Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

చైనా చెప్పినట్లు నడుస్తున్నామా?

air-india

మనందరికి తెలుసు, ఎయిర్ ఇండియా మహారాజా చాలా గంభీరంగా భారత పౌరవిమానయానానికి చిహ్నంగా ఆకాశాలను ఏలుతున్నాడు. కాని ఎయిర్ ఇండియా ఇప్పుడు ప్రయివేటీకరణ మాటలు ఒకవైపు వినబడుతున్నాయి. ఎయిర్ ఇండియా మహారాజా ఆకాశాల్లో ఎగరడం కష్టమవుతుందని కూడా మనకు తెలుసు. కాని ఆయన కనీసం లేచి నిటారుగా కూడా నిలబడలేని స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుందిప్పుడు
ఎందుకంటే, చైనా ఆదేశాలను ఎయిర్ ఇండియా తూ.చ. తప్పక పాటించినట్లు తెలుస్తోంది. తైవాన్ ను “చైనీస్ తాయిపాయ్‌” గా పేర్కొనాలని చైనా చెప్పింది. ఆ మాటలు పొల్లుపోకుండా ఎయిర్ ఇండి యా అమలు చేసి చూపించింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా వెబ్ సైటులో తైవాన్ అనేది “చైనీస్ తాయిపాయ్‌” గా కనిపిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో జులై 5వ తేదీన వచ్చిన వార్త ప్రకారం ఎయి ర్ ఇండియా వెబ్ సైటులో తైవాన్ ఎయిర్ పోర్టు పేరును చైనీస్ తాయిపాయ్‌గా మార్చిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. తైవాన్ కు డైరెక్టుగా ఎయిర్ ఇండియా విమానాలు లేవు. ఎయిర్ చైనాతో కలిసి ఈ సర్వీసులు నిర్వహించాలి.
చైనాలో అంతర్భాగమే తైవాన్ అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. కాని తైవాన్ మాత్రం స్వతంత్రదేశంగా చెప్పుకుంటుంది. 1949 నుంచి స్వతంత్ర ప్రజాస్వామిక దేశంగా ఉన్నట్లు చెబుతుంది. చైనా విషయంలో తైవాన్ అనేది వివాదాస్పదమైన విషయం. ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు ఎవరు ఇచ్చినట్లు మాట్లాడినా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వన్ చైనా అనేది చైనా చాలా కఠినంగా అమలు చేస్తున్న విధానం. ఏ దేశమైనా తన సార్వభౌమాధికారం ప్రకారం భౌగోళిక సరిహద్దులను ఇతర దేశాల ప్రభుత్వాలు గుర్తించి గౌరవించాలని కోరడం సహజమే. కాని ప్రయివేటు సంస్థలపై అలాంటి ఒత్తిడి తీసుకురాలేరు. తైవాన్ విషయంలో అమెరికాను కూడా చైనా ఇదేవిధంగా కోరింది. కాని అమెరికా ఈ కోరికను తిరస్కరించింది.
“ప్రయివేటు సంస్థల వెబ్ సైటులకు సంబంధించి అమెరికా కంపెనీలు, విమానయాన సర్వీసులు నడుపుతున్న కంపనీలతో సహా ఏ కంపనీల విషయంలో అయినా సరే ఆదేశించడాన్ని అభ్యంతర పెడుతున్నాం. కంపెనీలు తమ సానుకూలత ప్రకారం వ్యవహరిస్తాయి. వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తాయి. అమెరికాలో చైనా కంపెనీలు చాలా స్వేచ్ఛగా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పనిచేస్తున్నాయి” అని జవాబిచ్చింది. అంతేకాదు, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ విషయమై మాట్లాడుతూ అవసరమైతే చైనా ఒత్తిళ్ళు ఇలాగే పెరిగితే తగిన చర్యలు చేపడతామని హెచ్చరిక కూడా జారీ చేశారు.
కాని, ఎయిర్ ఇండియా పరిస్థితి అలా కాదు. ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థ. అందువల్ల అంతర్జాతీయంగా ఒక దేశం సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రశ్న తలెత్తుతుందన్నది నిజమే అయినా భారతదేశం శరవేగంగా చైనా కోరికను ఆమోదించడం గమనించదగిన విషయం.
ఎయిర్ ఇండియా విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. పీకల్లోతు అప్పుల్లో ఉంది. దాని వ్యవహారాలన్నీ ఇప్పుడు కంగాళీగా తయారయ్యాయి. చివరకు ప్రభుత్వం వేలం వేయాలని కూడా నిర్ణయించింది. కాని ప్రభుత్వం పెట్టిన షరతులు చూసి కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎయిర్ ఇండియాకు సంబంధించి ఇన్ని సమస్యలుంటే, వాటిని పరిష్కరించడం తక్షణావసరమైతే, ప్రభుత్వం మాత్రం చైనా కోరిక ప్రకారం ఎయిర్ ఇండియా వెబ్ సైటులో మార్పులు చేయవలసిన విషయాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయంగా చేపట్టి వెంటనే చర్యలు తీసుకుంది.
తైవాను స్వతంత్ర దేశంగా ఇండియా గుర్తించలేదన్నది నిజమే. తాయిపాయ్‌లో భారతదేశానికి దౌత్యకార్యాలయం ఏదీ లేదన్నది నిజమే. అయితే ఇండియా తాయిపాయ్ అసోసియేషన్ ఒకటి అక్కడ పనిచేస్తోంది. న్యూఢిల్లీలో తైవానీలు తాయిపాయ్ ఎకనమిక్ కల్చర్ సెంటర్ నడుపుతున్నారు. అప్పుడప్పుడు న్యూఢిల్లీకి, తాయిపాయ్‌కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఫిబ్రవరి 2017లో తైవానీ పార్లమెంటరీ బృందం న్యూఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం తైవాన్ తో పారిశ్రామిక సహకారానికి ఒక ఒప్పందంపై కూడా సంతకాలు జరిగాయి. అప్పుడు కూడా చైనా మీడియా భారతదేశంపై దుమ్మెత్తిపోసింది. అన్నింటికి మించి వన్ చైనా విధానాన్ని గుర్తిస్తున్నట్లు భారతదేశం ఎన్నడూ చెప్పలేదు. కాబట్టి చైనా చెప్పే వన్ చైనా విధానానికి మనకు సంబంధమే లేదు.
దౌత్యపరంగా మనం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా విషయంలో ప్రభుత్వం అంత త్వరగా చైనా మాటలకు తలూపడం విచిత్రం. ఎయిర్ ఇండియా వెబ్ సైటులో తైవాన్ పేరు చైన చెప్పిన ప్రకారం ఉండకపోతే చైనా బాధపడిపోతుందని మనం బాధపడి వెంటనే చర్యలు తీసుకోవడం మరీ విచిత్రం. ఎయిర్ ఇండియా వ్యవహారాల పట్ల అంత ఆసక్తి ఉంటే దాని అప్పుల బాధ పట్ల కూడా ఆ శ్రద్ధ చూపించాలి. ఇటీవల భారతదేశం అంతర్జాతీయంగా కొన్ని దేశాలను సంతృప్తిపరచడానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నట్లు కనబడుతుంది. మొన్న జూన్‌లో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించుకోవలసి ఉంటుందని రిఫైనరీలకు తెలియజేసింది. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్న సూచనలు వెంటనే ప్రపంచం గ్రహించింది. కాని, 2012లో ఇలాంటి ఒత్తిళ్ళను మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. చైనా విషయంలో ఇటీవల ఇలా వ్యవహరించడం ఇది రెండోసారి. మార్చిలో దలైలామా భారతదేశానికి వచ్చిన 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రవాస టిబెట్ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ ప్రభుత్వం అధికారులను, నాయకులను కోరింది. అంతేకాదు, ఈ కార్యక్రమాల వేదికను కూడా మెక్లాండ్ గంజ్ నుంచి న్యూఢిల్లీకి మార్చారు. ఇది కూడా చైనాకు అయిష్టం కలగరాదన్న జాగ్రత్త మాత్రమే.
ఇదే ప్రభుత్వం 2017లో ఇలా వ్యవహరించలేదు. అరుణాచల్‌ప్రదేశ్ వంటి సున్నితమైన రాష్ట్రంలో పర్యటించడానికి దలైలామాకు అనుమతించారు. హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు అక్కడికి వెళ్ళి దలైలామాను కలిసి మాట్లాడి కూడా వచ్చారు. సంవత్సరంలోగానే ఈ విధానంలో మార్పు వచ్చేసింది.
విదేశాంగ విధానం అనేది చాలా సున్నితమైనది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాని హఠాత్తుగా యుటర్న్ తీసుకోవడం అనేది అర్ధం కాని విషయమవుతుంది.

Comments

comments