Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సర్కారు వైద్యం… మరీ దౌర్భాగ్యం

rims

*పేదోడికి చేరువ కాని సేవలు
*కోట్లల్లో నిధుల వ్యయం
*అయినా కనిపించని ఫలితం

మన తెలంగాణ/ ఆదిలాబాద్ బ్యూరో  కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ సర్కారు వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ అమలులో నీరుగారిపోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవసరమైన చోట సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వైద్యరంగానికి బడ్జెట్‌లో కోట్లాది రూపాయలను మంజూరు చేస్తుంది. అలాగే జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలలో రిమ్స్, ఏరియా ఆసుపత్రులను కొనసాగిస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా సరైన న్యాయం దక్కడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలతో పాటు తదితర వ్యాధులు సైతం విజృంభిస్తున్నప్పటికీ వాటి నివారణ విషయంలో పూర్తి నిర్లక్షం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కొంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది కారణంగా వైద్యారోగ్య శాఖ అభాసు పాలవుతుందని అంటున్నారు. మానవీయ కోణాన్ని పక్కన పెట్టి కొంత మంది వైద్యులు తమ పవిత్రమైన వైద్య వృత్తి బాధ్యతను విస్మరిస్తూ ప్రైవేట్ వైద్యానికి మొగ్గు చూపుతుండడం, అలాగే వైద్యరంగాన్ని వ్యాపారమయంగా మార్చేస్తుండడంతో ఈ వ్యవస్థ పూర్తిగా చులకనగా మారుతుందని అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి ఏటా రోగాలు విజృంభిస్తున్నప్పటికీ అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్య సేవలు సక్రమంగా అందక పోవడంతో వారంతా ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని అంటున్నారు. చాలా మంది వైద్యులు వాణిజ్య కోణంలోనే ఆలోచిస్తూ పేద, మధ్య తరగతి వర్గాల రోగులను ప్రైవేట్ వైపు మొగ్గు చూపే విధంగా ప్రయత్నిస్తున్నట్లు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిండు గర్భిణీకి వైద్య సేవలందించాల్సిన వైద్యులు హెచ్‌ఐవీ ఉందనే కారణంతో వైద్యం అందించేందుకు నిరాకరించడంతో సదరు గర్భిణీ నరకయాతన అనుభవించగా, బంధువులు ఆందోళనకు లోనయ్యారు. వివిధ సంఘాలు, మీడియా జోక్యంతో ఆ తరువాత వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇదిలాఉంటే మంగళవారం ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని బంధువులు ఆందోళన చెందుతున్నా డ్యూటీ డాక్టర్లు ఆమెకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్షంగా వ్యవహరించడంతో ఆమె మృత్యువాత పడాల్సి వచ్చింది. కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న రిమ్స్ వైద్యులు ఆచరణలో మాత్రం నిర్లక్షంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ప్రతి రోజు రిమ్స్‌కు వచ్చే వ్యాధిగ్రస్తులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం జిల్లా ప్రజలకు సర్కారు వైద్యంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. ఇకనైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దాసుపత్రిగా ఉన్న రిమ్స్‌తో పాటు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Comments

comments