Home హైదరాబాద్ నిమ్స్ ఆదాయానికి గండి!

నిమ్స్ ఆదాయానికి గండి!

The tender pads in the parking lot contracted

పార్కింగ్ కాంట్రాక్టులో కుమ్మక్కైన టెండర్‌దారులు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
భారీగా నష్టపోతున్న నిమ్స్ ఆసుపత్రి

మన తెలంగాణ/సిటీబ్యూరో : నిమ్స్ ఆసుపత్రిలో పార్కింగ్ కాంట్రాక్టు టెం డర్ విషయంలో టెండర్‌దారులు ఏకమై నిమ్స్ ఆదాయానికి గండికొడుతున్నా అధికారులు వా రికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. గతంలో కాంట్రాక్టు దక్కించుకోడానికి కాంట్రాక్టర్ పోటాపోటీ పడి రూ.3లక్షల70వేలకు పార్కింగ్‌ను కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నారు. ఆ సమయం పూర్తి కావడంతో కొత్తగా టెండర్ కాల్ ఫర్ చేశారు. కాని కొందరు అధికారులతో కుమ్మక్కై రూ.2 లక్షలకే టెండర్ షెడ్యూల్ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో నిమ్స్ ఆసుపత్రి ప్రతి నెల లక్షకు పైగా నష్టం మూటకట్టుకోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత పెరగాల్సి ఉండగా, తగ్గడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఏడాది పాటు చెల్లించే మొత్తాన్ని వడ్డీ లేకుండా అడ్వాన్సుగా తీసుకోగా, ప్రస్తుత పిరియడ్‌లో కేవలం 3నెలల అడ్వాన్స్‌ను మాత్రమే తీసుకోడానికి నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఉన్న కాంట్రాక్టర్ అడ్వాన్సుగా రూ.35లక్షలు చెల్లించగా, ప్రస్తుత కాంట్రాక్టర్ కేవలం 3 లక్షల అడ్వాన్సు మాత్రమే చెల్లించినట్లు తెలిసింది. దీంతో నిమ్స్‌కు అన్ని విధాలా నష్టాలు చేకూరుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు,కాంట్రాక్టర్‌లు కుమ్మక్కై నిమ్స్‌కు రావాల్సిన ఆదాయానికి భారీ గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా పెరగాల్సిన ఆదాయాన్ని తగ్గించడానికి ప్రయత్నించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా నిమ్స్‌లో వెలుగులోకి రాని విషయాలు మరెన్నో ఉన్నట్టు తెలిసింది. నిమ్స్‌లో జరుగుతోన్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆరా తీస్తే అన్ని నిజాలు బయటపడతాయని అంటున్నారు. పార్కింగ్ కాంట్రాక్టు విషయంలో శక్తి వైష్ణవి గ్రూపు ప్రధాన పాత్ర వహించి టెండర్లలో ఎక్కువ మందిని పాల్గొన కుండా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్‌లో పాల్గొన్న 8మంది కూడా వారికి చెందినవారే కావడం గమనార్హం.