Home బిజినెస్ నోట్ల రద్దు సరైన ఆలోచన కాదు

నోట్ల రద్దు సరైన ఆలోచన కాదు

retaile

 డీమానిటైజేషన్ అమలు ప్రక్రియ సరిగ్గా లేదు
 ఆర్‌బిఐ అభిప్రాయంగా ప్రభుత్వానికి ముందే చెప్పాం
 జిఎస్‌టిని ఇంకా బాగా అమలు చేయొచ్చు
 ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

న్యూయార్క్ : డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) సరైన ఆలోచన కాదని, ఈ ప్రక్రియను కూడా సరిగ్గా అమలు చేయలేదని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. ఈ ఆలోచనను ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నప్పుడే చెప్పానని అన్నారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమైందని అన్నారు. నకిలీ నోట్లు, అక్రమ లావాదేవీలు, తీవ్రవాదానికి నిధులను నియంత్రించే లక్షంతో తీసుకున్న ఈ నిర్ణయం.. మంచి ఆలోచన కాదని, అమలు సరిగ్గా లేదని రాజన్ తెలిపారు. డీమానిటైజేషన్ నిర్ణయం విషయంలో ప్రభుత్వం ఆర్‌బిఐని సంప్రదించలేదనే వాదనను ఆయన తిరస్కరించారు. పెద్దనోట్ల రద్దు గురించి కేంద్రం ఆర్‌బిఐను సంప్రదించిందని, అది మంచి నిర్ణయం కాదని ఆర్‌బిఐ భావించిందని ఆనాడు చోటు చేసుకున్న పరిణామాలను రాజన్ గుర్తు చేసుకున్నారు. కేంద్రం ఆర్‌బిఐని సంప్రదించలేదని ఎప్పుడు చెప్పలేదని, నోట్ల రద్దుపై చర్చించామని, ఇది సరైన ఆలోచన కాదని తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని రాజన్ వివరించారు. కేంబ్రిడ్జ్‌లో హార్వర్డ్ కెన్నెడి స్కూల్‌లో రాజన్ మాట్లాడుతూ.. 87.5 శాతం పాత నోట్లను రద్దు చేయాలనే ఆలోచన సరైంది కాదని అన్నారు. ‘డీమానిటైజేషన్ ఆలోచన సరైన ఆలోచన కాదు. నిర్ణయం సరిగ్గా లేదు, అమలులో స్పష్టత లేదు. ఈ ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వానికి నేను చెప్పాను’ అని రాజన్ వివరించారు. నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొస్తే మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుందని.. ఏ ఆర్థిక వ్యవస్థా చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని.. అయితే అప్పటిదాకా పన్నులు చెల్లించకుండా డబ్బును మూలన దాచిపెట్టుకున్నవారు.. దీంతో బయటికి వచ్చారని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఇతర మార్గాలు అన్వేషించే వారుంటారని, రద్దు చేసిన నోట్లు అంతా వ్యవస్థలోకి వచ్చాయని రాజన్ తెలిపారు. డీమానిటైజేషన్ కారణంగా దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారిందన్నారు. ప్రజల వద్ద డబ్బులు లేకుండా పోయాయని, చెల్లింపులు చేయలేపోయారని, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ఆర్థిక లావాదేవీలు కుంటుపడ్డాయని రాజన్ తెలిపారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో రాజన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
జిఎస్‌టి సరిగ్గా అమలు చేయాలి
జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) సరైన అమలు అవసరమని, ఇది పరిష్కరించలేని సమస్య కాదని రాజన్ అన్నారు. జిఎస్‌టి గురించి రాజన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. జిఎస్‌టి చాలా మంచి నిర్ణయమని, దాన్ని అనుకున్నదానికంటే ఇంకా బాగా అమలు చేయొచ్చని, అమలులో వచ్చే సమస్యలను అధిగమించగలమని అన్నారు. ప్రస్తుత 7.5 వృద్ధి రేటు ప్రతి సంవత్సరం అందుబాటులోకి వచ్చే 12 మిలియన్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. పది శాతం వృద్ధి రేటు సాధించడం వల్ల దాన్ని సాధించగలమని రాజన్ అన్నారు. 2019 ఎన్నికల దృష్ట్యా దేశం కొంతకాలం సంస్కరణలను నిలిపివేసే అవకాశం ఉందని, ఎన్నికల అనంతరం వా టిని అమలు చేయడం వల్ల రెండు, మూడేళ్లలో అధిక వృద్ధిరేటును సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో ఎగుమతులకు తక్కువ డిమాండ్ ఉంది. భారత్ ఒక్కసారిగా తయారీరంగానికి ప్రాధాన్యత ఇవ్వ డం వల్ల ప్రయోజనం లేదని, చైనా విధానాలకు విభిన్నంగా వెళ్లినపుడే వృద్ధి రేటును సాధించగలమని రాజన్ అన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పాతది..
బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎలు) పేరుకుపోవడం, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కుంభకోణం వంటి అంశాలపైనా రాజన్ స్పందించారు. భారత్ బ్యాంకింగ్ పురాతన వ్యవస్థను కల్గి ఉండడం ఆందోళన కల్గించే విషయమని, పిఎన్‌బి కుంభకోణం సైబర్ నేరానికి సంబంధించిందని అన్నారు. ఈ స్కామ్ జరగడానికి గల కారణాలను తెలుసుకోవాలని, వాటిని పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. కోట్ల డాలర్లతో తప్పించుకుపోవడానికి భారత్ వ్యవస్థలో నిజంగా తెలివి ఉండాల్సిన అవసరం లేదని, బ్యాంకింగ్ వ్యవస్థలు పురాతనమైనవని, ఇలాంటి వారిని నిరోధించే వ్యవస్థ లేదని ఆయన అన్నారు. ఉద్యోగులు కుమ్మక్కై ఇలాంటి స్కామ్‌లకు పాల్పడుతున్నారని రాజన్ అన్నారు.