Home ఎడిటోరియల్ ట్రంప్ హుకుం! మోడీ జోహుకుం!!

ట్రంప్ హుకుం! మోడీ జోహుకుం!!

edit

ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై తాజా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఆయిలు దిగుమతులను నవంబర్ 4 నాటికి ‘సున్న’కు తగ్గించుకోవాలని. అంటే పూర్తిగా నిలుపుచేయాలని భారత్ సహా “ఆసియా దేశాలన్నిటికీ” ముందస్తు హుకుం జారీ చేసింది. ఇది ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించటం తప్ప వేరు కాదు. ఆంక్షలు విధించే అధికారం ఐక్యరాజ్య సమితికే ఉన్నందున ఇది చట్టవిరుద్ధం. అయితే ఐరాసను పూర్తిగా విస్మరించి అమెరికా లోగడ కూడా ఆంక్షలు విధించింది. ఈ పర్యాయం కూడా ఆంక్షలు అమలు జరపగలనని ట్రంప్ భావిస్తున్నాడు. శక్తిమంతమైన అమెరికా, అంతకన్నా శక్తిమంతుడైన దాని అధ్యక్షుడి ఆదేశాన్ని ధిక్కరించటానికి బహు కొద్ది దేశాలే సాహసిస్తాయని ఆయన విశ్వసిస్తున్నాడు.
“అన్ని ఆసియా దేశాలు” అన్న ప్రస్తావన ప్రాముఖ్యతగలది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉండగా 2012 మే నెలలో వాషింగ్టన్ ఇరాన్‌పై ఇటువంటి ఆంక్షలే విధించింది. అయితే దాని పరిధి నుంచి యూరోపియన్ యూనియన్‌ను, జపాన్‌ను “మినహాయించింది”. అమెరికా వైఖరి ఏమంటే, మా మిత్రులు, భాగస్వాములు (అలైస్) తప్ప మిగతా అందరూ బాధపడాలి. ట్రంప్ కింద కూడా ఆ దృక్పథంలో మార్పులేదు.
ఇరాన్‌పై తాజా ఆంక్షలు విధించటానికి అమెరికా చెప్పిన కారణం ఇరాన్ బాలిస్టిక్ మిస్సిలీల అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నది. హిజ్‌బుల్ల, హమస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ వంటి ‘టెరరిస్టు’ సంస్థల కార్యక్రమాలను బలపరుస్తున్నది. ఆ చర్యలు ఇజ్రాయిల్‌కు, పశ్చిమాసియాలో సుస్థిరతకు ప్రమాదం తెస్తున్నాయని ప్రపంచం నమ్మాలని అమెరికా కోరుకుంటున్నది.
అమెరికా ఒత్తిడికి లొంగిపోయి, ఆయిలు దిగుమతులు తగ్గించినట్లయితే, ప్రస్తుతం ఇరాన్‌లో పొందుతున్న ప్రత్యేక సదుపాయాలన్నిటినీ ఉపసంహరిస్తామని ఇరాన్ భారత్‌కు హెచ్చరిక చేసింది. 2016 మే నెలలో సంతకాలు చేసిన ఇండో ఇరాన్ ఒప్పందం ప్రకారం చాబహార్ రేవు విస్తరణకు వాగ్దానం చేసిన పెట్టుబడులు పెట్టకపోవటంపట్ల ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
చాబహార్ రేవు ఉన్నటువంటి వ్యూహాత్మక ప్రదేశం దృష్టా అది భారత్‌కు ఎంతో ముఖ్యం. అది పాకిస్థాన్‌ను దాటివేసి ఆఫ్ఘనిస్థాన్‌కు, అక్కడి నుంచి పూర్వపు సోవియట్ యూనియన్ మధ్యఆసియా రిపబ్లిక్‌లకు, ఇంకా ఆపైకి భారత్‌కు నేరుగా సంబంధం కల్పిస్తుంది. చాబహార్ 50 కోట్ల డాలర్ల ప్రాజెక్టు. పాకిస్థాన్ చైనాకు లీజుకిచ్చిన గ్వాడార్ రేవుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆసియా శృంగంలోని జిబౌటీలో చైనా నౌకాస్థావరం ఏర్పాటు చేసిన తదుపరి చాబహార్ రేవు ప్రాధాన్యత అపారంగా పెరిగింది. ఇండియా ఇరాన్ ఆఫ్ఘనిస్థాన్ అవగాహన పత్రం (ఎంఒయు) ప్రకారం, చాబహార్ నుంచి హాజిగక్‌కు మార్గం ఉంటుంది. దానికి 20 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ చాబహార్ రేవు భవిష్యత్‌ను దెబ్బతీసే పని ఏదీ చేయరాదు.
నవంబర్ నాటికి ఇరాన్‌నుంచి ఆయిలు దిగుమతి ఆపుచేయని దేశాలు అమెరికా ఆంక్షల కిందకు వస్తాయని ట్రంప్ ప్రభుత్వం బెదిరింపు జారీ చేసింది. అది ఏకైక అగ్రరాజ్యమైనందున ఐరాసతో సంబంధం లేకుండా ఏకపక్షంగా అంతర్జాతీయ పోలీసుగా వ్యవహరించేందుకు దాని హక్కును ఎవరూ ప్రశ్నించరాదు.
అమెరికా ఆదేశానికి ఎటువంటి ప్రతిఘటన లేకుండా భారత్ లొంగిపోయింది. ఇరాన్ నుంచి ఆయిలు దిగుమతిని అమెరికా ఆదేశం జారీ చేసిన తొలినెలలోనే 15.9 శాతం తగ్గించింది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ భారత్‌కు మూడవ అతిపెద్ద ఆయిలు సరఫరాదారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరంలో 13 శాతం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అందువల్ల, ఇరాన్ నుంచి దిగుమతిని పూర్తిగా నిలుపు చేయటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బతగులుతుంది. 2012లో కూడా అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించినపుడు అది మనదేశ ఆర్థిక వ్యవస్థపై , అభివృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపింది.
భారత్ అమెరికా సహకారం పెంపొందుతున్నదని, వేర్వేరు రంగాలకు విస్తరిస్తోందని భారత నాయకులు చెబుతున్నారు. ఇది చిత్రమైన సహకారం ఒక పక్షం ఎల్లప్పుడూ తన అభీష్టాన్ని రెండవ పక్షంపై విధిస్తుంది, ఆ రెండవ పక్షం ఎల్లప్పుడూ దాని దెబ్బను అనుభవించే స్థితిలోనే ఉంటుంది. దిగుమతులపై హెచ్చు సుంకాలు విధించటం, ఉద్యోగాల ఔట్ సోర్సింగ్‌ను తగ్గించటం ట్రంప్ ప్రకటిత విధానం.
ఇవి రెండూ భారత్‌ను దెబ్బతీస్తాయి. సహకారం అనేది రెండు మార్గాల ట్రాఫిక్ వంటిదని, తమ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకు సమర్థవంతమైన చర్యలు తాము తీసుకుంటామని భారత్ అమెరికాకు చెప్పి ఉండాల్సింది. యుద్ధ సమయాల్లో ఒకరి విమానాశ్రయాలు, రేవులను మరొకరు ఉపయోగించుకునే ఒప్పందంపై అమెరికాతో భారత్ ఇంతకు మునుపే సంతకం చేసింది. ఇది ఏకపక్ష ఒప్పందమని చూడగానే చెప్పవచ్చు. ఎందుకంటే, అమెరికా రేవులు, విమానాశ్రయాలను ఉపయోగించుకునే ‘యుద్ధ పరిస్థితి’ని భారత్ ఊహించలేదు. చైనాతో సంఘర్షణ ఏర్పడితే ఈ ఏర్పాటును ఉపయోగించుకునేది అమెరికా మాత్రమే.
130 కోట్ల జనాభాగల భారత్‌ను తమ మాటవినే దేశంగా, తమపై ఆధారపడిన రాజ్యంగా భావించరాదని భారత్ ప్రభుత్వం అమెరికాకు కరాఖండీగా చెప్పాలి. భారతదేశం సర్వసత్తాక రాజ్యం. తమ దేశ మౌలిక ప్రయోజనాలకు వ్యతిరేకమైన అమెరికా ఆదేశాలను ఆమోదించలేమని స్పష్టం చేయాలి. భారత్ అమెరికా సంబంధాలు సమానత్వం, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ ప్రాతిపదికపై అభివృద్ధి చెందాలి.

* బరున్ దాస్ గుప్తా