Home ఎడిటోరియల్ మానవ ఆరోగ్యానికి గోమూత్రం

మానవ ఆరోగ్యానికి గోమూత్రం

Cow

మానవ వినిమయంలో గోవుమూత్రం ప్రయోజనాల గూర్చిన ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లగాయితూ గత మూడేళ్లలో ఈ ప్రచారం అనేకరెట్లు పెరిగింది. ఆరగించే ఏ వస్తువు అయినా దాని ఉపయుక్తత, నిరపాయత రుజవు అయి ఉండాలి. ఔషధ వినియోగ ముద్ర ఉన్న వస్తువుల విషయంలో ఇది మరీ ముఖ్యం.
ప్రామాణిక నిరూపణ సైన్స్‌కు మూలం. లేబరేటరీ అధ్యయనాలు, క్షేత్ర పరీక్షలు, వాస్తవ జీవితంలో పరీక్షలు జరుగుతాయి. మానవుడు గుహల్లో నివసించిన నాటినుంచి నేటివరకు మానవజాతి పురోగమనానికి ఇదే ప్రాతిపదిక. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ రూపాలు కూడా కాలంతోపాటు మారుతూ వస్తున్నా యి. ప్రకృతిలో సంభవించిన కారణాలవల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి వాటికి చికిత్సలు కూడా అందులోనే ఉంటాయన్న ప్రాతిపదికపై ప్రాచీనకాలంలోని తాత్వికులు, భౌతిక శాస్త్రవేత్తలు ప్రకృతిలో పరిశోధనలు చేశారు. అది ప్రపంచంలోని వివిధ ప్రాంతా ల్లో భిన్నమైన చికిత్సా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది.
భారతదేశంలో ఆయుర్వేద, సిద్ధ, గ్రీస్‌లో యునాని, చైనాలో ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వగైరా అలాంటివే. ఈ వైద్యరీతులన్నీ మధ్యయుగకాలంలో అభివృద్ధి అయినాయి.
నూతన శాస్త్రీయ అన్వేషణల ప్రాతిపదికపై ఆరోగ్యసంరక్షణ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆధునిక శాస్త్రీయ వైద్యరీతి నాటి పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించింది. జీవవ్యవస్థ నిర్మాణ స్వరూపం, పనితీరును మనం అవగాహన చేసుకోవటానికి అనాటమీ, ఫిజియోలజీ తోడ్పడ్డాయి.
అవసరమైన వాటిని వినియోగించుకోవటానికి, అవసరంలేని లేదా హానికరమైన పదార్థాలను విసర్జించటానికి మనదేహంలో విస్తృతమైన వ్యవస్థ ఉంది. మనం భుజించిన ఆహారంలో కొంతభాగం జీర్ణం కావటం, మిగతాది జీర్ణప్రక్రియ వ్యవస్థ ద్వారా విసర్జించబడటం మనందరికీ తెలుసు. ఆహారం దేహంలో సరళపదార్థంగా మారినాక, ఇతర వ్యర్థ పదార్థాలు మూత్రంద్వారా విసర్జించబడతాయి. అందువల్ల, గోవుమూత్రం, మానవమూత్రంలోని రసాయినిక పొందికలను సరిపోల్చిచూడటం, మానవ మూత్రంకన్నా గోమూత్రం ఉపయుక్తమైంది, మేలైనదని ఆధారపూర్వకంగా నిరూపించటం ముఖ్యం.
రక్తప్రసరణ మార్గాలనుంచి వ్యర్థపదార్థాలను తొలగించటానికి మూత్రపిండాలు ఉత్పత్తి చేసే ద్రవం మూత్రం. గోవు, మనిషి మూత్రంలో ప్రాథమికంగా ఉండే పదార్థాలు నీరు, యూరియా, సోడియం, క్లోరైడ్, సల్ఫేట్, పొటాషియం, ఫాస్పేట్, క్రియాటినైన్, అమ్మోనియా, యూరిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం. ఈ రసాయినాలు ఇతర మూలాలనుంచి కూడా లభ్యమవుతాయి.
మనిషి, గోవు మూత్రంలోని పదార్థాలు సరిపోలి ఉన్నప్పుడు, గోమూత్రంలోని పదార్థాలు మాత్రమే మానవ దేహానికి ఉపయోగకరం అని విశ్వసించటం కష్టం.
మానవ శరీరానికి ఆవుమూత్రం, పేడ ఉపయోగం గూర్చి మరింత శాస్త్రీయ సమాచారం తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద భారతప్రభుత్వ పశు సంవర్థక, పాడి, మత్సశాఖ నుంచి పొందిన సమాచారం ఇలా చెబుతోంది.
పశువుల విభాగానికి చెందిన సిపిఐఒ అటువంటి సమాచారాన్ని కలిగిలేదు అని వారు సమాధానమిచ్చారు. లూథియానాలోని గురు అంగద్‌దేవ్ వెటర్నరీ, యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీనుంచి అదే సమాచారాన్ని కోరటం జరిగింది. తమవద్ద అటువంటి సమాచారం లేదని 22 యూనివర్శిటీ డిపార్టుమెంట్లు సమాధానమిచ్చాయి. భారత పరిశోధనా మండలి వ్యవసాయ యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల్ని అధ్యయనం చేసి 2016- 17సంవత్సరానికి ఇచ్చిన ర్యాంకింగ్‌లో దేశంలోని 14 వెటర్నరీ యూనివర్శిటీలలో లూధియానా యూనివర్శిటీ ప్రధమస్థానం పొందింది.
పశువైద్యరంగంలో దేశంలోని అత్యున్నతస్థాయి విద్యాసంస్థల్లో మానవ ఆరోగ్యానికి గోమూత్రం ప్రయోజకత్వం గూర్చిన శాస్త్రీయ సమాచారం లేదని వెల్లడైంది. తద్భిన్నంగా, గోమూత్రం మిశ్రితాంశాలు విషప్రభావం కలుగజేస్తాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేగాక, గోమూత్రాన్ని ఉన్నది ఉన్న ట్లు తాగటం అంటురోగాలు తెచ్చిపెడుతుంది, తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీయవచ్చు.
ప్రసిద్ధ చరిత్రకారుడు డి.ఎన్.ఝా ప్రకారం, గోవు, దాని ఉత్పత్తులు (పాలు, పెరుగు, వెన్న, పేడ, మూత్రం) లేదా పంచగవ్యగా పిలవబడే వాటి మిశ్రమం మధ్యయుగంలో పరిశుద్ధ పాత్రను పొందింది. అయితే ఇక్కడ కూడా, మహిళలు, తక్కువ కులాల వారు దాన్ని వినియోగించటాన్ని పలు ధర్మశాస్త్రాలు నిషేధించాయి. శూద్రుడు గోమూత్రం త్రాగితే నరకానికి పోతాడట!
అందువల్ల, మానవ ఆరోగ్యంలో గోమూత్రం పాత్ర గురించి ఎవరైనా సంశయించాల్సిందే. ఎందుకంటే దానికి రుజవులు లేవు. అది శాస్త్రం కాదు, ఒక విశ్వాసం. అయితే గోమూత్రం మేళ్ల గూర్చి ఇటీవలకాలంలో జరుగుతున్న ప్రచారం ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల హిందూత్వ ఎజండాతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఫార్మాస్యూటికల్ మంత్రిత్వశాఖ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈ ప్రచారాన్ని ఆపేందుకు ఇప్పటికైనాజోక్యం చేసుకోవాలి. ఆది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య.

– రచయిత లూధియానాకు చెందిన ప్రముఖ ఇఎన్‌టి నిపుణుడు.

‘శాంతి, అభివృద్ధికి భారతీయ డాక్టర్లు’ అనే సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు.
భారతదేశంలో నైతిక ఆరోగ్య సంరక్షణ కొరకు డాక్టర్ల అలయెన్స్ కోర్‌కమిటీలో ప్రస్తుతం సభ్యుడు.
ఇమెయిల్ ఐడి : idpd2001@hotmail.com