Home కరీంనగర్ గ్రామాలలో  అడుగంటుతున్న జలం

గ్రామాలలో  అడుగంటుతున్న జలం

The underground water level is falling substantially

ఉమ్మడి జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భ నీటి మట్టం
176 గ్రామాలలో అట్టడుగు స్థాయికి
నూతనంగా రీచార్జ్ షాప్ట్‌లకు శ్రీకారం
 రాష్ట్రంలో ఒకే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్‌తో ఫలితమివ్వని వైనం

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి భూగర్భజలాల పెంపుదలకు అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాలలో ఏ యేటికి ఆ యేడు భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. చెక్‌డ్యాంలు, కాంటూర్ కందకాలు, ఇంకుడు గుంతలు..ఇలా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ పథకాలు అమలు జరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో ప్రస్తుత వేసవిలో 176 గ్రామాలలో భూగర్భ జలం అట్టడుగు స్థాయికి చేరుకున్నట్లు భూగర్భ జలశాఖ నివేదికలు స్పష్టం  చేస్తున్నాయి. ఈ గ్రామాలలో వాల్టా చట్టాన్ని అమలుచేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలని భూగర్భ జలశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. గత ఏడాది కరీంనగర్ జిల్లాలో 24, జగిత్యాల జిల్లాలో 36, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22, పెద్దపల్లి  4 వాణిజ్య అవసరాలకు బోర్లు వేయడంపై ప్రభుత్వం విధించిన నిషేధం నేటికి కొనసాగుతున్నది. ప్రస్తుతం భూగర్భ జలశాఖ ప్రతిపాదించిన 176 గ్రామాలు వీటికి అదనం. వేసవి తీవ్రతకు తోడు నిరంతర విద్యుత్ సరఫరా భూగర్భ జలమట్టం తగ్గిపోతుండటానికి ప్రధాన కారణంగా భూగర్భ జలశాఖ అధికారులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గత యేడాది ఇదే మాసంతో పోల్చిచూస్తే భూగర్భ జలాలు మైనస్ 1.68 మీటర్ల లోటుకు చేరుకోవడం, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో సైతం ఇదే పరిస్థితి కానరావడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.

కరీంనగర్‌లో గత ఫిబ్రవరి, మార్చి మాసాల మధ్యనే భూగర్భ జలాలు 1.04 మీటర్లకు పడిపోయాయి. గ్రానైట్ క్వారీలు, అక్రమ ఇసుక రవాణా కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిపోతున్నది. చొప్పదండి మండలంలో 18.32, గంగాధరలో 19.33, చిగురుమామిడిలో 15.94, కరీంనగర్ పట్టణంలో 17.18 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆయా ప్రాంతాలలో నీటి కొరకు ఇక్కట్లు తప్పడం లేదు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే అత్యంత ఎక్కువగా చొప్పదండిలో మైనస్ 5.10, కరీంనగర్ పట్టణంలో మైనస్ 7.48 మీటర్ల నీటి పరిణామం తగ్గిపోవడం ప్రమాద ఘంటికలను మ్రోగిస్తున్నది. భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేసి, భూగర్భ జల మట్టం తీవ్రంగా పడిపోతున్న ప్రాంతాలలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ముందుకు సాగడంలేదు. భూగర్భ జలాల వృద్ధి, వాటి వినియోగాన్ని పంటలు, జనాభా, పశుపక్షాదుల అవసరాల ప్రాతిపదికన గ్రామాల వారిగా గ్రౌండ్ వాటర్ ఎస్టీమేషన్ కమిటీ అంచనా వేస్తుంది. నీటి నిల్వల కన్న ఖర్చు అధికంగా ఉన్న ప్రాంతాలలో భూగర్భ జల మట్టం పెంచేందుకు తగు సూచనలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యం కారణంగా పరిస్థితి మార్పు రావడం లేదు. భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు వీలుగా గతంలో నెలకొల్పిన ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డ్ పని చేయకుండా వృధాగా పడిపోయాయి. పాత కరీంనగర్ జిల్లా పరిధిలో భూగర్భ జలాలను అంచనా వేసేందుకు గతంలో 124 బోర్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటి ద్వారా నిలకడగా ఉన్న నీటి మట్టాన్ని తెలుసుకోవడం మాత్రమే సాధ్యపడింది. పాత జిల్లాలో పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు మరో రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ వాటర్ లెవల్ రికార్డ్ వినియోగంలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి మండలంలో అత్యాధునికమైన రెండు బోర్లను ఏర్పాటు చేసి వాటిని నేరుగా భూగర్భ జల శాఖ కంప్యూటర్లకు అనుసంధానం చేస్తున్నది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 19 బోర్లను భూగర్భ జల శాఖ ఏర్పాటు చేయించింది. గ్రామీణ అభివృధ్ధి నాబార్డ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు అమలు జరుగుతున్న పథకాలకు తోడుగా వర్షపు నీటిని అత్యంత వేగంగా భూమిలోకి ఇంకించడానికి వీలుగా రీచార్జ్ షాప్ట్‌ను భూగర్భ జల శాఖ ప్రవేశపెట్టింది.
నల్లగొండ జిల్లా మద్దూర్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణలోని 5 జిల్లాల్లో తొలి విడత 181 షాప్ట్‌లను ఏర్పాటు చేయతలపెట్టగా కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలంలోని 5 గ్రామాలు ఇందులో చోటుచేసుకున్నాయి. అయితే మొత్తం పథకం అమలును ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో కరీంనగర్‌లోని 16కు తోడుగా జనగామ జిల్లాలో ప్రతిపాదించిన 12 రీచార్జ్ షాప్ట్‌ల నిర్మాణాల్లో పురోగతి లేకుండా పోయింది. ఈ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని మరో 72 ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు పంపగా మొదటి దశ పనులకే మోక్షం లేకుండా పోయింది. చెక్ డ్యాంల మధ్యలో, జలశయాల నీటి పరివాహక ప్రాంతాలలో 50 మీటర్ల లోతులో బోరు వేసి ఆ ప్రాంతంలో జాలితో ఉండే కేసింగ్‌ను అమర్చడం రీచార్జ్ షాప్ట్‌ల విధానంలో భాగం. వర్షపు నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోవడానికి దీన్ని మెరుగైన పద్దతిగా భూగర్భ జల శాఖ భావిస్తున్నది. ఏదిఏమైనప్పటికీ భూమిలో ఇంకుతున్న వర్షపు నీటి పరిమాణం కన్న వినియోగమే ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలను సమతుల్యంగా ఉంచడం ఇందుకోసం అమలు చేస్తున్న పథకాలతో సాధ్యం కావడంలేదు.