Home కలం దారి తప్పని కవిత్వం

దారి తప్పని కవిత్వం

Writing

కవిత్వానికి ఎన్ని ముఖాలున్నా కవి అంటే జనం సుఖదుఃఖాలను మనసుకు హత్తుకునేలా చెప్పే కళా హృదయుడని అందరూ భావిస్తారు. మాట, పాట రూపంలో ఓదార్పు నీయడం, ఎదిరించి నిలపడం తెలంగాణ అక్షర లక్షణం. చరిత్రలో ఎంత స్థానం దొరికినా చిన్నబోకుండా, గుర్తింపును జనం ప్రతిస్పందనల్లోనే చూసుకోవడం ఇక్కడి కవిత్వ సుగుణం. ఈ నేలపై కవిత్వం రాయడమంటే కలాన్ని నూరడమే. అది జంకు, వెరపులేని యుద్ధ క్రీడనే.
ఇక్కడి రాజును ‘తరతరాల బూజు’ ‘ముసలి నక్క’ ‘నీ గోరి కడతం కొడుకో’ అనడానికి కవి వెనుకంజ వేయలేదు. ఆ సంప్రదాయమే, ఆ అనల పథమే తర్వాతి తరాలు సైతం అందుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ‘అవ్వోనివా… అయ్యో నివా’ అంటూ కవులు సరిహద్దుల్లో అమ్ములు నాటారు. ఏ పోరునైనా నిత్య వసంతంగా నిలుపడానికి తమ సేద్యం నిరంతరాయంగా సాగించారు.
తెలంగాణ సిద్ధించడం ఓ నిజమైన కల. సుదీర్ఘపోరాట ఫలితం. ఓ సేద దీరేక్షణం. కళ్లకద్దుకునే అపురూపం. ఆ ఆనంద హేలలో కవుల్లో కొంత స్తబ్దత రావడం సహజమే. ఆ గుణం క్రమంగా అన్ని సమస్యలపై ముఖం చాటేసే స్థాయికి చేరుకోవడం ప్రవృత్తి ధర్మానికి విరుద్ధం.
ఇంటా బయటా ప్రజలు యథారీతిలో పాలనాపరంగా ఎదురైన కష్టాలు అనుభవిస్తున్నారు. సార్వజనిక సమస్య లెన్నో పుట్టుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై మన కవుల స్పందన కానరాదు. ధర్నా చౌక్ ఎత్తివేత అయితే బ్లాక్ లిస్టులో పెట్టబడింది. రైతుల ఆత్మహత్యలు, మద్దతు ధర వైఫల్యం తీవ్రమైన విషయాలు కావు. దళిత, మైనారిటీలపై దాడులు, గో సంరక్షకుల హత్యలు కలవరపెట్టిని అంశాలే.
నక్సల్బరికి యాభై ఏళ్లు ఎంటే అదేమిటి అన్నట్లుంది వైఖరి. ఉత్తర ప్రదేశ్‌లో ఆక్సీజన్ అందక పసి పిల్లలు ప్రాణాలు వదలడం కదిలించని ఘటనయే. మత్తులో జోగుతున్న యువత పనికి రాని అంశమే. బర్మాలో రోహింగ్యాల సమస్య దూరపు చుట్టం కూడా కాదు. రాం రహీం బాబా దాష్టీకాలు, బ్లూవేల్ మృత్యు క్రీడలు కంటికి కానరాని వస్తువులే.
రాజకీయాలు మారినట్లు కవులు కూడా మారుతారని ఎవరూ ఊహించరు. కవులు కండువాలు మార్చుతారని కలం కూడా కలగన లేదు.పై సమస్యలకు ప్రతి స్పందించకుండా కేవలం ప్రభుత్వ పథకాలకు బాకా ఊదేవాళ్లు కచ్చితంగా సర్కారీ కవులే. అయినా, తెలంగాణ నేలలో జనకవులకేం కొరత లేదు. పాలకులెవరైనా ప్రజల పక్షమే నిలిచే కవుల కదం తొక్కే పదాలు తెలంగాణ కలాన్ని తల ఎత్తుకునేలా చేస్తున్నాయి. అందుకు ఈ సాక్షాలు చాలు.
ముస్లిం మైనారిటీలపై దాడులను నిరసిస్తూ వరవరరావు ‘ఘర్ వాపసీ’ కవితలో ‘కాషాయమైన ఈ దేశ ఆకాశంలో/ చవితి చంద్రునికే తప్ప/ నెలవంకకు/ నిషేధం’ అంటూ మత వైషమ్యపు పోకడల్ని ఎండగట్టారు.‘దువా’ కవితలో షేక్ కరీముల్లా నిండు హృదయంతో’ శాంతి నా విశ్వాసం కనుక / భారతీయత నా ఆత్మ కనుక’ అని సహనాన్ని ప్రదర్శించాడు.రెండు దేశాల మధ్య యుద్ధ పిపాసను బద్దలు కొడుతూ మహిజ బీన్ బేగ్ ‘నీ కొడుకును యుద్ధంలో నా కొడుకుగాని/ చంపి ఉంటే క్షమించు’ అంటారు తన అవును యుద్ధమే చంపింది’ అనే కవితలో.
ఆశారాజు ‘ఫ్లాష్ న్యూస్’ ఓ ‘బుల్లెట్’ కవిత పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారా/ పెద్దలు పళ్లాలు పట్టుకొని ఎదురు చూస్తున్నారు /ఇంట్లో ఇంకా పొయ్యి వెలగలేదు/ ఏమి తినాలో/ ఏమి మానేయాలో/ ఇంకా ఫ్లాష్ న్యూస్‌లో చెప్పలేదు’ తినే హక్కును సైతం హరిస్తున్న పాలనపై విమర్శనాస్త్రమిది. ముమ్మరమవుతున్న దళిత దాడులపై నోరు విప్పిని కవులున్నారు. కృపాకర్ మాదిగ మంథని మధుకర్ స్మృతిలో రాస్తూ ‘మాకు గోడలు లేవన్నంత మాత్రాన లేకుండా పోతాయా! / శవంతో నేనే కదా ఏడువాలి’ అని గోడలు కడుతున్న వైనాన్ని బహిర్గతం చేస్తాడు.
‘పురి విప్పిన పంచముని ప్రేమ ఫించాన్ని/ ఉరిపెట్టి జీవి తీసే ఉన్మాదం’ అంటూ సిద్దెంకి యాదగిరి ‘శవ ప్రశ్న’ వేస్తాడు. నరేష్కుమార్ ‘అంతరంగ దుఃఖం’లో తంగేడు మొగ్గల్లెక్క/ గాలికి ఊగే కనుగుడ్ల నుంచి / ఎండిన నడ్డి మీద రాలిపడ్డ కలల్ని / ఏ పీతిరి గద్ద పీక్కు తింటదో’ అని వర్తమాన పరిస్థితుల్ని కళ్లకు కడతాడు. వలసలపై వలుస్తూ వడ్లకొండ దయాకర్ ‘మంచం పట్టినవ్వ / సూడి బర్రె పడ్డ / గుడ్ల కొచ్చిన కోళ్లు/ నెర్రలు బారిన పొలం/ కండ్లల్ల మెదల్తాంటే / గుండెలవిసిపోతయి/ ఐనా పోక తప్పదు ’ అంటూ ఇప్పటికీ వలస అనివార్యతను ముందుంచుతాడు.
జన సంచారానికి దూరమవుతున్న ఊర్ల పరిస్థితిని గాంచి జూకంటి జగన్నాథం ‘ఇప్పుడు / ఊరు గురించి రాయడం / చెట్టులేని చోట / కోకిలలా కూయడం’ అంటాడు. రైతు కష్టాన్ని చూసిన దామెర రాములు ‘ఇవాళ రైతుకి / కుడి ఎడమల నిలిచిన వాడే కవి’ అంటాడు. రైతు ఆత్మహత్యలకు తల్లడిల్లిన బొల్లోజు బాబా’ అప్పటి కింకా ఆ చెట్టుకొమ్మ / ఉరి కంబం పాత్రను ధరించలేదు/ పక్షి గూడు దిశగా పాకుతున్న పామును శ్రద్ధగా చూస్తోంది’ అంటూ ‘ఒక ధుఃఖానికి ముందు’ పరిస్థితి వివరిస్తాడు.
పంట పండితే కలిగే పరవశాన్ని పలవరిస్తూ కవి సిద్ధార్థ ‘గంపెడు ఒడ్లను కండ్ల జూడడం ఎంత సుఖం నాకు/ గింజను కౌగిలించుకునే నులి పురుగు కూడా కవిత్వమే చెబుతుంది’ అంటాడు. పంట తీసే విధానాన్ని కడు రమ్యంగా వివరిస్తూ కొండి మల్లారెడ్డి ‘కాళ్ల మీద బొర్లా వేసుకుని / నేలకు తలంటు పోస్తున్నట్లు / ముసురు చిలకరిస్తుంది మబ్బు తుట్టే ’ అంటాడు. మద్దతు ధర లేక పంటను మంటలపాటు చేస్తున్న రైతునుద్దేశించి దర్భశయనం శ్రీనివాసా చార్య ‘ఆగ్రహం అంగడిని అంటాలి గాని / పంటను కాల్చితే ఎట్లా పంటను తగలబెట్టకు తండ్రీ!’ అని రైతును నాయనగా చేసుకుని ఓదార్చుతాడు.
భూబాగోతాన్ని నిరసిస్తూ బూర్ల వెంకటేశ్వర్లు ‘వాగ్దానాలకు బలి చేసిన దేవడేవుడు/ ఎన్నటి కన్నా ఇస్తాడా మూడెకురాలు? ’ ఎవనిది జాగ అని ఎదురొడ్డుతాడు. సొంత రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు కన్నెర్ర చేస్తూ నారాయణ స్వామి వెంకట యోగి’ చెక్క పెట్టెలో కుక్కేసిన శరీర భాగాలే/ గుర్తు పట్టటానికి ముఖాలుండవు../ ఒకప్పుడు బతికిన మనుషుల / ఆనవాళ్లు వుండవు’ అంటూ రాజ్య క్రౌర్యాన్ని పోస్టుమార్టం చేస్తాడు. పిన్నంశెట్టి కిషన్ ఆశావహంగా ‘కూల్చిన చెట్లను లెక్క లేసుకుంటూ సంబురంగా వాడు/ లెక్కలేనన్ని మొక్కలు నాటుకుంటూ మౌనంగా నేను’ నిశ్శబ్ద విస్ఫోటనమవుతాడు.
సర్కారు మాట తప్పి తవ్వుతున్న ఉపరితల బొగ్గు గనులను ప్రస్తావిస్తూ అన్నవరం దేవేందర్’ నదుల పారకం నారాయణలోకం/ పాలిచ్చే బర్లు పాండవ వనవాసం/ ఎవుసం ఏట్లె కలుసుడు ఖాయం’ అని భవిష్యవాణి చెబుతాడు.
కవి బాధ్యతను కలగంటూ దేవరాజు మహారాజు ‘అభాగ్యులకు, విధివంచితులకు/ కాసిన్న మెరుపు తీగలద్దడానికి/ అదిగో కవి లోలోపల జీవ చైతన్యాన్నంత /అక్షరాల్లో కూర్చుతున్నాడు’ కవికి నిర్వచనం చెబుతాడు. కవిగా ప్రతిజ్ఞ చేస్తూ అందెశ్రీ ‘సొమ్ములకు నా కవిత అమ్మచూపనెపుడు/ రొమ్మిరిచి చెప్పనా అమ్మపైన ఆన’ తన వైఖరిని స్పష్టం చేస్తాడు. ప్రస్తుత కవుల నిర్వాకాన్ని ఎండగడుతూ జూకంటి జగన్నాథం ‘కలాన్ని ఆయుధంగా ధరించిన వాళ్లు/ తో కూపుతూ మహా ప్రసాదమని/ పరమానందభరితులవుతున్నారు’ అని తన వైఖరిపై నిలబడతాడు.
అదే కోవలో జయధీర్ తిరుమల రావు ‘ఎవరండీ వీరు / ప్రజలకు ప్రభుత్వానికి మధ్య/ మధ్యవర్తులట’ అంటూ నిలదీస్తాడు. ఏ కవి ఎందరు కవులు జనం వైపు ఉన్నారో తెలియడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. తాలు, గింజ తేలిపోయే కాలమిది. పెద్దగా పెంచిన మీసాలను, గోళ్లను కొలిచి ప్రమాణ పత్రాలిచ్చే వెధవ లిమ్కా, గిన్నీస్ రికార్డుల కోసం మందల్లా గుమిగూడడం కవి లక్షణం కాదు. తెలంగాణ కవితా వృక్షానికి పూతకేం కొరత లేదు. రాలిన పూలెన్ని ఏరుకొని గంపలేసుక పోయినా కొత్త పూలు పూస్తూనే ఉంటాయి. ఏరే చేతుల కన్నా కష్టజీవి పాదాలు మేలనుకుంటాయి. దాశరథులు, కాళోజీలు, వట్టికోటలయి సవాళ్లు విసురుతాయి.