Search
Wednesday 14 November 2018
  • :
  • :

జల పాతాళం

రాష్ట్రంలో మరింతగా అడుగంటుతున్న భూగర్భ జలాలు
76 మండలాల్లో 20 మీటర్ల లోతుకు
గత ఏడాదితో పోల్చితే 50 మండలాల్లో పరిస్థితి విషమం

Under-water

హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 67% భూభాగం లో భూగర్భ జలాలు పది మీటర్ల కంటే లోతుకు పడిపోయాయి. రాష్ట్రంలో 76 మండలాల్లో గరిష్ఠంగా ఇరవై మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని, ఇందులో యాభై మండలాల్లో గతేడాదికంటే నీటిమట్టం దిగువకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ భూగర్భ జలశాఖ తాజా నివేదిక పేర్కొనింది. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో భూగర్భ జలాలు భూమట్టానికి 50.31 మీటర్ల లోతుల్లోకి నీరు పడిపోయినట్లు పేర్కొనింది. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు ఇంకి ప్రమాదస్థాయికి చేరిన జిల్లాల్లో మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్ జిల్లా లు ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 12% గా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో సిర్ఫూర్ టి మండలంలో మాత్రం కనిష్టంగా 0.13 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతోందని స్పష్టంచేసింది. సగటున 5 మీటర్ల లోతుల్లోనే రాష్ట్రంలోని 3 శాతం భూభాగంలో నీటి లభ్యత ఉండగా, 10 మీటర్ల లోతులో ఉన్న భూభాగం 30.5 శాతం దాటింది. 15 మీటర్ల లోతులో నీరున్న భూభాగం 35 శాతం ఉండగా, 20 మీటర్ల వరకు 20 శాతం భూభాగం, 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు పడిపోయింది 12 శాతం భూభాగంలో. రాష్ట్రానికి పశ్చిమ ప్రాంతం, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 15 నుంచి 20 మీటర్ల మధ్యలో భూగర్భ జలం అందుబాటులో ఉంది. 67 శాతం భూభాగంలో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు తగ్గింది.

ఇదిలా ఉండగా గత ఏడాది కాలంలో వికారాబాద్ జిల్లా తాండూరులో 1 సెంటీమీటర్ మేర మాత్రమే నీటిమట్టం తగ్గింది. గరిష్టంగా రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 34.48 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. ఈ ఏడాది కాలంలో 45 శాతం బావుల్లో నీటిమట్టం పెరిగినట్లు భూగర్భ జలశాఖ గుర్తించింది. మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నీటిమట్టం గరిష్టంగా పడిపోగా, మహబూబాబాద్, వనపర్తి, మేడ్చల్ జిల్లాల్లో నీటిమట్టం పెరగడం విశేషం. రాష్ట్రంలో 584 మండలాల్లో 76 మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు పడిపోయి ప్రమాదస్థాయికి చేరాయి. ఇందులో 50 మండలాల్లో గత ఏడాది మే కంటే నీరు మరింత లోతుల్లోకి వెళ్లింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో గరిష్టంగా భూగర్భ నీటిమట్టం తగ్గింది. అయితే నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో సగటున 4.6 మీటర్ల లోతుల్లో నీటిమట్టం ఉండగా, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో మాత్రం 6.41 మీటర్ల లోతుల్లో ఉంది. రాష్ట్రంలో ఏడాదిలో భూగర్భ జలమట్టం సగటున 43 సెంటీమీటర్ల మేర తగ్గింది. గత ఏడాది మే మాసంలో 12.35 మీటర్ల లోతుల్లో ఉండగా, 2018, మే లో 12.78 మీటర్ల లోతుల్లో ఉంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గరిష్టంగా 4.15 మీటర్ల మేర నీటిమట్టం ఏడాది కాలంలో పెరిగింది. ఇదే సమయంలో నల్లగొండ జిల్లాలో మాత్రం కేవలం 5 సెంటీమీటర్ల నీటిమట్టమే పెరిగింది. అయితే 15 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు పడిపోయిన ప్రాంతాల్లో రైతులు తమ వ్యవసాయ పద్దతులు మార్చుకోవాలని భూగర్భ జలశాఖ సూచిస్తోంది. ఇప్పటికే పడిపోయిన నీటికి తోడు గరిష్టంగా వినియోగించడం కొనసాగిస్తే దుర్భిక్ష పరిస్థితులు ఎదురకయ్యే ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. ఈ ప్రాంతం రాష్ట్ర భూభాగంలో 31 శాతం ఉంటుంది. నీటి పొదుపు, సమర్ధ నిర్వహణకు యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేయాలని ప్రభుత్వానికి ఆ శాఖ సూచించింది. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్దతులు, ఆరు తడి పంటలు వేయడం, లేజర్ లెవలింగ్, పైపుల ఇరిగేషన్, ఇతరత్రా పద్దతులు పాటించి నీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని భూగర్భ జలవనరుల శాఖ ప్రభుత్వానికి సూచించింది. ప్రజలు కూడా జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని పిలుపునిచ్చింది.
సగటున 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు పడిపోయిన మండలాలు..
రాష్ట్రవ్యాప్తంగా 20 మీటర్లు, అంత కంటే ఎక్కువ లోతుల్లోకి నీరు పడిపోయిన మండలాలు 76 ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోబజార్‌హత్నూరు, నేరడిగొండ మండలాలు, భద్రాద్రి జిల్లాలో అశ్వారావుపేట, కొత్తగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్ మండలం, హైదరాబాద్ జిల్లాలో మారేడ్‌పల్లి మండలం, కామారెడ్డి జిల్లాలో భాన్స్‌వాడ, బిక్నూరు, బిర్కూరు, దోమకొండ, జుకల్, కామారెడ్డి, మడ్నూరు, పిట్లం, తాడ్వాయి మండలాల్లో నీటిమట్టం పడిపోయింది. ఖమ్మం జిల్లాలో రఘునాధపాలెం, మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, ధన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, మరికల్, నవాబ్‌పేట మండలాలు, మంచిర్యాల జిల్లాలోని వేమన్‌పల్లి మండలం, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, నిజాంపేట, శంకరంపేట, శంకరంపేట రూరల్, శివంపేట, టెక్మల్ మండలాలు, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్ మండలం, నాగర్‌కర్నూలు జిల్లాలోని బల్మూరు, చారకొండ, వంగూరు మండలాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని బొమ్మకల్, తిప్పర్ధి, నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూరు మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్, మాడ్గుల, మంచాల, షాబాద్, శంకర్‌పల్లి మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్, ఆంధోల్, గుమ్మడిదల్ల, జిన్నారం, మునిపల్లి, పులకల్, ఆర్‌సి పురం, సదాశివపేట, వట్‌పల్లి మండలాలు, సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు, దౌల్తాబాద్, మద్దూరు, మర్కూడ్, మిర్దొడ్డి, నంగనూరు, సిద్ధిపేట మండలాలు ఉన్నాయి. ఇదేవిధంగా సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సూర్యాపేట జిల్లాలోని మోతె, తిరుమలగిరి మండలాలు, వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల, నవాబ్‌పేట, తాండూరు మండలాలు, యాదాద్రి జిల్లాలోని రామన్నపేట, వలిగొండ తదితర మండలాలు ప్రమాదకర జాబితాలో ఉన్నాయి.

Comments

comments