Home హైదరాబాద్ బండి ఊరేగింపు భళా

బండి ఊరేగింపు భళా

The stunning scary kings perform acrobatics and different garments

అంబారీపై ఊరేగిన అమ్మవారు
ఘనంగా జరిగిన బోనాల ఉత్సవాలు
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు, వివిధ వేషధారణలు
కోలాటాలు, నృత్యాలతో మహిళలు, యువకుల సంబరాలు

మనతెలంగాణ/బేంగంపేట్/సిటీబ్యూరో: రెండవ రోజు కూడా మహిళలు బోనాలు ఎత్తుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు కోలాటాలతో ఘటం అంబారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం ఉదయం రంగం కార్యక్రమం అనంతరం గజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయి. రంగం కార్యక్రమం చివరి అంకమైన అంబారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అమ్మవారి ఊరేగింపు వెంట వందలాది మంది భక్తులు కోలాటాలు, నృత్యాలు వేస్తూ నడిచారు. లంబాడా నృత్యాలు, విచిత్రవేషాలు, దేవతామూర్తుల వేషధారణలతో శోభాయమానంగా యాత్ర సాగింది. అమ్మవారి ఘటం అంబారి ముందు నడుస్తూ సాగిన ఊరేగింపు దేవాలయం నుండి మోండా మార్కెట్, ఆల్ఫాహోటల్ గుండా సికింద్రాబాద్ పురవీధుల గుండా సాగుతూ మెట్టుగూడలోని అమ్మవారి ఆలయం వరకు సాగింది. అక్కడే అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. కాగా, అంబారి ఊరేగింపులో మంత్రి తలసాని నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. బోనాల ఉత్సవాల అనంతరం సాయంత్రం అత్యంత వైభవంగా ఫలారం బండ్ల ఊరేగింపును మంత్రి తలసాని ప్రారంభించారు. సాయంత్రం మోండా ప్రాంతంలోని ఆదయ్యనగర్ నుంచి ఫలారం బండి ఊరేగింపు ప్రారంభమైంది. వివిధ ఆకృతులతో ఫలరాం బండ్లను అమ్మవారి ప్రతిమలతో అందంగా రూపొందించి ఊరేగించారు. ముందుగా దేవతామూర్తులకు మంత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు. కళాకారులు విచిత్ర వేషాలతో కోలాటాలు, నృత్యాలు చేస్తూ బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఆదయ్యనగర్ నుండి మహంకాళి ఆలయం వరకు ఈ ఫలారం బండ్ల ఊరేగింపు కొనసాగింది.