Home పెద్దపల్లి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

speak

*మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

మన తెలంగాణ/అంతర్గాం  ః  పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటు పడుతూ వారి అభివృద్ధికి సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని రాష్ట్ర రోడ్డు, భవానాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రామగుండం పట్టణంలో 23కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంగళవారం ఆయన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్‌తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంక్షేమ రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 45వేల కోట్లతో కేటాయించిన ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రధానంగా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో 25లక్షల మంది బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా రూ. 12వేలు నగదుతో పాటు కెసిఆర్ కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కెసిఆర్ కృషితోగడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని 3వేల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా కేంద్రం నుండి సాధించుకోవడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విన్నపం మేరకు రామగుండం పట్టణం నుండి అంతర్గాం మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 9కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక పట్టణానికి సమీపంలోనే గోదావరి నది ప్రవహిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించడంలో సీమాంధ్ర పాలకులు విఫలం అయ్యారని పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని కోటి ఎకరాల భూములకు సాగునీరు అందించే భృహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎంపి బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ రామగుండం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ కేంద్రంతో  మాట్లాడి రూ. 5వేల కోట్లు కేటాయింపజేసి ఎఫ్‌సిఐ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. మంత్రి కెటిఆర్, సీఎం కెసిఆర్‌లు రామగుండం కేంద్రంగా ఎఫ్‌సిఐ, ఎన్టీపీసీలకు అనుబంధంగా మరింత పరిశ్రమల స్తాపనకు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం ప్రజలుఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరి అధృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని రైతంగానికి సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ. 76కోట్లు కేటాయించి సీఎం కెసిఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. రామగుండంలో పెండింగ్‌లో ఉన్న బి ధర్మల్  కేంద్రం విస్తరణకు సహకరించాలని కోరుతూ మంత్రులకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జడ్పీచైర్మన్ తుల ఉమా, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఈడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్, రహదారుల భవనాల శాఖ అధికారులు రాములు, రవీందర్, ఎంపిపి ఆడెపు రాజేశం, కార్పోరేటర్లు షమీమ్ సుల్తానా, అహ్మద్‌బాబు, కోదాటి ప్రవీణ్, నస్రీన్ బేగం, మహ్మద్‌తో పాటు టిఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.