ప సంస్కృతులు నీటివాలులోనే నిలబడ్డాయి. భూమిలోని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నక్షత్ర సహిత చంద్రబలంతో భాద్రపద శుద్ధ చవితి నాడు నిర్మించి మళ్లీ శ్రవణా నక్షత్ర చంద్రుని బలంతో విసర్జన చేయడం ఒక ప్రత్యేక అంశం. హస్త సవిత్ర రూపం. పార్వతికి ప్రతీక. శ్రవణం శ్రీమన్నారాయణుని జన్మనక్షత్రం. గంగాదేవి సంబంధితం (విష్ణుపాదోద్భవీంగంగా…) భూమిని తవ్వి కుప్పగా పోసి, ప్రవహించే నీటిని ఆపి, భూమిని సస్యశ్యామలం చేయడం అంతరార్థం. అందుకే వినాయకుడిని రైతుబాంధవుడంటాం.

చతుర్దశి ప్రత్యేకత : భాద్రపదశుద్ధ చతుర్దశికి అనంతపద్మనాభ చతుర్దశి అని పేరు. స్వామిని ఈరోజు అనంతనా మంతో పిలుస్తాం. దైవరూపాన్ని సర్పాకారంలో, పద్నా లుగు తలల శేషువుగా భావించి అర్చిస్తాం. గణపతికి నాగబంధనం ఒక అలంకారం. ఆయన నాగ యజ్ఞోప వీతుడు. చతుర్దశభువనాలకు అధిపతి. వ్రతకథలో నది ఒడ్డున జరుగుతున్న వ్రతాన్ని చూస్తారు. సుశీలా శౌండిన్యులనే దంపతులు. చతుర్దశ సంవత్సరాల అనంతరం అహం పెరిగిన శౌండిన్యుడు, అనంతుని ధిక్కరించి దుఃఖాల పాలవుతాడు. పక్షులు ఆశించని పండ్లు ఉన్న మామిడి చెట్టును పెంచడం, పూర్వజన్మలో వచ్చిన విద్య..మరొకరికి చెప్పకపోవడం, వంటి పాపం చేసినందువల్ల ఇలాంటి జన్మ కలిగిందని బావురుమంటుంది. అనంతుడు ఎవరో తెలియదని దుఃఖిస్తుంది. అంటే చెట్టు కూడా తను ఇచ్చే పండ్లను పదిమంది తినాలని కోరుకుంటుందన్నమాట. మనం నేడు పర్యావరణానికి శత్రువులుగా మారి చివరకు పురుగులు కూడా ఆశించని విషతుల్యమైన రసాయానాలతో
తయారవుతున్న పండ్లను తిని రోగాలపాలవుతున్నాం కదా?

కాలసూచన : మన కాల ప్రమాణం ప్రకారం ఒక సంవత్సర కాలం పితృదేవతలకు ఒకరోజు. దేవతలకు ఒక్క నిముషం. సంవత్సరానికి ఒకసారి మనం చేసే ఈ పూజ, ఆ స్వామిని ప్రతి నిముషమూ కొలిచినంత పుణ్యం ఇస్తుంది.
మొదటి నుంచీ ఇలా చతుర్దశి నాడు నిమజ్జనం ఉందా!
లేదు…! ఏ శాస్త్రమూ ఇలా చెప్పలేదు. పెద్దలు ఏర్పరచిన సంప్రదాయం ఇది. అందుకే కొందరు మూడు రోజులు.. మరికొందరు అయిదు రోజులు ఇంకొందరు ఏడు రోజులు, ఇతరులు తొమ్మిది రోజుల పాటు తమతమ ఇంటి ఆచారాల ప్రకారం చేస్తుంటారు.
గణపతి మనకందరికీ జ్ఞానాన్ని ఇచ్చుగాక! శుభమస్తు!!

Suryanarayana-Murthy

– కాకునూరి సూర్యనారాయణమూర్తి
9866542365